చిన రాజప్ప హ్యాట్రిక్ ఆశలకు వైసీపీ బ్రేకులు...!

ఇక విభజన తరువాత చూస్తే ఈ సీటులో దాదాపుగా పాగా వేశారు నిమ్మకాయల చినరాజప్ప. ఆయన అమలాపురం నుంచి వచ్చి పెద్దాపురంలో కుదురుకున్నారు.

Update: 2024-03-27 03:15 GMT

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పెద్దాపురం సీటు రాజకీయంగా చైతన్యవంతమైనది. ఇక్కడ నుంచి ఎందరో మహామహులు గెలిచారు. పంతం పద్మనాభం వంటి ఉద్ధండులు పలు మార్లు గెలిచిన సీటు ఇది. ఇక విభజన తరువాత చూస్తే ఈ సీటులో దాదాపుగా పాగా వేశారు నిమ్మకాయల చినరాజప్ప. ఆయన అమలాపురం నుంచి వచ్చి పెద్దాపురంలో కుదురుకున్నారు. స్థానికేతరుడు అన్న ముద్ర నుంచి బయటపడ్డారు.

ఆయనకు 2014లో తొలిసారి గెలుపు వరించింది. ఏకంగా హో మంత్రి వంటి కీలక శాఖతో ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. దాంతో అయిదేళ్లలో పెద్దాపురంలో తనకు తిరుగులేదని పించుకున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు కుటుంబానికి పట్టు ఉంది. ఆయన నాలుగు సార్లు ఇక్కడ నుంచి గెలిచారు. ఆయన తనయుడు వెంకటరమణ కూడా ఈ సీటు ఆశిస్తూ వచ్చారు. అయితే చినరాజప్ప చంద్రబాబు ఆశీస్సులతో 2019లో కూడా సీటు సాధించారు. జగన్ వేవ్ లో సైతం గెలిచి సత్తా చాటారు.

ఆయనకు మూడవసారి అది కూడా తొలి విడతలోనే బాబు టికెట్ ఇచ్చేశారు. దాంతో ఆయన ఉత్సాహంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఆయన మీద దవులూరు దొరబాబుని వైసీపీ పోటీకి దించుతోంది. ఈయనకు ఎమ్మెల్యే కావాలన్న కోరిక ఇరవై ఏళ్ళ నాటిది. 2004 నుంచి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రజారాజ్యం టీడీపీ ఇలా అన్ని పార్టీలలో ఆయన టికెట్ రేసులో చివరి దాకా వచ్చి టికెట్ అందుకోలేకపోయారు. ఇక 2019 నుంచి వైసీపీలో ఉన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీని గెలిపించారు

నియోజకవర్గం ఇంచార్జిగా అనధికార ఎమ్మెల్యేగా వ్యవహరించారు. తన పలుకుబడిని పెంచుకున్నారు. దానితో పాటు ఆయనను గెలిపించాలన్న సానుభూతి అయితే ప్రజలలో ఉంది అని అంటున్నారు. అయితే టీడీపీ పెద్దాపురంలో బలంగా ఉంది. దానికి తోడు 2019లో పాతిక వేల దాకా ఓట్లు తెచ్చుకున్న జనసేన తోడుగా ఉంది. అదే టైం లో 2014లో 2019లో కేవలం 11 వేలు, 10 వేల ఓట్ల తేడాతోనే చినరాజప్ప గెలిచారు.

ఈసారి ఆయనను ఓడిస్తామని వైసీపీ చెబుతోంది. పెద్దాపురంలో ముద్రగడ పద్మనాభానికి పలుకుబడి ఉంది. దానికి తోడు టీడీపీలో టికెట్ ఆశించిన బొడ్డు వెంకట రమణ కాకినాడకు చెందిన కాంట్రాక్టర్ గుణ్ణం చంద్రమౌళి ఎంతమేరకు సహకరిస్తారు అన్న డౌట్లు ఉన్నాయి. ఏది ఏమైనా పెద్దాపురంలో ఈసారి పోరు ఆసక్తి కరంగా ఉంటుందని అంటున్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే తానే అని చినరాజప్ప అంటూంటే ఈసారి తాను ఎమ్మెల్యే అవుతాను అని దవులూరి దొరబాబు ధీమాగా ఉన్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News