జాతీయ సర్వేలు వర్సెస్ ప్రాంతీయ సర్వేలు !
అలా ఎన్డీయేలో భాగం అయిన ఏపీలో టీడీపీ కూటమికి కూడా భారీ ఆధిక్యతను ఇచ్చాయి.
ఏపీలో ఎగ్జిట్ పోల్ సర్వేలలో ఏది నిజం అవుతుంది ఎవరికి పట్టం కడతారు అన్నది అతి పెద్ద చర్చగా మారుతోంది. జూన్ 1 సాయంత్రం ఆరున్నర నుంచి వెల్లువలా సర్వేలు వచ్చాయి. అయితే ఈ సర్వేలలో చూస్తే జాతీయ స్థాయి సర్వేలు అన్నీ కూడా ఎన్డీయేకు పట్టం కట్టాయి. అలా ఎన్డీయేలో భాగం అయిన ఏపీలో టీడీపీ కూటమికి కూడా భారీ ఆధిక్యతను ఇచ్చాయి.
ఇక జాతీయ సర్వేలు అంచనాలు ఎలా ఉన్నాయంటే బీహార్ లో ఎల్ జేడీ పోటీ చేసిన సీట్ల కంటే ఎక్కువగా వస్తాయని ప్రకటించి నవ్వుల పాలు అయ్యాయి. అంతే కాదు తమిళనాడులో కూడా ఇదే తీరున అంచనాలు కట్టాయి.
జాతీయ సర్వేలు బీజేపీ స్లోగన్ అయిన 400 సీట్లు అన్న దానిని పట్టుకుని దానికి దగ్గరగా నంబర్ ఇచ్చేందుకు ఆరాటపడ్డాయని అంటున్నారు. అయితే జాతీయ సర్వేల అంచనా తప్పు తమకు భారీగానే నంబర్ వస్తుందని ఇండియా కూటమి చెబుతోంది.
మరో వైపు చూస్తే జాతీయ సర్వేలు లోక్ సభ ఎన్నికల్లో సక్సెస్ అయినట్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో అయిన ట్రాక్ రికార్డు లేదు. పైగా జాతీయ సర్వే సంస్థలు ఆయా రాష్ట్రాల్లో ఏజెన్సీలకు కాంట్రాక్ట్ ఇచ్చి సర్వేలు జరిపిస్తూంటాయి. అలా కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థలు ఎన్ని శాంపిల్స్ కలెక్ట్ చేశాయి, ఎంత లోతులకు వెళ్ళి అధ్యయనం చేశాయన్నది కూడా సందేహాస్పదంగా ఉంటుందని అంటున్నారు.
అదే సమయంలో ప్రాంతీయ సర్వేలు మాత్రం చాలా ఎక్కువగా జనంతో టచ్ లో ఉంటూ గ్రౌండ్ లెవెల్ రియాలిటీలను ప్రతిబింబిస్తాయని చెబుతున్నారు. అలా చూస్తే కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ సర్వేలు చెప్పిన ఎగ్జిట్ పోల్స్ మీదనే ఎంతో కొంత విశ్వసనీయత ఉంటుందని అంటున్న వారూ ఉన్నారు
చాలా సందర్భాల్లో ప్రాంతీయ సర్వేల అంచనాలు నిజం అయ్యాయని గుర్తు చేస్తున్నారు. మరి ఏపీలో చూస్తే జాతీయ సర్వేలు ప్రాంతీయ సర్వేల మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. ఎన్డీయే గెలుపు అని చెబుతూ అన్ని చోట్లా కమల వికాసం అని చెబుతూ జాతీయ సర్వేలు ఇస్తున్న అంచనాలు ఏ మేరకు విజయవంతం అవుతాయన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.
ఇక ప్రాంతీయ సర్వేలు విజయవంతం కావడానికి కారణాలు వారు మాట్లాడే భాష ఒక్కటే కావడం, జనాల సెంటిమెంట్ వారి సమస్యలు వారి ఆలోచనలు జాతీయ సర్వేల కంటే ఎక్కువగా పసిగట్టగలవు అని అంటున్నారు. మరి ఈ విషయంలో పైపైన సర్వేలు చేసినా లేక వేరే ఎవరి మీదనో ఆధారపడి అంచనాలు వేసినా కూడా ఇబ్బంది అవుతుందని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఏపీలో ఆరా మస్తాన్ సర్వేకు ఆత్మ సాక్షి సర్వేకూ చాలా ప్రాధాన్యత ఉంది అని అంటున్నారు. ఈ రెండూ కూడా 2019 ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని అంచనా వేశాయి. ఆరా మస్తాన్ అయితే 124 నుంచి 130 దాకా వైసీపీకి వస్తాయని కూడా చెప్పారు. ఇపుడు కూడా ఈ రెండు సంస్థలు వైసీపీ వైపు మొగ్గు చూపించడంటో టీడీపీ కూటమిలో ఒకింత కలవరంగా ఉంది అని అంటున్నారు.
దీని మీదనే బుద్ధా వెంకన్న వంటి వారు కూటమి అధికారంలోకి రాకపోతే నాలిక తెగ్గోసుకుంటాను అని చెబుతున్నారు. ఈ విధంగా సవాల్ చేయడం వెనక చాలా అంశాలు ఉన్నాయని అంటున్నారు. జాతీయ సర్వేలు టీడీపీకి సంతోషాన్ని నింపుతూంటే ప్రాంతీయ సర్వేలలో ముఖ్యమైనవి వైసీపీ సైడ్ తీసుకోవడమే కొంత గందరగోళంగా ఉంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి అయితే జాతీయ సర్వేలు ఎవరినో సంతోష పెట్టేందుకు ఇచ్చినట్లుగా ఉన్నాయని ప్రాంతీయ సర్వేలే గ్రౌండ్ లెవెల్ లో కొంత విషయాన్ని పట్టుకున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఎవరి అంచనా నిజం అవుతుంది అన్నది జూన్ 4న ఫలితాలలో తేలనుంది.