టీడీపీ కూటమి ప్రభుత్వం...ఏం జరుగుతోంది ?
అయితే సర్కార్ కి మైలేజ్ దక్కే కీలక సమయంలో సరిగ్గా అనూహ్య సంఘటలకు చోటు చేసుకుంటున్నాయి.
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయింది. అయితే కూటమి ప్రభుత్వం ఈ ఏడు నెలలలో చేసింది చేస్తోంది చాలానే ఉంది. అయితే సర్కార్ కి మైలేజ్ దక్కే కీలక సమయంలో సరిగ్గా అనూహ్య సంఘటలకు చోటు చేసుకుంటున్నాయి. దాని కంటే ఎక్కువగా ఇతర అంశాలే జనంలోకి పోతున్నాయని అంటున్నారు.
దానికి ఉదాహరణలు కూడా కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. విశాఖలో దాదాపుగా రెండు లక్షల పది వేల కోట్లతో భారీ పెట్టుబడులను ఏపీలో కూటమి ప్రభుత్వం సాధించింది. అది ఒక పెట్టుబడుల పండుగగా ప్రధాని మోడీ సమక్షంలో సాగింది.
విశాఖలో ప్రధాని మోడీ అటెండ్ అయిన ఈ సభ ఫుల్ సక్సెస్ అయింది. అయితే దాని గురించి మాట్లాడుకునే అవకాశం ఇవ్వకుండా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించడంతో మొత్తం వ్యవహారం ఆ వైపు టర్న్ అయింది. ఒక్కసారిగా ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయింది.
దాంతో గుక్క తిప్పుకునేలోగా వేగంగా పరిణామాలు జరిగిపోయాయి. మరో వైపు చూస్తే తిరుపతిలో తొక్కిసలాట ఘటన జాతీయ స్థాయిలోనూ హైలెట్ అయింది. ఏకంగా ప్రధాని రాష్ట్రపతి రాష్ట్రపతి రాహుల్ గాంధీ వంటి వారు ఈ ఘటన మీద దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దేశమంతా ఉలిక్కిపడింది.
దాంతో ఏపీ ప్రభుత్వం కష్టపడి రెండు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిందన్న విషయం పక్కన పోయింది. ఒక విధంగా ప్రభుత్వానికి రావాల్సిన పాజిటివ్ మైలేజ్ కంటే ఇదే ఎక్కువగా జనంలోకి పోయింది అని అంటున్నారు. దీంతో ప్రభుత్వ పెద్దలు కూడా చాలా ఇబ్బందులో పడాల్సి వచ్చిందని అంటున్నారు.
ఇక ఇదే విధంగా మరో ఎపిసోడ్ చూస్తే గత ఏడాది అగస్ట్ చివరిలో విజయవాడలో వచ్చిన భారీ వరదలు. ఏకంగా బుడమేరు పొంగి పొరలి విజయవాడ వీధులన్నీ కూడా నదీ ప్రవాహం కావడం కొందరు చనిపోవడం సీఎం స్థాయి వ్యక్తి పడవలేసుకుని విజయవాడలో పర్యటన చేయడం ఇవన్నీ కూడా ఆనాడు జాతీయ మీడియాను అట్రాక్ట్ చేశాయి.
ఇక కల్తీ లడ్డూ ఇష్యూలో తప్పు ఎవరిది అన్నది ఒక పక్కన పెడితే అది కాస్తా సుప్రీం కోర్టు దాకా వెళ్ళి జాతీయ చర్చలలో నలిగింది. అలా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కూటమి పెద్దలు ఎదుర్కోవాల్సి వచ్చింది అని అంటున్నారు.
నిజానికి చూస్తే ఏపీలో ప్రభుత్వం గత ఆరేడు నెలలుగా బాగా కష్టపడుతోంది. పెట్టుబడులు రప్పించేందుకు అభివృద్ధి చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటోంది. కానీ అవన్నీ హైలెట్ కాకుండా ఇలాంటి ఇష్యూస్ ముందుకు వస్తున్నాయని అంటున్నారు. దాంతో ఏడు నెలల కూటమి ప్రభుత్వం విషయంలో రావాల్సిన మైలేజ్ దక్కడం లేదా అన్న చర్చ మొదలైంది. అంతే కాదు కూటమి ప్రభుత్వానికి దిష్టి ఏమైనా తగిలిందా అన్న చర్చ కూడా సాగుతోంది.
బలమైన ప్రభుత్వం ఏపీలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏర్పాటు అయింది. మొత్తం అసెంబ్లీ నిండా కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇక సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు అలాగే ప్రజాకర్షణ కలిగిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ కూటమికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ఆశీస్సులు గట్టిగా ఉన్నాయి.
మరి ఇన్ని ఉండి కూడా అనుకున్న విధంగా జనంలో కష్టానికి తగిన విధంగా పాజిటివిటీని ప్రభుత్వం ఎందుకు సంపాదించుకోలేకపోతోంది అన్నదే చర్చగా మారింది. వరదలు కానీ తిరుమల తొక్కిసలాట కానీ ఇతర అంశాలు కానీ అనుకోని వచ్చినవి కాదు కానీ ప్రభుత్వ ఇమేజ్ ని వీటిని బట్టి కూడా చూస్తారు. దాంతోనే కూటమి పెద్దలు ఈ దిష్టి పోవడానికి ఏమి చేయాలన్నది ఆలోచించాలేమో అని అంటున్నారు.