ఎన్నికల తర్వాత.. ఏపీకి మోడీ.. విశాఖ జోన్‌కు శ్రీకారం!
దీనికి సంబంధించి ప్రధాని మోడీ ఈ నెల 29న శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 29న ఏపీకి రానున్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికారికంగా, రాజకీయంగా కూడా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన వస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికలకు ముందు కూటమి పార్టీలైన బీజేపీ+టీడీపీ+జనసేన తరఫున ప్రచారం చేసేందుకు మోడీ పర్యటించారు. ఎన్నికల అనంతరం.. కూటమి సర్కారు ఏర్పడింది. ఈ క్రమంలో సీఎం, డిప్యూటీసీఎం చంద్రబాబు, పవన్‌ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిమిత్తం విజయవాడకు వచ్చారు. ఆ తర్వాత.. మరోసారి ఇప్పుడే మోడీ ఏపీకి రానుండడం గమనార్హం.
ఈ నెల 29న శుక్రవారం మోడీ ఏపీకి రానున్నారు. నేరుగా విశాఖకు వచ్చే ఆయన దక్షిణ కోస్తా రైల్వే డివిజన్‌లోని విశాఖ రైల్వే జోన్ నిర్మాణానికి శంకు స్థాపన చేయనున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు వ్యవహారం అనేక మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ జోన్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. విశాఖలోని ముడసర్లోవ ప్రాంతంలో చేపట్టే రైల్వే జోన్ నిర్మాణాకి 150 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ సొమ్మును రైల్వే శాఖే కేటాయించనుంది. ఏపీ మాత్రం మౌలిక సదుపాయాలైన విద్యుత్, తాగునీటిని, భూమిని ఇవ్వాల్సి ఉంది.
దీనికి సంబంధించి ప్రధాని మోడీ ఈ నెల 29న శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా విద్యుత్‌కు సంబంధించిన ప్రాజెక్టులకు కూడా ఆయన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కాగా, ఎన్నికల అనంతరం వస్తున్న మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించేలా .. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. పైగా మహారాష్ట్రలో మహా విజయం దక్కించుకున్న నేపథ్యంలో దీని వెనుక మోడీ ఉన్నా రన్న ప్రచారం నేపథ్యంలో మోడీ రాక, ఆయనకు పలికే ఆహ్వానం వంటివి ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ చేతుల మీదుగా `విజన్-2047 ఏపీ` డాక్యుమెంటును సీఎం చంద్రబాబు ఆవిష్కరింపచేసే అవకాశం ఉంది.
అలానే.. అదే రోజు వర్చువల్‌గా పోలవరం పనులకు కూడా ప్రాధమిక ప్రారంభం చేయించే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పోలవరం నిర్మాణ పనులకు.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిధులు ఇచ్చేందుకు రెడీ కావడం.. 12 వేల కోట్లను తక్షణం విడుదల చేసేందుకు అంగీకరించిన నేపథ్యంలో పోలవరం పనులు ఊపందుకోనున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయా పనులను ప్రాధమికంగా మోడీతో ప్రారంభింపజేయడం ద్వారా పోలవరం ప్రాజెక్టు పనుల ప్రారంభం విషయం జాతీయస్థాయిలో చర్చకు వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.