మహిళా సీఏ మరణంపై మంత్రి నిర్మల చేసిన వ్యాఖ్యలు అంత దారుణమా?

కేరళకు చెందిన సీఏ (చార్టెడ్ అకౌంటెంట్) అన్నా సెబాస్టియన్ ఉద్యోగంలో చేరిన నాలుగు నెలలకే మరణించటం తెలిసిందే.

Update: 2024-09-24 04:19 GMT

మరోసారి సీఏ అన్నా సెబాస్టియన్ మరణం.. పని చేసే చోట తీవ్రమైన ఒత్తిడి అంశం మరోసారి చర్చకు రావటమేకాదు.. ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ వివాదంలో చిక్కుకున్నారు. అన్నా మరణంపై ఆమె చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది. ఆమె మాటల్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పు పడుతోంది. ఇంతకూ నిర్మలమ్మ వాదన ఏంటి? అందులో కాంగ్రెస్ వేలెత్తి చూపుతున్న అంశాలేమిటి? అన్న వివరాల్లోకి వెళితే..

కేరళకు చెందిన సీఏ (చార్టెడ్ అకౌంటెంట్) అన్నా సెబాస్టియన్ ఉద్యోగంలో చేరిన నాలుగు నెలలకే మరణించటం తెలిసిందే. ఆమె మరణానికి కారణం ఆమె పని చేసే ప్రదేశంలో తీవ్రమైన ఒత్తిడే కారణంగా ఆమె తల్లి ఆరోపించారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆమె తల్లి.. తన కుమార్తె పని చేసిన కంపెనీ ఛైర్మన్ కు లేఖ రాయటం.. పని ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉందన్న విషయాన్ని చెప్పారు. ఈ వ్యవహారం కార్పొరేట్ ప్రపంచంలోని పని ఒత్తిడి మీద కొత్త చర్చకు కారణమైందని చెప్పాలి.

అన్నా సెబాస్టియన్ మరణంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. పని భారం.. ఒత్తిడి కారణంగా ఆమె మరణించారన్న తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని.. నాలుగు వారాల్లో సమగ్ర దర్యాప్తు నివేదిక తమకు సమర్పించాలని కోరుతూ కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖను ఆదేశించింది. దీనిపై కేంద్ర కార్మిక ఉపాధి శాఖ విచారణ చేపట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా చెన్నై మెడికల్ కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.

అన్నా సెబాస్టియన్ మరణంపై స్పందించిన ఆమె.. ఒత్తిడిని ఎలా ఎదుర్కొనాలో ఇంటి నుంచే పిల్లలకు నేర్పాలన్నారు నిర్మలమ్మ. అంతేకాదు.. దేవునిపై ఆధారపడటం ద్వారా మాత్రమే ఒత్తిడిని ఎదుర్కోవచ్చన్నారు. ‘‘ఒత్తిళ్లను ఎదుర్కోవటానికి అంతర్గత శక్తి ఉండాలి. భగవంతుడ్ని నమ్మండి. మనకు భగవంతుడి అనుగ్రహం ఉండాలి. దేవుడ్ని వెతకండి. మంచి క్రమశిక్షణ నేర్చుకోండి. మీ ఆత్మ శక్తి నుంచి మాత్రమే పెరుగుతుంది. పెరుగుతున్న ఆత్మశక్తితోనే అంతర్గత బలం వస్తుంది. విద్యా సంస్థలు దైవత్వం.. ఆధ్యాత్మికతను తీసుకురావాలి. అప్పుడే మన పిల్లలకు అంతర్గత బలం వస్తుంది. అది వారి ప్రగతికి.. దేశాభివ్రద్ధికి దోహపడుతుందని నా బలమైన నమ్మకం’’గా పేర్కొన్నారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు అంబానీ.. అదానీ దిగ్గజాల బాధ తప్పించి.. సామాన్యుల బాధ కనిపించదంటూ విరుచుకుపడ్డారు. ఎన్నో ఆశలతో వచ్చే అన్నా లాంటి యువత.. కార్పొరేట్ కంపెనీల దోపిడీకి బలైపోతున్నట్లుగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్.. ప్రియాంక చతుర్వేదిలు మండిపడ్డారు. విషపూరితమైన వర్కు కల్చర్.. సుదీర్ఘ పని గంటలు అన్నా జీవితాన్ని నాశనం చేశాయన్నారు. ‘బాధితురాలిని అవమానించటం ఆపండి. కనీసం కాస్త సున్నితంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీరు కోరుకుంటే దేవుడు మార్గ నిర్దేశం చేస్తారు’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News