షర్మిలకు రాజకీయ ఇంధనం మోడీ ఇస్తారా ?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కొత్త ఏడాదిలో చేపట్టే తొలి పార్టీ కార్యక్రమానికి విశాఖను ఎంచుకున్నారు.

Update: 2025-01-07 06:30 GMT

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కొత్త ఏడాదిలో చేపట్టే తొలి పార్టీ కార్యక్రమానికి విశాఖను ఎంచుకున్నారు. విశాఖకు ఆమె ఈ నెల 10న రానున్నారు ఆ రోజున ఆమె కాంగ్రెస్ సిటీ ఆఫీసులో జై బాపూజీ, జై భీంజై సంవిధాన్ పోస్టర్ ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఆమె విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మౌన నిరసన దీక్ష కూడా చేపడతారు. అని పార్టీ వర్గాలు తెలిపాయి. షర్మిల ఇటీవల కాలంలో పార్టీ యాక్టివిటీ ని పెద్దగా చేయడం లేదని అంటున్నారు.

అయితే ఆమె విశాఖ నుంచే కాంగ్రెస్ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు అని అంటున్నారు. అంతే కాదు ఆమె విశాఖను ఎంచుకోవడం వెనక రాజకీయంగా కారణాలు ఉన్నాయని అంటున్నారు. విశాఖకు ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. ఆయన విశాఖలో భారీ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద మోడీ వైఖరి ఏంటి అన్నది ఈ సభ ద్వారా తేలనుంది.

దాంతో ఆయన వెళ్ళిన మరుసటి రోజే షర్మిల విశాఖకు రావడంతో రాజకీయంగా కాంగ్రెస్ కి ఇంధనం దొరుకుతుంది అని అంటున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీని తీవ్రంగా ఎండగడుతూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ఏపీలో కూడా అదే పంధాను అనుసరిస్తోంది. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడం పట్ల కాంగ్రెస్ నిరసన తెలియచేస్తోంది. ఏపీకి ప్రత్యేకించి ఉత్తరాంధ్రకు ఆయువు పట్టుగా ఉన్న ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయవద్దు అని డిమాండ్ చేస్తోంది.

ప్రధాని దాని మీద స్పష్టమైన ప్రకటన చేయకపోతే విశాఖకు వస్తున్న షర్మిల దాని మీద ఘాటుగానే రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. దాంతో ఆమె విశాఖ టూర్ ఆసక్తిని పెంచుతోంది. ఆ మధ్య కూటమి ప్రభుత్వం విద్యుతు భారాలు మోపిందని పేర్కొంటూ విజయవాడలో మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించిన షర్మిల ఇపుడు విశాఖ ఉక్కు మీద విశాఖ నుంచే ఏదైనా కార్యక్రమాన్ని ప్రకటిస్తారా అన్నది కూడా చర్చించుకుంటున్నారు. మొత్తానికి ప్రధాని సహా కూటమి నేతలు విశాఖను వేదికగా చేసుకుని ఏపీని ఫోకస్ చేయాలని చూస్తున్న వేళ షర్మిల కూడా అదే విశాఖను ఎంచుకోవడం మాత్రం కొంత చర్చకు తావిస్తోంది.

Tags:    

Similar News