మైనంపల్లి కి టికెట్... అయినా వికెట్ పడబోతోందా...?

ఈ నేపధ్యంలో హనుమంతరావు ప్లాన్ బీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు అని అంటున్నారు. ఆయన కాంగ్రెస్ కి టచ్ లోకి వెళ్తారని అంటున్నారు.

Update: 2023-08-21 17:27 GMT

బీయారెస్ లో టికెట్ రాని వారు చిచ్చు రేపడం ఒక ఎత్తు. కానీ వారి నుంచి ఏమీ పెద్దగా సౌండ్ రావడంలేదు. వారి కంటే ముందు ఒక సీనియర్ ఎమ్మెల్యే, మల్కజిగిరికి చెందిన బీయారెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గొంతు పెంచారు. కేసీయార్ టికెట్ల ప్రకటన చేస్తారనగా కొద్ది గంటల ముందు ఆయన చేసిన వివాదస్పద వ్యాఖ్యలు బీయారెస్ పెద్దలకు గట్టిగానే తగిలింది.

తనకూ తన కుమారుడికి టికెట్ ని ఆయన కోరుకుంటున్నారు. ఇది బాహాటంగా చెబుతున్నారు. దానికి ఏకంగా కేసీయార్ ఫ్యామిలీనే ముగ్గులోకి లాగుతున్నారు ఆ కుటుంబానికి మూడు టికెట్లు ఇస్తే నాకు రెండు అయినా ఇవ్వవద్దా అని రచ్చ చేస్తున్నారు. అంతటితో ఆగలేదు. బీయారెస్ లో కీలక నేత హరీష్ రావుకే గురి పెట్టేసారు.

మెదక్ జిల్లా రాజకీయాలతో హరీష్ రావుకు ఏమి పని అంటూ విరుచుకుపడ్డారు. మెదక్ అసెంబ్లీ సీటులో తన కుమారుడిని నిలబెట్టాలని హముమంతరావు ఆలోచన. అయితే దానికి కేసీయార్ మేనల్లుడు, మంత్రి అయిన హరీష్ రావు అడ్డు తగులుతున్నాడని, తన పలుకుబడి ఉపయోగించి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి టికెట్ ఇప్పిస్తున్నారు అని హనుమంతరావు అభియోగం.

అందుకే తాను కూడా సిద్ధిపేటకు వస్తానని ఏకంగా హరీష్ రావు మీదనే పోటీకి దిగుతామని దారుణమైన ప్రకటనలు చేసారు. హరీష్ రావుకు మెదక్ జిల్లాకు లింక్ ఏంటి అంటూ అవమానకరంగా మాట్లాడారు. ఆ తరువాత కూడా ఆయనకు కేసీయార్ టికెట్ ఇవ్వడం ఆశ్చర్యకరం. దీని మీద సన్నిహితులతో కేసీయార్ ఒక మాట అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఆయనకు ఒక టికెట్ ఇచ్చాం, అది తీసుకుని ఉండడమో లేదో ఆయన ఇష్టం అని. అయితే విషయం ఇలా ఉంటే కేటీయార్ దీని మీద అమెరికా నుంచి ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. హరీష్ రావుని అవమానిస్తూ ఒక ఎమ్మెల్యే మాట్లాడారు.

హరీష్ రావు బీయారెస్ కి పునాది, ఆయన పార్టీ పుట్టుక నుంచి ఉన్నారు. ఆయనను పట్టుకుని ఎవరేమి మాట్లాడినా తప్పే అని కేటీయార్ ఖండించడం విశేషం. అంతే కాదు ఈ కీలక సమయంలో మనమంతా హరీష్ రావుకు అండగా ఉందామని కూడా చెప్పుకొచ్చారు. దీంతో పాటు మైనంపల్లి అన్న హాట్ కామెంట్స్ మీద ఇపుడు హై కమాండ్ దృష్టి సారించింది అని అంటున్నారు.

ఒకటి రెండు రోజులలో అక్కడక్కడ చేసిన మార్పు చేర్పులలో మల్కజ్ గిరీ టికెట్ ని హనుమంతరావుకు ఎగరగొడతారని అంటున్నారు. అయితే హనుమంతరావు తనకు టికెట్ ఇచ్చినందుకు బీయారెస్ హై కమాండ్ కి ధన్యవాదాలు చెబుతూ తన కుమారుడికి టికెట్ నిరాకరించిన పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పినప్పటికీ అప్పటికే అది చాలా ఆలస్యం అయింది. ఒకట్రెండు రోజుల్లో మైనంపల్లిని కేసీఆర్ జాబితా నుంచి తప్పించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపధ్యంలో హనుమంతరావు ప్లాన్ బీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు అని అంటున్నారు. ఆయన కాంగ్రెస్ కి టచ్ లోకి వెళ్తారని అంటున్నారు. అక్కడ తనకూ తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోవడానికి ఆయన చూస్తారని అంటున్నారు ఆ రకమైన హామీతోనే ఆయన బీయారెస్ అధినాయకత్వం మీద ముఖ్యంగా హరీష్ రావు మీద ఈ రకమైన హాట్ కామెంట్స్ చేశారు అని అంటున్నారు. ఇపుడు మైనంపల్లి మెత్తపడినా ఒక చేత్తో టికెట్ ఇచ్చిన హై కమాండే వేటు వేస్తుంది అని అంటున్నారు. మొత్తానికి బీయారెస్ లో తొలి మంట పెట్టిన వారుగా మైనంపల్లి ఉన్నారని అంటున్నారు.

Tags:    

Similar News