మోడీ చెలగాటం..బాబుకు ప్రాణ సంకటం ?
కేంద్రంలో నరేంద్ర మోడీకి ఇది ముచ్చటగా మూడోసారి వచ్చిన అధికారం. నిండుగా అయిదేళ్ళ పాటు ఉంటుంది.
కేంద్రంలో నరేంద్ర మోడీకి ఇది ముచ్చటగా మూడోసారి వచ్చిన అధికారం. నిండుగా అయిదేళ్ళ పాటు ఉంటుంది. ఏమి చేయాలనుకున్నా ఈ టెర్మ్ లోనే చేసేయాలి. 2029 ఎన్నికల్లో రాజు ఎవరో తరాజు ఎవరో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీకి వచ్చినది బీజేపీకి ఎన్డీయే మిత్ర పక్షాల మద్దతుతో బొటాబొటీ మెజారిటీ.
బీజేపీకి సొంతంగా 240 ఎంపీ సీట్లు మాత్రమే లభించాయి. కాబట్టి ఆ మిగతా సీట్లను తెలుగుదేశం జేడీయూ వంటి పార్టీలు మద్దతుగా నిలిచి బీజేపీ సర్కార్ కి కొమ్ము కాస్తున్నాయి. అయితే రెండున్నర నెలలు తిరగకుండానే కమలానికి రెక్కలు విప్పుకునే విధంగా మరో చాన్స్ వచ్చింది.
అదే పెద్దల సభలో బీజేపీకి బలం అమాంతం పెరగడం. అక్కడ బీజేపీకి మిత్రులతో కలిపి ఏకంగా 119 సీట్ల దాకా బలం ఉంది. అంటే మ్యాజిక్ ఫిగర్ ప్రస్తుతానికి దాటేసింది అన్న మాట. మరో ఎనిమిది ఖాళీలు ఉన్నాయి. ఇందులో నామినేటెడ్ గా భర్తీ అయ్యేవి. అవి కూడా బీజేపీ ఖాతాలోనే వస్తాయి. కాశ్మీర్ ఎన్నికల తరువాత మరో నాలుగు సీట్లు వస్తాయి. ఇలా చూస్తే బీజేపీకి రాజ్యసభలో పూర్తి మెజారిటీ దక్కినట్లే.
మరి ఈ బలం చూసుకుని తన అజెండాను బీజేపీ పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది అని అంటున్నారు. ప్రస్తుతానికి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అన్నది సం యుక్త పార్లమెంటరీ కమిటీ పరిధిలో ఉన్నా రేపటి రోజున దానిని తిరిగి ప్రవేశపెట్టడానికి బీజేపీ కచ్చితంగా చూస్తుంది అని అంటున్నారు. అంతే కాదు మైనారిటీ బిల్లుని కూడా ఉభయ సభలలో పెట్టి ఆమోదించుకోవడానికి బీజేపీ ఇదే సమయం అని లెక్క వేసుకుంటోంది అంటున్నారు.
ఈ రెండు బిల్లులతో లు పాటు కామన్ సివిల్ కోడ్ ఇలా అనేక బిల్లుల విషయంలో బీజేపీ దూకుడు చేసే చాన్స్ ఉందని అంటున్నారు. బీజేపీ ఫిలాసఫీ వేరు. అధికారం ముమ్మారు చేతిలో ఉంది. ఇపుడు కాకుండా వాయిదా వేసుకోవాలని బీజేపీ ఎప్పటికీ అనుకోదు అని అంటున్నారు.
మరి బీజేపీ దాని అధినాయకుడు మోడీ ఈ విధంగా దూకుడు చేస్తే మిత్రులలో అగ్ర స్థానంలో ఉన్న చంద్రబాబు ఆయన టీడీపీ సంగతేమిటి అన్న చర్చ సాగుతోంది. చంద్రబాబు అయితే ఏపీలో మైనారిటీల విషయంలో వారి ప్రయోజనాలకు కట్టిబడి ఉన్నామని చెబుతున్నారు
కానీ బీజేపీది రాజకీయాల కంటే సిద్ధాంత బద్ధమైన సమస్య. ఆ పార్టీ 2029లో అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు. అందువల్ల ఉన్న అవకాశాలను వాడుకుని తమ పొలిటికల్ ఫిలాసఫీ మేరకు వాటిని అమలు చేయాలనే చూస్తుంది. బీజేపీ తీసుకునే ఏ నిర్ణయం అయినా మిత్రుల మద్దతు లోక్ సభలో ముఖ్యం. మరి బీజేపీకి ఆ విధంగా మద్దతు ఇవ్వడానికి అటు జేడీయూ కానీ ఇటు టీడీపీ కానీ సిద్ధంగా ఉన్నాయా అన్నదే ప్రశ్న.
అయితే బీహార్ లో జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎన్నడూ లేనంతగా వీక్ అయ్యారని అంటున్నారు. ఆయనకు ఈ టెర్మ్ లో బీహార్ లో అధికారం దక్కదని అంటున్నారు. అప్పుడు ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి కావాలి. అందువల్ల 2025 వరకూ ఆయన సీఎం గా ఉన్నా ఆ మీదట కేంద్ర ప్రభుత్వంలో చేరవచ్చు అని అంటున్నారు.
అలాగే ఏపీలో చూస్తే రాజధాని నిర్మాణం పూర్తి కావాలి,పోలవరం పూర్తి కావాలి. రాజకీయంగా టీడీపీ నిలదొక్కుకుని నారా లోకేష్ ని ఫ్యూచర్ సీఎం గా నిలబెట్టాలి. ఇలా అన్నీ లాంగ్ టెర్మ్ ప్లాన్స్ టీడీపీకి ఉన్నాయి. దాంతో అటు నితీష్ కానీ ఇటు బాబు కానీ ఎంతమేరకు మోడీ దూకుడుకు అడ్డుకట్ట వేయగలరు అన్న చర్చ అయితే సాగుతోంది.
బీజేపీకి మాత్రం చరిత్రలో ఎన్నడూ లేవి విధంగా ఉభయ సభలలో మెజారిటీ రావడం అమితానందాన్ని కలుగచేస్తోంది అని అంటున్నారు. అన్నింటికంటే మించి రాజ్యసభలో బీజేపీకి బలం పెరగడం మాత్రం మిత్రులకు ఒకింత కలవరం కలిగించే అంశమే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.కమలం కదనోత్సాహం ఏ రాజకీయ తీరలకు చేరుస్తుందో.