2024 వెళ్లిపోతోంది.. మోదీ టూర్ చేసిన దేశాలు మనమూ చూసొద్దామా?

2014లో తొలిసారి ప్రధాని అయిన మోదీ ఈ పదిన్నరేళ్లలో దాదాపు 80 దేశాల్లో పర్యటించారు.

Update: 2024-12-17 17:30 GMT

చూస్తూచూస్తూనే 2024 వెళ్లిపోతోంది.. కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోతోంది.. మరొక్క రెండు వారాలే..? ఆ తర్వాత 2025. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ఎంత ఉత్సాహంగా ఉన్నామో.. చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఈ సంవత్సరంలో ఒక్క ట్రిప్ అయినా వేయని వారు ఎందరో..? ఏ యిజానికీ తక్కువ కానిదీ టూరిజం.. అందుకే, ఏడాదిలో ఒక్క టూర్ అయినా వేయాలంటారు. తద్వారా మనసు రీచార్జి అవుతుందని చెబుతారు. కానీ, ఎక్కడకు వెళ్లాలి..? ఏ దేశం చూడాలి..? ఏవో ఎందుకు? మన ప్రధాని మోదీ 2024లో పర్యటించిన దేశాలనే మనమూ చుట్టేస్తే..? అసలు ఆ దేశాలేమిటో తెలుసుకుంటే?

దాదాపు 80 దేశాలలో పర్యటించి

2014లో తొలిసారి ప్రధాని అయిన మోదీ ఈ పదిన్నరేళ్లలో దాదాపు 80 దేశాల్లో పర్యటించారు. ఏ భారత ప్రధానీ వెళ్లని మంగోలియా వంటి దేశాల్లోనూ పర్యటించారు. మొత్తమ్మీద మోదీ స్థాయిలో భారత ప్రధానులెవరూ టూర్ చేసి ఉండరనే చెప్పొచ్చు. మరో నాలుగున్నరేళ్ల పదవీ కాలంలో ఆయన ఎన్ని దేశాల్లో టూర్ చేస్తారో..? 2024లో మోదీ వెళ్లొచ్చిన దేశాలేమిటంటే..?

రెండో నెలలనే..

2024లోకి అడుగు పెడుతూనే మోదీ తొలి టూర్ చేశారు. ఫిబ్రవరిలో యూఏఈకి వెళ్లారు. పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇటీవలి కాలంలో పర్యటకపరంగా యూఏఈ బాగా ఆకర్షిస్తోంది. దీంతోపాటు సంస్కరణలతో పెట్టుబడిదారులను ఆహ్వానిస్తోంది. అందుకే, విదేశీ టూర్ చేయాలనుకుంటే ఈ దేశం తొలి ఎంపికగా మారింది. మరీ ముఖ్యంగా అందరూ చూడాలని తపించే దుబాయ్.. యూఏఈలోనిదే. భారతీయులే కాదు..పలు దేశాలకు చెందిన పర్యాటకులు వెళ్లే దేశం యూఏఈ.


ప్రశాంత దేశంలో...

ట్రాఫిక్ రణగొణ ధ్వనులకు, సెల్ ఫోన్ భూతానికి దూరంగా.. ప్రశాంత జీవితానికి దగ్గరగా ఉండే బుల్లి దేశం భూటాన్. అక్కడి ప్రజలూ అంతే ప్రశాంతంగా ఉంటారు. ఆ దేశ ప్రధాని షెరింగ్‌ టోబ్‌ గే ఆహ్వానంతో మోదీ భూటాన్‌ వెళ్లారు. మన పక్కనే ఉండే భూటాన్ తక్కువ బడ్జెట్‌ లో విదేశాలకు వెళ్లాలనుకునేవారికి మంచి ప్రదేశం.. వీసా లేకుండా భారతీయులు 14 రోజులు ఇక్కడ ఉండొచ్చు. అందమైన అడవులు, బౌద్ధారామాలను సందర్శించవచ్చు.


ఇటలీ రమ్మంటోంది..

యూరప్ ఖండ దేశాల్లో ఇటలీ పర్యటకుల స్వర్గధామం. సినీ తారలు, వ్యాపార దిగ్గజాల ఫేవరెట్ దేశం. డెస్టినేషనల్ వెడ్డింగ్ లకు పెట్టింది పేరు. ఈ దేశంలోని వెనిస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 50వ జీ7 దేశాల సదస్సులో భారత్ కు ఆహ్వానిత దేశం కింద పిలుపు దక్కింది. దీంతో మోదీ ఇటలీలో పర్యటించారు. ఇక ఏటా ఇటలీని లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా ఈ దేశానికి వెళ్లాలనేది టూరిస్టుల లక్ష్యం.

రోమ్, ఫ్లోరెన్స్, వెనిస్, అమాల్ఫీ కోస్ట్ తదితర ప్రదేశాలు ఇటలీలో పేరుగాంచినవి.


చిరకాల మిత్ర దేశం రష్యా..

సోవియట్ యూనియన్ కాలం నుంచి భారత్ కు మిత్ర దేశం. రష్యా తర్వాత కాలంలోనూ అదే స్నేహాన్ని కొనసాగిస్తోంది. 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి మోదీ మాస్కో వెళ్లారు. ఏటా ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు రష్యాను సందర్శిస్తుంటారు. భారీ పర్వతాలు, ఎడారులు, అందమైన బీచ్‌లు, వారసత్వ ప్రదేశాలు, రాజ భవనాలు, మంచు సరస్సులకు రష్యా పెట్టింది పేరు. రాజధాని మాస్కో, వ్లడివోస్టాక్ లు పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి.


సింగపూర్ సిగలో..

నగర దేశం సింగపూర్. మన గ్రేటర్ హైదరాబాద్ కంటే కాస్త పెద్దది అంతే. కానీ, ప్రపంచ దేశాల్లో దీనికి చోటుంది. డెవలప్ మెంట్ లో సింగపూర్ అందరికీ ఆదర్శం. మనకు కాస్త దగ్గర కూడా. మోదీ ఈ ఏడాది సింగపూర్‌ కూ వెళ్లారు. ఏటా లక్షల మంది సింగపూర్‌ లో పర్యటన చేస్తుంటారు. మ్యూజియం, జురాంగ్ బర్డ్ పార్క్, రెప్టైల్ పార్క్, జూలాజికల్ గార్డెన్, సైన్స్ సెంటర్ సెంటోసా ఐలాండ్, పార్లమెంట్ హౌస్, హిందూ, చైనీస్, బౌద్ధ దేవాలయాలు, చైనీస్, జపనీస్ గార్డెన్లను చూసి మైమరుస్తుంటారు.


..ఇంకే.. మరొక్క రెండు వారాలు.. మీరూ టూరిస్టు అయిపోండి.. 2024 ముగిసేలోగా ఏదో ఒక దేశంలో అయినా పర్యటించండి.

Tags:    

Similar News