పూజలు ఫలించేనా? నారా లోకేష్ ప్రయాస చూశారా?
సంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన లోకేష్ రామానుజుల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఆలయాల బాట పట్టారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థి తిలోనూ విజయం దక్కించుకోవాలని భావిస్తున్న ఆయన.. వ్యక్తిగత కృషితో పాటు దైవబలాన్ని కూడా విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విరమమెరుగని విధంగా ఆలయాలను చుట్టేస్తున్నారు. ప్రస్తుతం నారా లోకేష్ దక్షిణాదిలోని తమిళనాడులో ఉన్న ఆలయాల సందర్శనకు వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం.. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్(దేశ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురైంది ఇక్కడే)కు వెళ్లి అక్కడున్న రామానుజర్ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.
సంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన లోకేష్ రామానుజుల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ గజరాజు(60 ఏళ్లు) ఆశీస్సులు కూడా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో విజయం అందించాలని స్వామిని వేడుకున్నట్టు తెలిపారు. ఇక, రెండు రోజుల్లో తిరుమల శ్రీవారిని దర్శించేందుకు కూడా నారా లోకేష్ వెళ్లనున్నారు. ఇదిలావుంటే.. గత నెలలో కూడా.. నారా లోకేష్ దంపతులు ఆలయాలు దర్శించుకున్న విషయం తెలిసిందే.
మంగళగిరిలోని పానకాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లి అమ్మవారికి(చెంచులక్ష్మి) బంగారు కిరీటం బహూకరించారు. అదేసమయంలో మెట్ల పూజలు కూడా చేశారు. రాజకీయ నాయకులు ఇలా ఆలయాలను దర్శించడం కొత్త కాదు. కానీ, టీడీపీలో అన్నగారు ఎన్టీఆర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ సంప్రదాయం ఉండేది. చంద్రబాబు హయాంలో కేవలం ప్రజల మధ్య ఉండేందుకే ఇష్టం చూపించారు. అయితే.. గత ఎన్నికల తర్వాత.. చంద్రబాబు కూడా యాగాలు , యజ్ఞాలు చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ పూజలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.