ఓటు పర్సెంటేజ్ తగ్గింది అంటే మోడీకి భయమేస్తోందా ?

లేకపోతే ఏమిటి మరీ ఇంత నీరసంగా పోలింగ్ సాగడం అని అంతా అంటున్నారు.

Update: 2024-04-27 09:38 GMT

దేశంలో ట్రెండ్ మారుతోందా. ఓటర్ల ఆలోచనల్లో మార్పు కనిపిస్తోందా. ఎందుకొచ్చిన ఓటింగ్ అన్న నిర్వేదం నిరాశ జనాలలో ఎక్కువ అయిందా అంటే గత రెండు విడతలుగా జరిగిన పోలింగ్ సరళిని చూసిన వారికి ఇదే నిజం అనిపిస్తోంది. అంటే బలమైన నాయకుడు ప్రజాకర్షణ నేత మరోసారి దేశానికి ప్రధాని ఈయనే అవాలి అని బీజేపీ నేతలు ఎంత ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నా జనాలకు మోడీ విషయంలో పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే కనిపించడం లేదా అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.

లేకపోతే ఏమిటి మరీ ఇంత నీరసంగా పోలింగ్ సాగడం అని అంతా అంటున్నారు. పొలిటికల్ ఎనలిస్టులు అయితే ఈ పోలింగ్ సరళిని చూస్తే బీజేపీ పట్ల జనాలకు పూర్తి స్థాయిలో అనుకూలత కనిపించడం లేదు అని కూడా విశ్లేషిస్తున్నారు. అదే కనుక ఉంటే 2019 మాదిరిగా వెల్లువలా జనాలు పోలింగ్ బూతులకు తరలి వచ్చేవారు అని అంటున్నారు.

మొదటి విడత ఓటింగ్ ని చూసే షాక్ తింటే రెండవ విడతలో జరిగిన పోలింగ్ శాతం చూస్తే ఇంకా నిరాశ పడాల్సి వస్తోంది. 2019 ఎన్నికలతో పోలిస్తే బాగా తగ్గింది ఇది దేనికి సూచిక అన్న చర్చ స్టార్ట్ అయింది. అంతే కాదు దేనికి సంకేతం అని ఎవరికి వారుగా విశ్లేషించుకుంటున్నారు.

అయితే ఎప్పటిలాగానే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఎక్స్ సామాజిక మాధ్యమం వేదికగా ఓటింగుకు వచ్చి ఓట్లేసిన జనాలు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అంతే కాదు యూత్ మహిళలు అంతా ఎన్డీయేకు మద్దతుగా నిలిచారు అని కితాబు కూడా ఇచ్చారు.

ఇక తగ్గిన పోలింగ్ శాతం మీద రకరకాలైన విశ్లేషణలు వస్తున్నాయి. పోలింగ్ శాతం తగ్గింది అంటే అది అధికార పక్షానికి పెద్ద మైనస్ పాయింట్ అని అంటున్నారు. ఉత్తర భారత దేశంలో బీజేపీకి మంచి పట్టు ఉంది. అనేక హిందీ రాష్ట్రాలు బీజేపీ అంటే ఊగిపోతాయి. వారే స్వయంగా పోలింగ్ బూతులకు వచ్చి ఓట్లెత్తి మరీ కాషాయ జెండాను రెపరెపలాడిస్తారు.

గత రెండు ఎన్నికల్లో అదే జరిగింది. విరగబడి వచ్చిన జనాలు బీజేపీకి పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చారు అని కూడా అంతా భావించారు. కానీ ఈసారి సీన్ రివర్స్ అవుతోంది. పోలింగ్ శాతం ఢమాల్ అంటూ ఒక్కసారిగా తగ్గిపోయింది.

ప్రత్యేకించి బీజేపీకి పట్టున్న చోట్లనే ఓటింగ్ శాతం తగ్గడం గమనార్హం అని అంటున్నారు. దీంతో బీజేపీకి మోడీకి టెన్షన్ పట్టుకుంది అని అంటున్నారు. ఇది పొలిటికల్ సర్కిల్స్ లో ఎక్కువగా వినిపిస్తోంది. నిజానికి చూస్తే తగ్గిన పోలింగ్ శాతం ఎపుడూ అధికార పార్టీకి ప్లస్ అవుతూ వచ్చేది.

అయితే అవి గతకాలం లెక్కలుగా ఉన్నాయి. పోలింగ్ విరగబడి జరిగింది అంటే అది అధికారంలో ఉన్న పార్టీకి ఆదరణ అన్న సిగ్నల్స్ ని కూడా విశ్లేషకులు పట్టుకుంటూంటారు. ఇపుడు పోలింగ్ శాతం తగ్గడం అంటే కచ్చితంగా ఓటర్లు నిరాశలో ఉన్నారని అంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీ పట్ల వారు ఏమంత సంతృప్తిగా లేరు అని అనుకోవాల్సి వస్తోంది అని అంటున్నారు. బీజేపీకి ఓటెత్తడానికి జనాలు పోలింగ్ బూతులకు రావడం లేదా అన్న చర్చ కూడా రాజకీయ విశ్లేషకులు చేస్తున్నారు.

అయితే ఎండలు ధాటీగా కాస్తున్నాయి అని బీజేపీ నేతలు సర్ది చెప్పుకోవచ్చు కానీ 2019లోనూ వేసవిలోనే ఎన్నికలు జరిగాయి. నాడు లేని ఎండల భయం నేడు ఎందుకు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇవన్నీ చూసిన వారు మాత్రం తగ్గిన పోలింగ్ శాతం ఏదో సిగ్నల్ నే స్ట్రాంగ్ గా పంపుతోంది అని అంటున్నారు. అది రెడ్ సిగ్నల్ అయితే ఎవరికి ఎందుకు అన్నది కూడా చూడాల్సి ఉంది.

ఇప్పటికి కేవలం రెండు దశల ఎన్నికలు మాత్రమే జరిగాయి. మరి మిగిలిన అయిదు దశల ఎన్నికలు పూర్తి అయ్యేసరికి టోటల్ పిక్చర్ వస్తుందని కూడా అంటున్నారు. ఏది ఏమైనా తగ్గిన పోలింగ్ మాత్రం కాషాయ దళంలో కలవరం రేపుతోంది అన్నది అంతా అంటున్న మాటగా ఉంది.

Tags:    

Similar News