ఆ పార్టీ వైపు చూసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు : విజయసాయిరెడ్డి సెన్సేషన్

వైసీపీలో నెంబర్ 2గా చెలామణీ అయిన విజయసాయిరెడ్డి అనూహ్యంగా ఆ పార్టీకి రాజీనామా చేయడంతోపాటు ఏకంగా రాజకీయాల నుంచే వైదొలిగారు.;

Update: 2025-03-12 10:15 GMT

వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. తాను రాజకీయాల నుంచి వైదొలగడానికి ప్రధాన కారణం ఏంటో కూడా ఎట్టకేలకు కుండబద్ధలు కొట్టారు. జగన్ కుటుంబంతో మూడు తరాల బంధం తెగిపోవడానికి ఆయన చుట్టూ ఉన్న కోటరీనే కారణమని ఆరోపించారు. తాను కిందకి దిగాను కాబట్టే వారు పైకి ఎక్కారని పరోక్షంగా సజ్జల రామక్రిష్ణారెడ్డిపై విమర్శలు చేశారు విజయసాయిరెడ్డి.

వైసీపీలో నెంబర్ 2గా చెలామణీ అయిన విజయసాయిరెడ్డి అనూహ్యంగా ఆ పార్టీకి రాజీనామా చేయడంతోపాటు ఏకంగా రాజకీయాల నుంచే వైదొలిగారు. ఆకస్మాత్తుగా ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవడానికి అప్పట్లో ఏ కారణం చెప్పలేదు. కానీ, కాకినాడ సీపోర్టు వాటాల బదిలీపై సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి, విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను ప్రస్తావించారు. సీఐడీ విచారణలో ఎదుర్కొన్న ప్రశ్నలతోపాటు తన రాజకీయ పయనం, జగన్ తో అనుబంధంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.

జగన్ మనసులో తనకు స్థానం లేకుండా పోవడంతోనే తాను రాజకీయాల నుంచి వైదొలగాల్సివచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ చుట్టూ ఓ కోటరీ ఏర్పడిందని, వారు చెప్పినిదంతా వినడం వల్ల జగన్ తనను దూరం పెట్టారని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో పని విషయమై జగన్ ను కలవాలంటే ముందుగా కోటరీని ప్రసన్నం చేసుకోవాల్సివచ్చేదని, వారికి కానుకలు సమర్పిస్తేనే జగన్ తో అపాయింట్మెంట్ ఇచ్చేవారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. తనకు జగన్ కుటుంబానికి చాలా అనుబంధం ఉందని, కోటరీ వల్ల ఆ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని వ్యాఖ్యానించారు.

చెప్పుడు మాటలు విన్నంతవరకు జగన్ కు, ఆయన పార్టీకి రాజకీయ భవిష్యత్ లేదని కూడా విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది. తన మనసు విరిగిపోయిందని, విరిగిపోయిన మనసు మళ్లీ అతకదని అన్నారు. తన విషయంలో ఘర్ వాపసీ అంటూ ఏమీ ఉండదని స్పష్టం చేశారు. జగన్ బాగుండాలని ఇప్పటికీ కోరుతున్నానని, కానీ, ఆయన చెప్పుడు మాటలు వినకుండా, ఎవరు నిజాలు చెబుతున్నారో? ఎవరు అబద్దాలు ఆడుతున్నారో తెలుసుకోవాలని సలహా ఇచ్చారు. మనస్ఫూర్తిగా వైసీపీ కోసం పనిచేసిన తాను ఇకపై ఆ పార్టీ వైపు చూసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

Tags:    

Similar News