పవన్ పై మోదీ సంచలన వ్యాఖ్యలు!
ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. పవన్ కాదు.. తుఫాన్ అంటూ కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అధికార వైసీపీని 11 ఎమ్మెల్యే, 4 పార్లమెంటు సీట్లకే కూటమి పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో కూటమిపై ఇంటా బయటా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. జాతీయ టీవీ చానెళ్లు పవన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అని, ఏపీ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఆయనేనని వ్యాఖ్యానాలు వెలువరిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. పవన్ కాదు.. తుఫాన్ అంటూ కొనియాడారు.
ఎన్డీయే కూటమి ఎంపీల సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాల అధినేతలు, ఎంపీలు హాజరయ్యారు. టీడీపీ, జనసేన పార్టీ అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. ఈ భేటీలో తమ నాయకుడిగా నరేంద్ర మోదీని అంతా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. పవన్ పై అభినందనల జల్లు కురిపించారు.. ‘పవన్ వైపు చూపిస్తూ.. ఇదిగో ఇక్కడ ఉన్నాడే.. ఇతడు పవన్ కాదు.. తుఫాన్’ అంటూ ప్రశంసించారు. ఆంధ్రా ప్రజలు తమకు అఖండ విజయం కట్టబెట్టారన్నారు. ప్రధాని మాటలకు పవన్ రెండు చేతులెత్తి నమస్కరించారు.
కాగా మొదటి నుంచి ఏపీలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనంటూ పవన్ కళ్యాణ్ చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో టీడీపీతో పొత్తుకు ఆయనే ముందుకు వచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో జైలు పాలయిన చంద్రబాబును కలవడానికి పవన్ రాజమండ్రి జైలుకొచ్చారు. ఆ తర్వాత బయటకు రాగానే పొత్తును ప్రకటించి ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా మలుపుతిప్పారు.
అలాగే మొదటి నుంచి టీడీపీతో పొత్తుకు సుముఖంగా లేని బీజేపీని కూడా తమ కూటమిలోకి పవన్ కళ్యాణే తీసుకొచ్చారు. ఈ విషయంలో తాను బీజేపీ పెద్దల చేత తిట్లు కూడా తిన్నానని పలుమార్లు పవన్ ఎన్నికల ప్రచార సభల్లోనూ చెప్పారు. బీజేపీ.. టీడీపీ, జనసేన కూటమిలో చేరుతుందా, లేదా అని చివరి వరకు డైలమా ఉండగా.. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ కృషితో బీజేపీ కూడా చివరి క్షణంలో కూటమిలో కలిసింది.
బీజేపీకి ఇవ్వాల్సిన సీట్ల కోసం పవన్ కళ్యాణ్ తన సీట్లను కూడా త్యాగం చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం జనసేన 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లలో పోటీ చేయాల్సి ఉంది. అయితే బీజేపీ కోసం మూడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాన్ని పవన్ వదిలిపెట్టారు. ఇందులో పవన్ సోదరుడు నాగబాబు పోటీ చేసే అనకాపల్లి పార్లమెంటు స్థానం కూడా ఉండటం గమనార్హం.
పవన్ వల్లే కూటమి ఏర్పాటు సాధ్యమైందని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, తదితర నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ కూడా పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు వ్యక్తం చేయడంతో మరోసారి ఆయన జాతీయ స్థాయిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు.