మోడీ మీద అవిశ్వాసం : వైసీపీ టీడీపీ సంగతేంటి...?
ఇండియా పేరిట కూటమి కట్టిన విపక్షాలు జోరు చేస్తున్నాయి
ఇండియా పేరిట కూటమి కట్టిన విపక్షాలు జోరు చేస్తున్నాయి. దీంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో నిత్యం రచ్చగానే కధ సాగుతోంది. పార్లమెంట్ వద్ద రాత్రి కూడా బస చేసి అక్కడే నిద్రలు చేస్తూ విపక్షాలు పోరాటాన్ని ఒక దశను దాటించేశాయి. ఇపుడు అంతా కలసి మోడీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ఇవ్వడానికి రెడీ అయ్యాయి.
మొత్తం సభ్యులలో పది శాతం మంది మద్దతు ఉంటే అవిశ్వాసం నోటీసు ప్రభుత్వం మీద ఇవ్వవచ్చు. అంటే 54 మంది ఎంపీల మద్దతు అవిశ్వాసానికి కావాలన్న మాట. ఇపుడు ఇండియా కూటమికి లోక్ సభలో వందకు పైగా ఎంపీల మద్దతు ఉంది. దాంతో అవిశ్వాసం మోడీ సర్కార్ మీద పెట్టేందుకు పూర్తి అవకాశం ఉంది.
అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా లేదా అన్నది పక్కన పెడితే దేశంలోని రెండు బలమైన కూటముల మధ్య సభలో రంజుగా సమరం అయితే సాగనుంది. అంతే కాదు మొత్తం లోక్ సభలో ఉన్న పార్టీలలో ఎవరెటు అన్నది కూడా తేలిపోతుంది.
ఇపుడు ఇండియా కూటమిలో 26 పార్టీలు ఉన్నాయని అంటున్నారు. ఎన్డీయేకు 39 పార్టీల మద్దతు ఉందని అంటున్నారు. ఈ రెండు కూటములలో లేకుండా న్యూట్రల్ గా ఉన్న పార్టీలు కొన్ని ఉన్నాయి. అవి బీయారెస్ వైసీపీ, టీడీపీ అకాళీదళ్ శిరోమణి వంటివి. వీటికి 91 ఎంపీల మద్దతు ఉంది. మరి ఈ పార్టీల రూట్ ఎటూ ఈ పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తారు అన్నది చూడాలి.
బీయారెస్ అయితే మోడీ మీద అవిశ్వాసం పెడితే యాంటీగానే ఓటు చేస్తుంది అని అంటున్నారు. ఎందుకంటే ప్రతీ రోజూ సభలో విపక్షాలు జరిపే నిరసనలలో ఆ పార్టీ పాల్గొంటోంది. ఇక ఏపీ నుంచి చూస్తే టీడీపీ వైసీపీ ఉన్నాయి. ఈ రెండు పార్టీలకు నిజంగా అవిశ్వాస గండం పొంచి ఉంది అని అంటున్నారు. లోక్ సభలో ఇరవై రెండు మంది ఎంపీలు వైసీపీకి ఉన్నారు.
అవిశ్వాసం సందర్భంగా ఈ మద్దతు చాలా కీలకంగా మారుతుంది. బీజేపీకి సొంతంగా బలం ఉన్నా బంపర్ మెజారిటీతో తీర్మానాన్ని ఓడించామని చెప్పుకోవడానికి వైసీపీ మద్దతు కోరవచ్చు. అలాగే మూడు ఎంపీలు ఉన్న టీడీపీని దగ్గరకు తీసుకోవచ్చు.
అసలే బీజేపీతో చెలిమి చేసేందుకు చూస్తున్న టీడీపీకి ఇది నుయ్యి గొయ్యి లాంటి వ్యవహారం కానుంది అని అంటున్నారు. తెర వెనక వైసీపీ బీజేపీతో దోస్తీ చేస్తోంది అని అంటున్నారు. దానికి ఊతమిచ్చేలా బాహాటంగా మద్దతు ప్రకటిస్తారా లేక తటస్థంగా ఉంటారా అన్నది కూడా చూడాల్సి ఉంది. తటస్థం అంటే సభ నుంచి బయటకు వెళ్లడమే. అలా జరిగినా అధికార పక్షానికి అది పరోక్ష మేలు. మరి విపక్షాలు దాన్ని హైలెట్ చేసి వైసీపీ బీజేపీ బంధాన్ని ఎండగట్టక మానవు. ఏ విధంగా చూసినా టీడీపీకి వైసీపీకి ఈ అవిశ్వాస పరీక్ష తప్పకపోవచ్చు అని అంటున్నారు.