భయపెడుతున్న కొత్త వైరస్... భారత్, చైనా కీలక వ్యాఖ్యలు!

కరోనా మహమ్మారి అనుభవాలను ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు మరోసారి జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాయని అంటున్నారు.

Update: 2025-01-03 17:05 GMT

చైనాలో కొత్త వైరస్ కలకలం ' అనే కథనాలు ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి అనుభవాలను ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు మరోసారి జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఇటు భారత్, అటు చైనా దేశాలు ఈ వైరస్ పై స్పందించాయి.

అవును... చైనాలో కొత్త వైరస్, కిటకిటలాడుతున్న ఆస్పత్రులు, త్వరలో లాక్ డౌన్ తప్పదా?.. వంటి కథనాలు వైరల్ అవుతున్న వేళ తాజాగా భారత హెల్త్ ఏజెన్సీ ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్’ (డీ.జీ.హెచ్.ఎస్.) స్పందించింది. ఈ మేరకు డీ.జీ.హెచ్.ఎస్. ఉన్నతాధికారి డాక్టర్ అతుల్ గోయల్ దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు.

ఇందులో భాగంగా... హ్యూమన్ మెటాఫ్ నిమో వైరస్ (హెచ్.ఎం.పీ.వీ) వ్యాప్తి పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఈ వైరస్ కూడా సాధారణ జలుబుకు కారణమయ్యే ఇతర శ్వాసకోస వైరస్ ల మాదిరిగానే ఉంటుందని.. పిల్లలు, వృద్ధుల్లో ఫ్లూ వంటి లక్షణాలను ఇది చూపిస్తోందని తెలిపారు.

ఇక.. మన దేశంలో శ్వాసకోశ సంబంధిత వైరస్ ల వ్యాప్తికి సంబంధించిన డేటాను విశ్లేషించగా.. అందులో గత ఏడాది డిసెంబర్ వరకూ ఎలాంటి గణనీయమైన మార్పులు ఏమీ లేవని తెలిపారు. అయితే... ఎవరికైనా దగ్గు, జలుబు ఉంటే.. అలాంటి వ్యక్తులు ఎక్కువ మంద్తో కలవడం మంచిది కాదని గోయల్ సూచించారు.

హెచ్.ఎం.పీ.వీ. పై స్పందించిన చైనా!:

మరోపక్క తాజాగా వినిపిస్తున్న హెచ్.ఎం.పీ.వీ. వైరస్ వ్యవహారంపై చైనా స్పందించింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా.. శీతాకాలంలో వచ్చే ఈ శ్వాసకోశ వ్యాధుల తీవ్రత గత ఏడాదితో పోలిస్తే తక్కువగానే ఉందని.. విదేశీయులు తమ దేశంలో పర్యటించడం సురక్షితమే అని పేర్కొంది.

చైనాలో ఇన్ ఫ్లుయేంజాతోపాటు ఇతర శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తిపై అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా స్పందించారు. ఇందులో భాగంగా... శీతాకాలంలో ఈ వ్యాధుల నియంత్రణకు సంబంధించి నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మార్గదర్శకాలు జారీ చేసిందని విదేశాంగ అధికార ప్రతినిధి మావో వింగ్ తెలిపారు.

లక్షణాలు ఇవే!:

ఈ నేపథ్యంలో హ్యూమన్ మెటాఫ్ నిమో వైరస్ (హెచ్.ఎం.పీ.వీ) వైరస్ లక్షణాలు ఏమిటి అనే చర్చ బలంగా మొదలైందని అంటున్నారు. దీంతో... ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ మాదిరిగానే ఈ హెచ్.ఎంపీ.వీ. వైరస్ లక్షణాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు! ఈ సమయంలో.. ఈ వ్యాధి లక్షణాలు మూడు నుంచి ఆరు రోజుల్లో బయటకు కనిపిస్తాయని అంటున్నారు.

ఇందులో భాగంగా.. దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, ముక్కు కారడం, శ్వాస సరిగా ఆడకపోవడం, శరీరంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు. అది కలిగి ఉన్న వారితో ప్రత్యక్ష పరిచయం ద్వారా లేదా.. వైరస్ తో కలుషితమైన వస్తువులను తాకడం ద్వారా వ్యాపిస్తుందని చెబుతున్నారు.

Tags:    

Similar News