ఉచితాలు మీద మోడీ కామెంట్స్ : టీడీపీ కూటమికి తగిలేనా ?

అయితే మోడీ వ్యాఖ్యలు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమికి కూడా గట్టిగా తగిలినట్లే అంటున్నారు.

Update: 2024-11-02 03:40 GMT

కర్ణాటక, తెలంగాణా, హిమాచల్ ప్రదేశ్ లలో కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత హామీలు మొత్తం ఆర్థిక వ్యవస్థను ఆయా రాష్ట్రాలలో చిన్నాభిన్నం చేశాయని ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు ఇస్తూ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను దిగజారుస్తోందని కూడా ప్రధాని హాట్ కామెంట్స్ చేశారు.

తప్పుడు హామీలు ఇవ్వడం సులువే. కానీ వాటిని అమలు చేయడం మాత్రం అసాధ్యమని ఆ విషయం ఇపుడే కాంగ్రెస్ కి గుర్తుకు వస్తోందని నరేంద్ర మోడీ ఎద్దేవా చేస్తున్నారు. దీని వల్ల తెలంగాణా కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ లో ఆర్ధిక పరిస్థితి క్షీణిస్తోందని మోడీ అన్నారు.

అయితే మోడీ వ్యాఖ్యలు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమికి కూడా గట్టిగా తగిలినట్లే అంటున్నారు. ఎందుకంటే ఏపీలో చంద్రబాబు కూడా కర్ణాటక తెలంగాణాలో ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అటూ ఇటూ మార్చి ఏపీలో తన మ్యేనిఫేస్టోలో పెట్టి ఎన్నికల్లో ప్రచారం చేశారు అని గుర్తు చేస్తున్నారు.

ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా కూడా బీజేపీ ప్రతినిధి దానిని ముట్టుకోవడానికి కూడా అంగీకరించలేదని గుర్తు చేస్తున్నారు. కర్ణాటకలో ఫ్రీ బస్సు మీదనే ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పునరాలోచన చేస్తున్నట్లుగా ప్రకటించారని అంటున్నారు.

దాని మీదనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె పధకాలను కొనసాగించాలని సలహా ఇచ్చారు. మహారాష్ట్రలో కూడా తాము అలాంటి హామీలు ఇస్తున్నట్లుగా ఆయన చెప్పారు కూడా. ఈ విషయం రాజకీయ రచ్చగా మారడంతో మోడీ ఎంటర్ అయి కాంగ్రెస్ ని ఖర్గెని తప్పు పట్టారు

అయితే కర్ణాటకలో తెలంగాణాలో అమలు అయిన ఉచిత బస్సు స్కీం ని ఏపీలో కూడా అమలు చేస్తామని టీడీపీ ప్రకటించింది. అలాగే అక్కడ మహిళలకు ఇచ్చే ఆర్థిక భరోసాను ఏపీలో కూడా ఇస్తామని మరో హామీ ఇచ్చింది. ఇలా కొన్ని హామీలు అక్కడ నుంచి తీసుకున్నారు అన్న విమర్శలు ఉన్నాయి.

వాటితో పాటు మరిన్ని అలవి కానీ హామీలను ఏపీలో టీడీపీ తన ఎన్నికల ప్రణాళికలో పెట్టింది. మరి ఇపుడు కాంగ్రెస్ ని తప్పుడు హామీలు అని విమర్శిస్తున్న మోడీ మాటలు తమ మంత్రి కూడా ఉన్న ఏపీలోని కూటమి ప్రభుత్వానికి కూడా తగులుతాయా అన్న చర్చ అయితే ఉంది.

ఉచిత హామీలు అలవి కానీ హామీలు ఎవరు ఇచ్చినా తప్పే. గత అయిదేళ్లలో ఉచితాలతో పేరుతో వైసీపీ కూడా అలాగే ఖర్చు చేసి ఏపీ ఖజానాకి ఇబ్బంది తెచ్చిపెట్టింది. అయినా నాడు కూడా కేంద్రం పట్టించుకోలేదు అన్న విమర్శలు ఉన్నాయి. అంటే కాంగ్రెస్ తమ ప్రత్యర్థి కాబట్టే విమర్శలు తప్ప మిత్రులు అయితే ఉచితాల పేరుతో హామీలు ఎన్ని ఇచ్చినా బీజేపీ పెద్దలు పట్టించుకోరా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Tags:    

Similar News