నరేంద్ర మోదీ, అరుణిక, అర్కా.. ఇదీ కథ!

ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు సులువుగా తెలుసుకునే వీలుంది.

Update: 2024-09-26 06:23 GMT

ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు సులువుగా తెలుసుకునే వీలుంది. ఎక్కడ వర్షం పడుతుంది, ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉంది.. ఎక్కడ పిడుగులు పడతాయి? ఇలాంటివన్నీ ముందుగానే తెలుసుకునే పరిజ్ఞానం భారత్‌ సొంతమైంది. అల్పపీడనాలు, తుపాన్ల రాకను కూడా చాలా ముందుగానే తెలుసుకునే అతి తక్కువ దేశాల సరసన భారత్‌ కూడా చేరింది.

ఈ మేరకు పుణేలోని పుణేలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటీరియాలజీ (ఐఐటీఎం) విశేష కృషి చేస్తోంది. ఈ సంస్థ విడుదల చేసిన ‘దామిని’ యాప్‌ ద్వారా పిడుగులు ఎక్కడ పడతాయో ముందుగానే తెలుసుకోవచ్చు.

ఈ క్రమంలో వాతావరణ సూచనలను మరింత కచ్చితత్వంతో జారీ చేసేందుకు ఇప్పుడు వినియోగిస్తున్న సూపర్‌ కంప్యూటర్ల సామర్థ్యాన్ని భారత్‌ ఏకంగా మూడు రెట్లకు పెంచింది.

ఇందులో భాగంగా పుణేలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటీరియాలజీ (ఐఐటీఎం)లో, నోయిడాలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మీడియం రేంజ్‌ వెదర్‌ ఫోర్‌ కాస్ట్‌ (ఎన్‌సీఎంఆర్‌డబ్ల్యూఎఫ్‌)లో వాతావరణ పరిశీలనకు వినియోగిస్తున్న సూపర్‌ కంప్యూటర్ల సామర్థ్యాన్ని 22 పెటాఫ్లాప్స్‌ కు పెంచారు. ఇందుకోసం ఏకంగా రూ.850 కోట్లు ఖర్చు చేశారు.

అరుణిక, అర్కా అనే ఈ సూపర్‌ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్‌ 26న ఫుణేలో ప్రారంభించనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూపర్‌ కంప్యూటర్లు 12 కి.మీ. గ్రిడ్‌ పరిమాణంలో ఉన్న ఉపగ్రహ చిత్రాలను విశ్లేషిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అప్పటికప్పుడు హఠాత్తుగా మారిపోయే వాతావరణ పరిస్థితుల్ని కచ్చితంగా అంచనా వేయడంలో కొన్నిసార్లు లెక్కలు తప్పుతున్నాయి.

ఈ నేపథ్యంలో గ్రిడ్‌ పరిమాణాన్ని 12 కి.మీ నుంచి 6 కి.మీ. తగ్గించగలిగితే ఎక్కడ కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందో కచ్చితత్వంతో చెప్పొచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సూపర్‌ కంప్యూటర్ల సామర్థ్యాన్ని పెంచారు. వీటి సామర్థ్యాన్ని 22 పెటా ఫ్లాప్స్‌ కు పెంచడం వల్ల ఇది సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు.

ఈ సూపర్‌ కంప్యూటర్లను ప్రధాని మోదీ ప్రారంభించాక ఇవి పూర్తి స్థాయిలో రెండు నెలల్లో అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. ఫుణేలోని అర్కా సూపర్‌ కంప్యూటర్‌ వాతావరణ మోడల్స్‌ తోపాటు వాతావరణ మార్పులపైనా పూర్తి స్థాయిలో విశ్లేషణలు అందిస్తుంది. దీన్ని కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) లతో పనిచేసేలా రూపొందించడం విశేషం,

అలాగే నోయిడాలో అరుణిక సూపర్‌ కంప్యూటర్‌ సైతం వాతావరణ సూచనలు జారీ చేయడంలో తోడ్పడుతుంది. అసాధారణ వాతావరణ పరిస్థితులు తలెత్తినప్పుడు, ఆకస్మిక వరదలు, హఠాత్తుగా సంభవించే కుండపోత వర్షాలు, పిడుగులు పడే ప్రాంతాలను గురించిన సమాచారాన్ని అందిస్తుంది.

Tags:    

Similar News