విచిత్రం: అనంత పద్మనాభస్వామి టెంపుల్లో కొత్త మొసలి ప్రత్యక్షం
ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయంగా పేరున్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మరో నమ్మలేని నిజం చోటు చేసుకుంది.
మిగిలిన దేశాలతో పోలిస్తే మన దేశంలో చోటు చేసుకునే కొన్ని విచిత్రాలకు సైన్స్ సమాధానం చెప్పలేదు. ఎందుకిలా? అనే ప్రశ్నకు జవాబు రాదు.కొందరు మూఢనమ్మకం అని కొట్టిపారేసినా.. అందుకు భిన్నంగా చోటు చేసుకునే పలు పరిణామాలు విస్మయానికి గురి చేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి కేరళలో జరిగింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయంగా పేరున్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మరో నమ్మలేని నిజం చోటు చేసుకుంది.
కాసర్ గోడ్ జిల్లాలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో గత ఏడాది శాఖాహార మొసలి బబియామరణించటం తెలిసిందే. దాని స్థానంలో మరో మొసలి వస్తుందన్న నమ్మకానికి తగ్గట్లే తాజాగా మరో మొసలిని గుర్తించారు.ఈ నెల ఎనిమిదిన ఆలయ కొలనులో మొసలిని గుర్తించారు. వెంటనే ఆ సమాచారాన్ని ఆలయ ప్రధాన పూజారికి తెలియజేశారు.
ఈ నేపథ్యంలో మొసలి విషయంలో ఏం చేయాలన్న విషయాన్ని ఆయన నిర్ణయించనున్నట్లు చెబుతున్నారు. ఒక మొసలి చనిపోయిన తర్వాత కొద్ది రోజులకే మరో మొసలి రావటం జరుగుతుందని.. ఈసారి అలానే జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. గత ఏడాది శాఖాహారి మొసలి బబియా మరణించిన తర్వాత మరో మొసలి కొలనులో ప్రత్యక్షమవుతుందన్న ప్రచారానికి తగ్గట్లే.. తాజాగా గుర్తించిన మొసలి నాలుగోదిగా చెబుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా అందరిలోనూ ఆసక్తికరంగా మారింది.
ఈ మిస్టరీకి సంబంధించి ప్రచారంలో ఉన్న కథనాలు చాలానే వినిపిస్తాయి. గత ఏడాది మరణించిన బబియా మొసలి మూడోదిగా చెబుతారు. దాని వయసు 70 ఏళ్లుగా చెబుతారు. ఒకప్పుడు కొలనులో ఒక పెద్ద మొసలి ఉండేదని.. దాన్ని బ్రిటీష్ వారు కాల్చేయగా.. తర్వాత మరో మొసలి ప్రత్యక్షమైనట్లు చెబుతారు. అది చనిపోయిన తర్వాత మూడో మొసలి బబియా అని.. కొత్త మొసలి నాలుగోదని చెబుతున్నారు. బబియా శాఖాహారి. ఆలయ పూజారి పెట్టే ప్రసాదంతోనే జీవించేది. ఎవరికి హాని తలపెట్టేది కాదని.. కొలనులో ఉన్న చేపల్ని సైతం ముట్టేది కాదని చెబుతారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. బబియాకు ఆ పేరు ఎవరు పెట్టారో కూడా తెలీదు. బబియా అంత్యక్రియలకు రాజకీయ నేతలు మొదలు వేలాది మంది భక్తులు తరలిరావటం అప్పట్లో అందరిని విస్మయానికి గురి చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. ఆ ఆలయ సమీపంలో ఎలాంటి నది.. సరస్సు లేకపోవటం. కానీ.. ఆలయ కోనేరులోనే మొసలి ప్రత్యక్షం కావటం.. ఎవరికి హాని తలపెట్టకుండా ఉండటం విచిత్రమైన ఉదంతంగా చెప్పక తప్పదు.