రెడ్డి వర్గంపై నాగం ఎఫెక్ట్ ఎంత?
గతానికి భిన్నంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా జంపింగులు చోటు చేసుకుంటున్నాయి. కొత్తవారు, పాత వారు అనే తేడా లేకుండా.. నాయకులు టికెట్లే పరమావధిగా జంప్ జిలానీలుగా మారుతున్నారు.
గతానికి భిన్నంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా జంపింగులు చోటు చేసుకుంటున్నాయి. కొత్తవారు, పాత వారు అనే తేడా లేకుండా.. నాయకులు టికెట్లే పరమావధిగా జంప్ జిలానీలుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నుంచి ప్రతిపక్షాల వరకు అన్ని పార్టీలపైనా జంపింగుల ప్రభావం ఎక్కువగానే ఉంది. ఇక, తాజాగా రెడ్డి సామాజిక వర్గంలో అంతో ఇంతో పట్టున్న నాగం జనార్దన్‌రెడ్డి కూడా పార్టీ మారిపోతున్నారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
నాగర్ కర్నూల్ నియోజకవర్గంపై పట్టున్న నాగం.. గతంలో టీడీపీ తరఫున చక్రం తిప్పారు. ఇక్కడ నుంచి వరుస విజయాలు కూడా అందుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చంద్రబాబు హయాంలో పనిచేశారు. మంచి వాగ్ధాటి సహా.. అందరినీ కలుపుకొని పోయే తత్వం ఉన్న ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో ఒకింత ఇబ్బందులు పడ్డారు. అయినా.. తట్టుకుని.. రాజకీయాలు కొనసాగించారు. ఇక, టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్ ఎస్‌లోచేరారు. అయితే.. అక్కడ పరాభవంతో ఆయన రూటు మార్చి కాంగ్రెస్‌లోకి జంప్ చేశారు.
ఇక, తాజా ఎన్నికల్లో నాగంకు కాంగ్రెస్ టికెట్ కేటాయించలేదు. పైగా.. ఇటీవలే పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దమోదర్ రెడ్డి తనయుడు రాజేశ్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. ఈ పరిణామంతో నాగం తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో నాగం జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీకి పంపించారు. ఆదివారం ఆయన బీఆర్ఎస్ కీలక నాయకుడు, మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ ఎస్‌లో చేరనున్నారు.
ఇదిలావుంటే.. నాగం కాంగ్రెస్ పార్టీని వీడడంతో రెడ్డి సామాజిక వర్గంపై ప్రభావం పడుతుందనే చర్చ జరుగుతోంది. నాగం రాజకీయాలకు అతీతంగా కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించగల నాయకుడిగా పేరుంది. గతంలోనూ ఇప్పుడు కూడా రెడ్డి వర్గం నిర్వహించే అనేక కార్యక్రమాలకు నాగంను ఆహ్వానిస్తారు. ప్రస్తుత ఎన్నికల సమయంలో ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుండా చేయడంతో రెడ్డి వర్గంపై అంతో ఇంతో ప్రభావం చూపుతుందని అంటున్నారు పరిశీలకులు.