ఏపీ విభజనపై మోడీది మొసలి కన్నీరేనా ?
ఇంతకీ విషయం ఏమిటంటే పార్లమెంటు భవన్ లో ఎంపీలను ఉద్దేశించి నరేంద్రమోడీ మాట్లాడుతు తెలుగు రాష్ట్రాల విభజనపై మాట్లాడారు.
కొన్నిసార్లు ఎవరేమి మాట్లాడుతారో ఎవరికీ అర్ధం కాదు. అసలు ఎందుకు మాట్లాడుతారో కూడా ఒక పట్టాన అర్ధం కాదు. ఇంతకీ విషయం ఏమిటంటే పార్లమెంటు భవన్ లో ఎంపీలను ఉద్దేశించి నరేంద్రమోడీ మాట్లాడుతు తెలుగు రాష్ట్రాల విభజనపై మాట్లాడారు. మాట్లాడారు అనటంకన్నా అనవసరంగా కెలికారు అన్నదే కరెక్టనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడో పదేళ్ళ క్రితం జరిగిపోయిన విభజనను ఇపుడు ప్రస్తావించాల్సిన అవసరం ఏమిటో అర్ధంకావటంలేదు. విభజన సరిగా జరగలేదట. విభజనకు ముందు రక్తం చిందిందట.
విభజన వల్ల రెండు రాష్ట్రాల్లో ఎవరు సంతృప్తిగా లేరట. కనీసం రాష్ట్రం ఏర్పాటును కూడా సంతోషంగా జరుపుకోవటం లేదని మోడీ తెగ బాధపడిపోయారు. ఇందులో కొంత వాస్తవమున్నా మిగిలిందంతా అప్రస్తుత ప్రసంగమనే చెప్పాలి.
రాష్ట్ర విభజన అడ్డుగోలుగా జరిగిందని అందరికీ తెలుసు. దీనివల్ల ఎక్కువగా నష్టపోయింది ఏపీనే అని కూడా తెలుసు. మరి బాగా నష్టపోయిన ఏపీని ఆదుకోవటానికి 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఏమిచేశారు ?
విభజనతో తీవ్రంగా దెబ్బతిన్న ఏపీని మరింతగా దెబ్బకొట్టలేదా ? విభజన హామీలను మోడీ ప్రభుత్వం ఎందుకని తుంగలో తొక్కేసింది ? కనీసం ఒక్కటంటే ఒక్క హామీని కూడా మోడీ అమలుచేయలేదు. ఏపీ విభజనపై ఇంతగా బాధపడుతున్న మోడీ మరి ఏపీకి గడచిన పదేళ్ళుగా ఎందుకని న్యాయం చేయలేదు ? సొల్లుకబుర్లు తప్ప పనికొచ్చే మాట ఒక్కటీ చెప్పలేదు. ప్రధానమంత్రి అయినదగ్గర నుండి చాలాసార్లే ఏపీలో పర్యటించుంటారు. ఎప్పుడూ ఒక్కసారి కూడా అభివృద్ధికి అవసరమైన పునాదిరాయి వేయలేదు.
ఏపీకి చాలా చేసేశామని చెప్పుకోవటం మినహా ఏమీ చేయలేదు. విభజన హామీల్లో ఇవ్వాల్సిన కొన్నింటిని మాత్రమే నెరవేర్చారంతే. దాన్నే ఏపీకి చాలా చేసేశామని డప్పుకొట్టుకుంటున్నారు. ఏపీకి రోటీన్ గా రావాల్సినవి మాత్రమే వస్తున్నాయంతే.
ఇంకా జీఎస్టీ వాటా అయితే రావాల్సినది కూడా ఇవ్వటంలేదని ఆర్ధికనిపుణులు మొత్తుకుంటున్నారు. రెవిన్యు లోటు, పోలవరం రీ ఎంబర్స్ మెంటు లాంటివి సంవత్సరాల తరబడి పెండింగులో పెట్టి ఈమధ్యనే విడుదల చేయటం కూడా ఏపీకి మేలు చేయటమేనా ?