ముద్రగడ...చేగొండి...రీ సౌండ్ చేస్తారా...!?

వారితో గోదావరి జిల్లాలలో రాజకీయాన్ని బ్యాలెన్స్ చేయాలని వ్యూహ రచన చేసింది.

Update: 2024-03-21 16:30 GMT

బలమైన సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాలకు చెందిన నాయకులను వైసీపీ ఎన్నికల ముందు తన పార్టీలో చేర్చుకుంది. వారితో గోదావరి జిల్లాలలో రాజకీయాన్ని బ్యాలెన్స్ చేయాలని వ్యూహ రచన చేసింది.

అనుకున్నదే తడవుగా వారిని సాదరంగా ఆహ్వానించి కండువా కప్పేసింది. దాంతో ఒక పని అయిపోయింది. అయితే అసలు కధ మాత్రం చాలానే ఉంది. ఇంతకీ ఆ కధ ఏంటి ఆ ఇద్దరు ప్రముఖులు ఎవరూ అంటే ఒకరు మాజీ మంత్రి చేగొండి హరిరామయ్య జోగయ్య కుమారుడు చేగొండి సూర్య ప్రకాష్ మరొకరు కాపు నేత ముద్రగడ పద్మనాభం.

ఈ ఇద్దరిని ముందు పెట్టి జనసేనను కౌంటర్ చేయాలని వైసీపీ మాస్టర్ ప్లాన్ వేసింది. చేగొండి హరిరామజోగయ్య విషయం తీసుకుంటే ఆయనది అయిదు దశాబ్దాల పై బడిన రాజకీయం. ఆయన రాజకీయంగా లైం లైట్ లో ఉన్న కాలంలో కుమారుడిని రాజకీయంగా ముందుకు తేలేకపోయారు. ఇక ప్రజారాజ్యం, వైసీపీ జనసేన దాని కంటే ముందు కాంగ్రెస్ టీడీపీ ఇలా అన్ని పార్టీలు తిరిగారు చేగొండి.

ఘనమైన పదవులు కూడా నిర్వహించారు. అటువంటి చేగొండి జనసేనలో పెద్దన్న పాత్ర పోషించాలనుకున్నారు. ఆయనను ముఖ్య సలహాదారుడిగా ఒకనాడు పవన్ భావించారు. కానీ తరువాత కాలంలో మాత్రం మీ సలహాలు నాకు వద్దు అని పక్కన పెట్టేశారు. దాంతో చేగొండి మనస్తాపం చెందారు. ఆయన కుమారుడు సూర్య ప్రకాష్ ఈ దఫా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చూసారు. ఆయన ఆచంట టికెట్ ఆశించి భంగపడ్డారు.

అలా పవన్ మీద కోపంతో చేగొండి కుమారుడు వైసీపీలో చేరిపోయారు. ఇక ముద్రగడ తీరు వేరు. ఆయన వైసీపీ వైపే అని అనుకున్నా మధ్యలో బిగ్ ట్విస్ట్ అన్నట్లుగా జనసేనలోకి వెళ్లాలని చూశారు. కానీ ఎందుకో కుదరలేదు. ఇక పవన్ ముద్రగడ ఇంటికి వస్తారని అనుకున్నా ఆయన రాలేదు. పైగా అవమానం జరిగింది అని ఆయన భావించారు.

మొత్తం మీద చూస్తే ముద్రగడకు చంద్రబాబు అంటే కోపం. దాంతో పాటు జనసేనాని కూడా తనను హర్ట్ చేశారు అన్న బాధ ఉంది. దాంతో ఆయన కూడా వైసీపీ వైపు మళ్లారు. ఈ ఇద్దరూ వైసీపీకి కాపుల నుంచి ఐకాన్లుగా మారారు.

వీరి ద్వారా బలమైన సామాజిక వర్గం గోదావరి జిల్లాలలో తమ వైపుకు తిరుగుతుందని భావించారు. కానీ అలా జరుగుతుందా అన్నదే ఇపుడు చర్చ. ఎందుచేతనంటే కాపులు కాదు ఎవరైనా ఎవరిని అయినా నమ్మాలంటే విశ్వసనీయత ఉండాలి. ముద్రగడ కాపు ఉద్యమ నేతగా ఉన్న కాలంలో ఆయన ఎలా అంటే అలా సాగింది.

ఆయన మాట కూడా కాపులు విన్నారు. ఇపుడు అంతా మారిపోయింది. పైగా కాపు ఉద్యమం పూర్తిగా టీడీపీ మీదనే అన్నట్లుగా చేసి కాడె వదిలేశారు అన్న విమర్శలు ఉన్నాయి. ఇపుడు వైసీపీ వైపు నుంచి వచ్చి కాపులను చేతులు కలపమని చెబితే వింటారా అన్నదే ప్రశ్న.

కాపులే కాదు ఎవరైనా తమకు ఫలనా మేలు చేస్తామని చెబితే ఆయా వర్గం ప్రజలు టర్న్ అవుతారు. కానీ అలాంటిది లేకుండా తమ సొంత అజెండాలు తీసుకుని వచ్చి పార్టీలు మారితే ఆ మీదట జనాలు కూడా తమ వెంట నడచిరావాలి అంటే కుదిరే పనేనా అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా చూస్తే చేగొండి వల్ల పశ్చిమ గోదావరి ముద్రగడ వల్ల తూర్పు గోదావరి తమకు అనుకూలం అవుతాయని వైసీపీ భావిస్తోంది.

అయితే విశ్వసనీయత అన్నది ముఖ్యం అంటున్నారు. కాపులు చూస్తే గతంలోలా ఆవేశంతో లేకుండా ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. దాంతో కాపుల విషయంలో మద్దతు ఎవరికి అంటే అది లోతుగా అధ్యయనం చేయాల్సిందే అని అంటున్నారు. అదే విధంగా చెప్పే వారి మీద కూడా వారికి ఒక రకమైన పాజిటివిటీ ఉండాలని అంటున్నారు. మరి ఈ ఇద్దరు నేతల విషయంలో అది జరిగేనా అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.

Tags:    

Similar News