ఐసీయూ బెడ్ పై రూపాయి... మోడీకి గతం గుర్తు చేస్తున్న నెటిజన్లు!

ఈ నేపథ్యంలో తాజాగా డాలర్ తో పోలిస్తే రూపాయి సరికొత్త జీవితకాల కనిష్టానికి చేరుకుంది.

Update: 2024-12-28 03:57 GMT

గత కొంతకాలంగా డాలర్ తో రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్టానికంటూ పడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఈ నెలలో మొదటిసారిగా 1 డాలర్ విలువ 85 రూపాయల మార్కును అధిగమించింది! ఈ నేపథ్యంలో తాజాగా డాలర్ తో పోలిస్తే రూపాయి సరికొత్త జీవితకాల కనిష్టానికి చేరుకుంది.

అవును.. అమెరికా డాలర్ తో పోలిస్తే భారత రూపాయి రోజు రోజుకీ బలహీనపడుతుంది. ఈ క్రమంలో వరుసగా తొమ్మిదోరోజు క్షీణించింది. ఇందులో భాగంగా. శుక్రవారం ఇంట్రాడేలో తాజా జీవనకాల కనిష్ఠమైన 85.15 ను పరీక్షించి.. చివరికి 21 పైసలు కోల్పోయి 85.48 వద్ద ముగిసింది. ఇది ఈ ఏడాది జూన్ 4 తర్వాత ఒక రోజు అతిపెద్ద నష్టం అని అంటున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన నిపుణులు... నాన్ డెలివరబుల్ ఫార్వర్డ్స్ మార్కెట్ లో డాలర్ కు బలమైన గిరాకీ లభిస్తుండటం రూపాయి క్షీణతకు కారణం అవుతోందని.. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగడంతో శుక్రవారం చివర్లో రికవరీ వచ్చిందని చెబుతున్నారు.

ఏది ఏమైనా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ డాలర్ తో పోలిస్తే రూపాయి 3% బలహీనపడింది. దీంతో... వరుసగా ఏడో ఏడాది వార్షిక నష్టాలను చవిచూడనుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే మార్చికి డాలర్ విలువ 86 రూపాయలకు చేరొచ్చని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ అంచనా వేస్తున్నాయని అంటున్నారు.

ఇదే సమయంలో... ఆ స్థాయికంటే కూడా పెరిగే అవకాశం కూడా ఉందని కోటక్ సెక్యూరిటీస్ అభిప్రాయపడుతోంది. దేశీయంగా బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు కొరత సుమారు 7 నెలల్లోనే అత్యధికంగా ఉందని.. పన్నుల చెల్లింపు, రూపాయి క్షీణతను ఆపేందుకు ఆర్బీఐ ఫరెక్స్ నిల్వలను వాడటం ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

అదేవిధంగా... ఫెడరల్ రిజర్వ్ పాలసీ దృక్పథం, అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ విధానాల చుట్టూ ఉన్న అంచనాల మధ్య విపరీతమైన మార్పుల మధ్య భారత్ యొక్క విస్తృతమైన వాణిజ్య లోటు గురించి ఆందోళనలు విస్తృత ఆధారిక డాలర్ బలంతో పాటు రూపాయిని దెబ్బతీశాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో.. ప్రస్తుత పరిస్థితిని పరిగణలోకి తీసుకుని 2025 మార్చి నాటికి రూపాయి విలువ ఏ స్థాయికి చేరొచ్చనే విషయాలపై పలు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ అంచనాలు వేస్తున్నాయి. ఇందులో భాగంగా... ఐ.డీ.ఎఫ్.సీ. బ్యాంక్ 85.50.. హెచ్.డి.ఎఫ్.సీ. బ్యాంక్ 85 - 86.. నువామా 86.00 కాగా... కోటక్ సెక్యూరిటీస్ 86.50 గా అంచనా వేస్తున్నాయి.

ఆ సంగతి అలా ఉంటే... వరుసగా ఏడో ఏడాది వార్షిక నష్టాలను చవిచూడనుందని అంటున్న నేపథ్యంలో ప్రధాని మోడీకి గతం గుర్తు చేస్తున్నారు నెటిజన్లు. యూపీఏ హయాంలో రూపాయి విలువ పడిపోయినప్పుడు ఆయన చేసిన ట్వీట్లను నెటిజన్లు తాజాగా వైరల్ చేస్తున్నారు. అప్పట్లో మోడీ చేసిన వ్యాఖ్యలను తిరిగి ఆయనపైనే ప్రయోగిస్తున్నారు.

ఇందులో భాగంగా... మమ్మల్ని గెలిపిస్తే 100 రోజుల్లో ఇన్ఫ్లేషన్ తగ్గిస్తామని.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయని.. రూపాయి ఐసీయూలో చేరిందని అప్పట్లో మోడీ యూపీఏ సర్కార్ ని ఉద్దేశించి ట్వీట్స్ చేశారు. ఈ నేపథ్యంలో... "మోడీ చెప్పింది నిజమే గత ఏడేళ్లుగా వరుసగా రూపాయి ఐసీయూ బెడ్ పైనే ఉంది.. వచ్చే ఏడాది వెంటిలేటర్ పైకి చేరనుంది!" అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Tags:    

Similar News