ఎలన్ మస్క్ కి ఎదురు తిరిగిన అమెరికా
ట్రంప్ అండతో చెలరేగిపోదామనుకున్న మస్క్ కు ఇప్పుడ అమెరికా ఉద్యోగులంతా ఎదురుతిరగడం.. ఆయన చెప్పినట్టు వినమంటూ మండిపడడంతో ట్రైయిన్ రివర్స్ అయినట్టు అయ్యింది.
‘ముందుగ మురిస్తే పండుగ కాదన్న సంగతి’ అమెరికా కుబేరుడు ఎలన్ మస్క్ కు త్వరగానే అర్థమైంది. తన కంపెనీల్లోని ఉద్యోగుల మాదిరి అమెరికా ప్రభుత్వ ఉద్యోగులతోనూ వ్యవహరిస్తానంటే కుదరదని తేటతెల్లమైంది. గత అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు సహకరించాడని.. తన డబ్బు, ట్విట్టర్, పరపతి ద్వారా రిపబ్లికన్స్ గెలుపులో కీలక పాత్ర పోషించాడని.. ట్రంప్ కు రైట్ హ్యాండ్ గా ఉంటూ అన్నీ చక్కబెట్టాడని ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఎనలేని ప్రాధాన్యం కొత్త ప్రభుత్వంలో దక్కింది. స్వయంగా డొనాల్డ్ ట్రంప్ సైతం తన పక్కనే మస్క్ ను పెట్టుకొని జాతీయ, అంతర్జతీయ వ్యవహారాల్లో కనిపించారు. భారత ప్రధాని నరేంద్రమోడీ వచ్చినప్పుడు సైతం మస్క్ పక్కనే ఉండి ప్రాధాన్యత పొందారు. మరి ఇంతటి ఎలన్ మస్క్ కు ఇప్పుడు అమెరికా షాకిచ్చింది. అమెరికా దర్యాప్తు సంస్థ (ఎఫ్.బీఐ నూతన డైరెక్టర్, భారత సంతతి కాష్ పటేల్ తాజాగా ఎలన్ మస్క్ ను కూరలో కరివేపాకులా తీసిపారేశారు. ట్రంప్ అండతో చెలరేగిపోదామనుకున్న మస్క్ కు ఇప్పుడ అమెరికా ఉద్యోగులంతా ఎదురుతిరగడం.. ఆయన చెప్పినట్టు వినమంటూ మండిపడడంతో ట్రైయిన్ రివర్స్ అయినట్టు అయ్యింది.
-మస్క్ చేసిన మెయిల్ వివాదానికి కారణం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎలాన్ మస్క్ తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు పంపిన మెయిల్ ప్రస్తుతం పెద్ద వివాదాస్పదంగా మారింది. ఉద్యోగులందరూ గతవారం తాము ఏం పని చేశారో వివరించాలనే ఆయన విజ్ఞప్తి, అలా చేయలేని పక్షంలో రాజీనామా చేయాలని సూచించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
-ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ స్పందన
ఈ వివాదంపై అమెరికా దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ) నూతన డైరెక్టర్, భారత సంతతికి చెందిన కాష్ పటేల్ తన అధికారిక మెయిల్ ద్వారా స్పందించారు. మస్క్ మెయిల్ గురించి ఎఫ్‌బీఐ ఉద్యోగులు పట్టించుకోనవసరం లేదని, సంస్థ ఉద్యోగుల సమీక్షను ఎఫ్‌బీఐ డైరెక్టర్ కార్యాలయం నిర్వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. "ఎఫ్‌బీఐ సిబ్బందికి సమాచారాన్ని కోరుతూ యూఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ (OPM) నుంచి ఈ-మెయిల్ వచ్చి ఉండొచ్చు. సంస్థ ఉద్యోగుల సమీక్ష ప్రక్రియకు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కార్యాలయం బాధ్యత వహిస్తుంది. FBI విధానాలకు అనుగుణంగా సమీక్షలను నిర్వహిస్తాము. ఒకవేళ మరిన్ని వివరాలు అవసరమైతే మిమ్మల్ని మేము సమన్వయం చేసుకుంటాం. ప్రస్తుతానికి ఏ మెయిల్స్‌కూ స్పందించవద్దు." అని కాష్ పటేల్ తన మెయిల్‌లో పేర్కొన్నారు.
-ఉద్యోగ సంఘాల ఆగ్రహం
అమెరికాలోనే అతి పెద్ద ఉద్యోగ సంఘం అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ (AFGE) నేషనల్ ప్రెసిడెంట్ ఎవెరెట్ కెల్లీ మస్క్ చర్యలను తీవ్రంగా ఖండించారు. ట్రంప్ చర్యలు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల, దేశ ప్రజలకు అందించే సేవల పట్ల ఆయనకు ఉన్న నిర్లక్ష్యాన్ని చూపుతున్నాయని ఆరోపించారు. "ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఉద్యోగులను తొలగించేందుకు ప్రయత్నిస్తే, మేము సవాల్ చేస్తాము. మస్క్ తన జీవితంలో ఒక్కసారి కూడా నిజాయితీగా ప్రజా సేవ చేయలేదు. అలాంటి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగులకు విధుల గురించి చెప్పడం కించపరిచే అంశం." అని కెల్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలు తమకు వచ్చిన మెయిల్‌కు సమాధానం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు.
-మెయిల్ పై మస్క్ వెనుకడుగు
తన మెయిల్ పై వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో ఎలాన్ మస్క్ కొంత వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎక్స్ (ట్విట్టర్) లో మస్క్ స్పందిస్తూ, "అర్ధమయ్యేలా కొన్ని బుల్లెట్ పాయింట్లతో కూడిన మెయిల్ పంపినా చాలని" వ్యాఖ్యానించారు.
ఎలాన్ మస్క్ మెయిల్ చుట్టూ నెలకొన్న వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. ఉద్యోగుల హక్కులను కాపాడేందుకు ఉద్యోగ సంఘాలు కదిలిన వేళ, ప్రభుత్వానికి, కార్పొరేట్ సంస్థలకు మధ్య శక్తిపోరాటం ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఘటన అమెరికా ఉద్యోగుల భద్రత, పాలనా వ్యవస్థపై భారీ ప్రభావం చూపే అవకాశముంది. మస్క్ దూకుడుపై అమెరికా ఉద్యోగులు, సిబ్బంది అంతా ఎదురుతిరగడంతో ఇప్పుడు ట్రంప్ సర్కార్ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.