మోడీ సర్‌కి ఇప్పుడు ఏపీ కనిపించట్లేదా?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీరు చూస్తే.. నీరోచక్రవర్తిని తలపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీరు చూస్తే.. నీరోచక్రవర్తిని తలపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ రోజు ప్రధానిగా ఆయన మూడోసారి పగ్గాలు చేపట్టడంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్రం ఏపీ. ఇక్కడి ప్రజల మద్దతుతోనే.. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చారు. కానీ, ఇప్పుడు ఆయనకు ఏపీ కనిపించడం లేదు. చిద్విలాసంగా తన గొప్పలు చెప్పుకొంటూ.. విదేశాల్లో పర్యటిస్తున్నారు. కానీ.. వాస్తవానికి ఏపీ మునిగిపోయింది.
6 జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ విషయం కేంద్రా నికి తెలియదా? జాతీయ మీడియా ప్రచారం చేయడం లేదా? అయినా.. మోడీ సర్కారుకు చీమ కుట్టిన ట్టు కూడా కనిపించడం లేదు. ఇతర రాష్ట్రాల మాట ఎలా ఉన్నా.. ఏపీ ప్రజల విషయంలో మోడీ సర్కారు తక్షణమే స్పందించాలి. ఇక్కడి ప్రజలు ఇచ్చిన మద్దతుతోనే ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్నారన్న విషయాన్ని ఆయన గుర్తు పెట్టుకోవాలి.
కానీ, ఈ సోయ కూడా మోడీ సర్కారుకు కనిపించడం లేదు. కేంద్రం తలుచుకుని ఉంటే.. సీఎం చంద్రబాబు అడక ముందే.. మేల్కొని ఉండాలి. జాతీయ విపత్తు స్పందనా దళాన్ని రంగంలోకి దింపి.. ఆర్మీ హెలికాప్టర్లను విరివిగా పంపించి ఉండాలి. ఆహారాన్ని అందించి ఉండాలి. కానీ, ఇవేవీ చేయలేదు. ఇక, సీఎం చంద్రబాబు కూడా సుతిమెత్తగా వ్యవహరిస్తున్నారు. కేంద్రాన్ని ఈ సమయంలో ఆయన నిలదీయాలి. మాకు సాయం చేయాల్సిందేనని ఆయన పట్టుబట్టాలి.
కానీ, ఇప్పుడు కూడా.. ఆయన ఒక్కరే ఆరాట పడుతున్నారు తప్ప.. అధికారాన్ని.. అవకాశాన్నీ.. సరిగా వినియోగించుకోలేక పోతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. కేంద్రం మెడపై కత్తి పెట్టి నట్టు చంద్రబాబు వ్యవహరిస్తే.. ఈ పారి ఎప్పుడో కేంద్రం దిగి వచ్చేది. కేంద్ర మంత్రులు ఏపీకి తరలి వచ్చి.. సాయం చేసేవారు. కానీ, అటు మోడీ నిర్లిప్తత, ఇటు చంద్రబాబు ఉదాసీనత కలిపి.. ప్రజలకు శాపంగా మారాయన్నది విశ్లేషకుల మాట.