మోడీ-జగన్‌లు సేమ్ టు సేమ్
దీనికి కారణం.. అటు మోడీ ప్రచారంలోనూ.. ఇటు సీఎం జగన్ ప్రచారంలోనూ సేమ్ టు సేమ్ ఎలిమెంట్లే ఉంటున్నాయి
కేంద్రంలోని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఏపీలో వరుసగా రెండో సారి అధికారం చేపట్టాలని భావిస్తున్న సీఎం జగన్ ఒకే రకమైన స్క్రిప్టు ఫాలో అవుతున్నా రా? అనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం. దీనికి కారణం.. అటు మోడీ ప్రచారంలోనూ.. ఇటు సీఎం జగన్ ప్రచారంలోనూ సేమ్ టు సేమ్ ఎలిమెంట్లే ఉంటున్నాయి.
మోడీ-1
ప్రస్తుతం రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ.. ప్రతిపక్షాల కూటమిపై విమర్శలు గుప్పిస్తున్నారు. తనను ఒంటరిని చేస్తున్నారని.. ప్రజల సేవలో ఉన్న తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని.. కులాన్ని సైతం, ఇంటి పేరును సైతం దూషిస్తున్నారని.. పరోక్షంగా రాహుల్‌గాంధీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు.. కుటుంబ పాలనకు- వారసత్వ రాజకీయాలకు- ఒక సాధారణ చాయ్ వాలాకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ఆయన పేర్కొంటున్నారు.
జగన్ -1
ఏపీ సీఎం జగన్ చేపట్టిన సిద్ధం సభలు కావొచ్చు.. లేక ప్రభుత్వ కార్యక్రమాల్లో అయినా.. ఆయన సేమ్ ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. తను ఒక్కడూ ఒకవైపు.. మిగిలిన ప్రతిపక్షాలన్నీ ఒకవైపు ఉన్నాయని చెబుతున్నారు. తనపై వారంతా యుద్ధం చేస్తున్నారని... పేదలకు మంచి చేస్తుంటే ఓర్చుకోలేక పోతు న్నారని అంటున్నారు. పేదలకు-పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా పేర్కొంటున్నారు.
మోడీ-2
ఇటీవల కాలంలో మోడీ ఎక్కడ ప్రసంగించినా.. తనకు ప్రజలే కుటుంబమని అంటున్నారు. 104 కోట్ల మంది ప్రజలు మోడీ కుటుంబమే(మోడీకా పరివార్)నని చెబుతున్నారు. కాంగ్రెస్ చేసిన విమర్శలను కూడా ఆయన తనకు అనుకూలంగా మార్చుకున్నారు.
జగన్-2
జగన్ తన కుటుంబం మొత్తాన్ని దూరం చేసుకున్నారన్న టీడీపీ, జనసేన విమర్శలకు జగన్ తనదైన శైలిలో చెక్ పెడుతున్నారు. రాష్ట్రంలోని పేదలు, సంక్షేమ పథకాలు అందుకుంటున్న వారంతా.. తన కుటుంబాలేనని ఆయన వ్యాఖ్యానించారు. తనకు ఈ రాష్ట్రంలో అమ్మ, అక్క, చెల్లి, అవ్వతాతలు.. ఎంతో మంది ఉన్నారని.. ఇటీవల సిద్ధం సభలో చెప్పుకొచ్చారు. ఇలా... అనేక విషయాల్లో అటు మోడీ.. ఇటు జగన్‌లు యాదృచ్చికమే అయినా.. విపక్షాలపై దాదాపు ఒకే కాన్సెప్టుతో విమర్శలు చేస్తుండడం గమనార్హం.