నాడు వీసా రిజెక్ట్.. నేడు హవా.. అమెరికాలో మార్మోగుతున్న ‘న మో
అమెరికాలో ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీ హవా ఇలానే ఉంది.
ఒకప్పుడు మనల్ని కాదన్నవారే పిలిచి మరీ రెడ్ కార్పెట్ వేస్తే.. ఒకప్పుడు మనల్ని పక్కనపెట్టినవారే పట్టాభిషేకం చేస్తే.. ఒకప్పుడు నిందలు వేసినవారే ఇప్పుడు నువ్వే గొప్ప అని కొనియాడుతుంటే...? 20 ఏళ్ల కిందట మోదీకి వీసా నిరాకరించిన అగ్ర రాజ్యం ఇప్పుడు ఆయనకు సాగిలపడుతోంది. మరీ ముఖ్యంగా ఎన్నికల ముంగిట మోదీని పిలిచి మరీ ఆకాశానికి ఎత్తేస్తోంది. గతంలోలాగే సరిగ్గా ఎన్నికల సమయంలో మోదీని తమ దేశానికి ఆహ్వానించింది అమెరికా ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వరుస కార్యక్రమాలతో ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. క్వాడ్ సదస్సు, ఎన్ఆర్ఐలతో సమావేశాలకు హాజరవుతూ తీరిక లేకుండా ఉన్నారు. ఇదే సమయంలో దిగ్గజ టెక్ కంపెనీల సీఈవోలతో రౌండ్‌టేబుల్ భేటీలో పాల్గొన్నారు. న్యూయార్క్ లో మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ దీనిని నిర్వహించింది.
భారతీయ సీఈవో దిగ్గజాలతో ‘మేడ్ బై ఇండియా’
మోదీ ప్రభుత్వం వచ్చాక మేకిన్ ఇండియా నినాదం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికితగ్గట్లే ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇప్పుడు ‘మేడ్ బై ఇండియా’ అంటూ మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాగా, కొన్నేళ్లుగా ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలకు భారతీయులు సీఈవోలుగా బాధ్యతలు చేపడుతున్నారు. వీరిలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, ఎన్విడియా సీఈవో జెన్‌సెన్ హాంగ్ వంటి వారున్నారు. మొత్తం 15 కంపెనీల సీఈవోలు మోదీతో సమావేశంలో పాల్గొన్నారంటేనే ఇంతమంది భారతీయులు సీఈవోలు అయ్యారా? అనిపిస్తుంటుంది. కొత్త టెక్నాలజీ, సరికొత్త ఆవిష్కరణల రంగాలకు చెందిన వీరందరితో చర్చలు ఫలప్రదం అయ్యాయంటూ మోదీ ట్వీట్ చేశారు.
పురాతన వస్తువులు తిరిగొచ్చాయ్..
మోదీ అమెరికా పర్యటనలో మరో కీలక అంశం.. పురాతన వస్తువుల అప్పగింత. 297 వస్తువులును అమెరికా భారత్ కు తిరిగి ఇచ్చింది. దీనిని సాంస్కృతిక ఆస్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. అయితే, మోదీ సర్కారు వచ్చాక విదేశాల నుంచి ఇలాంటి వస్తువులు 640 భారత్ కు తిరిగొచ్చాయి. వీటిలో 578 అమెరికా నుంచే కావడం గమనార్హం.10వ శతాబ్దపు ఇసుకరాయిలో అప్సర, 15వ శతాబ్దపు కాంస్య జైన తీర్థంకర్, తూర్పు భారతదేశం నుంచి 3వ శతాబ్దానికి చెందిన టెర్రకోట వాసే వంటి కొన్ని ముఖ్యమైనవి వీటిలో ఉన్నాయి. ఇలాంటి కళా ఖండాలను తిరిగిపొందే ప్రయత్నంలో భాగంగా 2021లో 157, 2023లో 105 వస్తువులను మోదీ అమెరికా నుంచి స్వదేశానికి రప్పించారు. ఆస్ట్రేలియా, యూకే నుంచి కూడా కొన్నిటిని వెనక్కు వచ్చేలా చేశారు.కాగా, భారత్- అమెరికా ఈ జూలైలో "సాంస్కృతిక ఆస్తి ఒప్పందం"పై తొలిసారి సంతకం చేశాయి. ఇది పురాతన వస్తువుల అక్రమ రవాణాను నిరోధించే లక్ష్యంతో కుదిరిన ఒప్పందం.
పుష్ప్ నినాదంతో..
మోదీ అభివృద్ధి చెందుతున్న భారతదేశం కోసం ఒక కొత్త నినాదం తెచ్చారు. అది హిందీ పదం "పుష్ప్". ఇందులో పి అంటే ప్రోగ్రెసివ్ ఇండియా, యు అంటే అన్‌స్టాపబుల్ ఇండియా, 'ఎస్ అంటే' స్పిరిచ్యువల్ ఇండియా, హెచ్ అనేది హ్యుమానిటీ-ఫస్ట్ ఇండియా, చివరి ప' అంటే ప్రోస్పెరస్ ఇండియా. డెలావర్ లో అధ్యక్షుడు బైడెన్ తో సమావేశంలో ఈ నినాదం ఇచ్చారు. రాజకీయాల్లోకి రాకముందు అమెరికాలోని 29 రాష్ట్రాల్లో పర్యటించానని ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదని.. అమెరికన్ ఇండియన్ అని అభివర్ణించారు. "భారతీయ సమాజం అమెరికాలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. విభిన్న రంగాల్లో సానుకూల ప్రభావం చూపుతోంది. వారితో సంభాషించడం ఎల్లప్పుడూ ఆనందకరమే’’ అని పేర్కొన్నారు.