మోడీ ధ్యానం ముగిసింది.. తర్వాతేమన్నారంటే?

తమిళనాడులోని కన్యాకుమారి స్వామి వివేకానందుడి స్మారక మందిరంలో చేపట్టిన 48 గంటల ధ్యానం ముగిసింది

Update: 2024-06-02 04:53 GMT

అనూహ్యంగా వ్యవహరించటం.. రోటీన్ కు భిన్నంగా నిర్ణయాలు తీసుకోవటం.. అందరూ తన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవటం లాంటి విషయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ముందు ఉంటారని చెప్పాలి. ఒక దేశ ప్రధానమంత్రిగా వ్యవహరించే రాజకీయ నేత..అన్ని విషయాల్ని వదిలేసి.. 48 గంటల పాటు ధ్యానంలో ఉండిపోవటం లాంటి మాట వింటే.. సినిమాల్లో మాత్రమే ఉంటాయని భావిస్తారు. కానీ.. సినిమాటిక్ తీరును మోడీ అప్పుడప్పుడు ప్రదర్శిస్తారు. 48 గంటల ధ్యానానికి సంబంధించిన ప్రచారం ఒక ఎత్తు.. దానిని మరోస్థాయికి తీసుకెళ్లేలా.. కాషాయ దుస్తుల్లో.. జపమాలతో ఆయన ధ్యానం చేసే ఫోటోలు బయటకు రావటం చూసినప్పుడు మోడీ టీం ఆలోచనలు ఏమిటన్నది అర్థమవుతుంది.

తమిళనాడులోని కన్యాకుమారి స్వామి వివేకానందుడి స్మారక మందిరంలో చేపట్టిన 48 గంటల ధ్యానం ముగిసింది. తన జీవితంలోని ప్రతి క్షణం ప్రజాసేవకు అంకితమని చెప్పిన మోడీ.. తాను చేసిన ధ్యానం గురించి.. దాని ఫలితాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని తన సందేశం ద్వారా చెప్పేశారని చెప్పాలి. స్మారక మందిరంలోని విజిటర్స్ బుక్ లో మోడీ ఏం రాశారంటే..

‘‘వివేకానంద స్మారక మందిరం సందర్శనతో నాకు అద్భుతమైన దివ్య శక్తి ప్రాప్తించినట్టు అనిపిస్తోంది. స్వామి వివేకానంద ఆధ్మాత్మిక పునరుజ్జీవనానికి మార్గదర్శకుడు. ఆయనే నాకు స్ఫూర్తి. స్వామి వివేకానంద దేశమంతా పర్యటించాక ఇక్కడే ధ్యానం చేశారు. భారతదేశ పునరుజ్జీవనానికి కొత్త మార్గాన్ని ఆయన ఇక్కడే కనుగొన్నారు. ఇదే స్థలంలో ధ్యానం చేసే అవకాశం నాకు లభించడం నా అదృష్టం. నా జీవితంలోని ప్రతి క్షణం, నా శరీరంలోని ప్రతి కణం దేశ సేవకే అంకితం చేస్తానని భారత మాత పాదాల వద్ద కూర్చొని మరోసారి పునరుద్ఘాటిస్తున్నా’’ అంటూ చెప్పేశారు.

మోడీ రాసిన ప్రతి మాట సూటిగా తాకేలా.. ఆయన కమిట్ మెంట్ ను అందరికి అర్థమయ్యేలా చేశారని చెప్పాలి. సుదీర్ఘ ధ్యానాన్ని ముగించిన తర్వాత ధ్యాన మందిరానికి సమీపంలోని 133 అడుగుల ఎత్తయిన తమిళ కవి తిరువళ్లువర్‌ విగ్రహాన్ని మోదీ సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ధ్యానం పూర్తి అనంతరం కొబ్బరి నీళ్లు..ద్రాక్ష రసం లాంటి ద్రవాహారాన్ని తీసుకున్న ఆయన.. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లిపోయారు.

Tags:    

Similar News