కొత్త అర్థంతో ఏపీలో "రెడ్ బుక్" ఫ్లెక్సీలు
తాజాగా మంగళగిరిలో రెడ్ బుక్ పేరుతో భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే.. రెడ్ అనే దానికి (RED) R: Resilience, E: Empowerment D: Development అంటూ రాసుకొచ్చారు.
విపక్షంలో ఉన్న తమ పార్టీ నేతల్ని.. సానుభూతిపరుల్ని ఇబ్బంది పెడుతున్న నాటి వైసీపీ ప్రభుత్వాన్ని.. వారికి కొమ్ముకాస్తున్న అధికారుల తీరును తప్పు పడుతూ నారా లోకేశ్ మొదలుపెట్టిన రెడ్ బుక్ ప్రచారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రూల్ బుక్ లో ఉన్నట్లుగా పాలన సాగించినా.. నిర్ణయాలు తీసుకున్నా ఫర్లేదు కానీ.. అందుకు భిన్నంగా పక్షపాతంతో ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ తమను ఇబ్బంది పెట్టే వారిని.. తాము అధికారంలోకి వచ్చినంతనే వదిలిపెట్టమని నారా లోకేశ్ పలుమార్లు వార్నింగ్ ఇవ్వటం తెలిసిందే.
అంతేకాదు.. తాను ఉత్తగా మాటలు చెప్పటం లేదని.. తమను వేధించిన అధికారులను.. రాజకీయ నేతల పేర్లను ప్రత్యేకంగా పుస్తకంలో రాస్తున్నట్లు చెబుతూ.. తన చేతిలో ఉన్న రెడ్ బుక్ ను చూపించేవారు. దీంతో.. లోకేశ్ రెడ్ బుక్ పాపులర్ అయ్యింది. తమను దెబ్బ తీస్తున్న వారికి అలాంటి ట్రీట్ మెంట్ ఇస్తామన్న అర్థంతో చెప్పిన లోకేశ్ రెడ్ బుక్ కు సంబంధించి తాజా అప్డేట్ ఇది. ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అదరగొట్టే మెజార్టీతో 164 సీట్లను సొంతం చేసుకొని చారిత్రక విజయాన్ని నమోదు చేయటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఏపీలోని కొన్నిచోట్ల లోకేశ్ రెడ్ బుక్ ను గుర్తు చేసే భారీ ఫ్లెక్సీలు తెర మీదకు వస్తున్నాయి. దీని ద్వారా తాను చెప్పిన రెడ్ బుక్ అంశాల్ని మర్చిపోలేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. అధికారంలోకి రాగానే అంతు చూస్తా.. ఎవరినీ వదిలిపెట్టను.. మీ పేర్లును పుస్తకంలో రాసుకుంటున్నా అంటూ అప్పట్లో లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా రెడ్ బుక్ అనే దానికి కొత్త అర్థాన్ని తాజాగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు.
యువగళం పేరుతో లోకేశ్ చేపట్టిన పాదయాత్రలో రెడ్ బుక్ మాట పాపులర్ అయ్యింది. తాజాగా మంగళగిరిలో రెడ్ బుక్ పేరుతో భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే.. రెడ్ అనే దానికి (RED) R: Resilience, E: Empowerment D: Development అంటూ రాసుకొచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చినంతనే గత ప్రభుత్వంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన అధికారులకు రెడ్ బుక్ టెన్షన్ నెలకొంది. ఇందుకు తగ్గట్లే మంగళగిరిలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీని చూస్తే రానున్న రోజుల్లో తప్పనిసరిగా గతంలోని యాక్షన్ కు రియాక్షన్ ఖాయమన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే.. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవని చెప్పిన లోకేశ్.. తప్పులు చేసిన వారిని మాత్రం వదలనని చెప్పటం గమనార్హం.