ఎస్వీబీసీ ఛైర్మన్ పోస్టు.. ఈసారి ఆ సెంటిమెంట్ పోతుందా?
ఈ పదవి కూడా పలుకుబడి ఉన్నది కావడంతో కూటమిలోని మూడు పార్టీలు (టీడీపీ - జనసేన - బీజేపీ) నుంచి గట్టి పోటీ నెలకొందని అంటున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు పాలకమండలి నియామకం ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీటీడీ కొత్త చైర్మన్ గా బీఆర్ నాయుడు నియమితులవ్వగా.. ఆయనతో సహా మొత్తం 24 మందితో టీటీడీ పాలక మండలి ఏర్పాటయ్యింది. ఈ నేపథ్యంలో ఎస్వీబీసీ ఛైర్మన్ పోస్టుపై చర్చ మొదలైంది.
అవును... తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పాలక మండలి పోస్టుల తర్వాత ఇప్పుడు అందరి దృష్టీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ఛైర్మన్ పోస్టుపై పడిందనే చర్చ మొదలీంది. ఈ పదవి కూడా పలుకుబడి ఉన్నది కావడంతో కూటమిలోని మూడు పార్టీలు (టీడీపీ - జనసేన - బీజేపీ) నుంచి గట్టి పోటీ నెలకొందని అంటున్నారు.
ఈ సమయంలో టీటీడీ ఛైర్మన్ పదవిని పరోక్షంగా టీడీపీ ఖాతాలోనే వేసినట్లని.. ఈసారి ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి పూర్తిగా జనసేన ఖాతాలోనే వేయాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నుంచి ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ని టీటీడీ బోర్డు లోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
వాస్తవానికి గత రెండు దఫాలుగా ఈ ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి సినిమావాళ్లకే దక్కింది. ఇందులో భాగంగా... 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును ఛైర్మన్ గా నియమించగా.. అనంతరం వైసీపీ ప్రభుత్వం నటుడు ఫృధ్వీరాజ్ ను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ గా నియమించింది.
2018లో ఛైర్మన్ గా ఎన్నికైన రాఘవేంద్ర రావు.. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పదవికి రాజీనామా చేయగా.. ఆయన తర్వాత ఆ స్థానంలోకి వచ్చిన ఫృథ్వీరాజ్.. మహిళా ఉద్యోగితో అనుచితంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇలా.. కారణాలు ఏవైనప్పటికీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్నికైన ఇద్దరూ పూర్తికాలం ఆ పదవిలో కొనసాగకుండానే రాజీనామాలు చేసిన పరిస్థితి! ఇక ఫృథ్వీ రాజ్ తర్వాత ఆ స్థానంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వీబీ సాయికృష్ణ యాచేంద్రను నియమించింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువైన వేళ కొత్త ఛైర్మన్ ఎవరనే చర్చ మొదలైంది.
మరి ఈసారి కూడా ఎస్వీబీసీ ఛైర్మన్ గా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారినే నియమిస్తారా.. లేక, వెరేవారికి అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాలి. మరోపక్క సినిమా వాళ్లకే ఇచ్చి పూర్తి కాలం ఆ పదవిలో కొనసాగితే.. పాత సెంటిమెంట్ కూడా పోయినట్లు ఉంటుందని కూడా అంటున్నారు. మరి ఈ పదవి ఎవరిని వరించనుందనేది వేచి చూడాలి!