మోడీ భయపడిందే జరిగిందా ?
దాదాపు మూడునెలలుగా మణిపూర్లో అల్లర్లు జరుగుతుంటే నరేంద్రమోడీ అక్కడకు ఎందుకు వెళ్ళలేదని నిలదీశాయి.
నరేంద్రమోడీ ప్రభుత్వం అనుకున్నంతా జరిగింది. అందుకనే మణిపూర్ అల్లర్లపై దీర్ఘకాలిక చర్చకు పార్లమెంటులో ఇన్ని రోజులు అనుమతించనిది. దీర్ఘకాలిక చర్చకు అనుమతిస్తే ఏమి జరుగుతుందో మోడీకి బాగా తెలుసు. మణిపూర్ అల్లర్లపై పార్లమెంటులో దీర్ఘకాలిక చర్చ జరగాలని ఇండియాకూటమి, ప్రతిపక్షాలు నానా గోల చేశాయి.
అదేమి అవసరంలేదు స్వల్పకాలిక చర్చ చాలని ఎన్డీయే కూటమి, బీజేపీ ఎదురుదాడితో నెట్టుకొస్తున్నాయి. అందుకనే ఇక లాభంలేదని ఇండియాకూటమి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించింది. దాని దెబ్బకు ఇపుడు మూడురోజుల చర్చ మొదలైంది.
ఇండియా కూటమి, ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించటంతో దాన్ని ఓకే చేయక స్పీకర్ ఓంబిర్లాకు వేరే దారి కనబడలేదు. దాని ఫలితంగా 8,9,10 తేదీల్లో అవిశ్వాసంపై చర్చను మొదలుపెట్టారు. మొదటిరోజే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని పట్టుకుని దుమ్ముదులిపేశాయి. అల్లర్లు కంట్రోల్ చేయటంలో రాష్ట్ర, కేంద్రప్రభుత్వాల చేతకానితనాన్ని గట్టిగా ఎండగట్టాయి. దాదాపు మూడునెలలుగా మణిపూర్లో అల్లర్లు జరుగుతుంటే నరేంద్రమోడీ అక్కడకు ఎందుకు వెళ్ళలేదని నిలదీశాయి.
అల్లర్లు జరిగిన వెంటనే మోడీ ఎందుకు ప్రకటనచేయలేదో చెప్పాలని డిమాండ్ చేశాయి. అల్లర్లను అదుపుచేయటంలో ఫెయిలైన ముఖ్యమంత్రిని ఎందుకు తప్పించలేదని ప్రశ్నించాయి. మణిపూర్ కు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళాలని ఎందుకు అనిపించలేదని మండిపోయాయి. మణిపూర్ అల్లర్లపై కాంగ్రెస్, ప్రతిపక్షాలు ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే బీజేపీ ఎంపీలు మాత్రం అల్లర్లపై రాహుల్ గాంధి ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని పనికిమాలిన డిమాండ్లు చేయటం ఆశ్చర్యంగా ఉంది.
ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నల్లో దేనికీ ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేదు. ఉన్నదల్లా సంఖ్యబాలం మాత్రమే. ఆ బలంతోనే ప్రతిపక్షాల నోళ్ళు మూయించేందుకు ప్రయత్నిస్తోంది. మణిపూర్ లోజాతుల హింస, సరిహద్దుల్లో చైనా దాడులపై నరేంద్రమోడీ మౌనంగా ఉండటం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని మండిపడ్డాయి.
సంఖ్యాబలం తక్కువగా ఉన్న విషయం తమకు తెలిసినా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించింది మోడీతో మాట్లాడించాలనే కానీ ప్రభుత్వాన్ని ఓడించాలని కాదని కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ స్పష్టంగా చెప్పారు. మొత్తానికి అనుకున్నట్లుగానే మొదటిరోజు ప్రతిపక్షాలు సభలో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. మరి రెండోరోజు ఏమవుతుందో చూడాలి.