బద్ధకానికి ఖరీదు.. మోడీ ఖాతాలోకి వెయ్యి కోట్లు!
ఈ పాన్-ఆధార్ కార్డుల లింక్ విషయంలోనూ అచ్చం వారు అలానే చేశారు. ఫలితంగా కేంద్ర ఖజానాకు కోట్ల రూపాయల కనక వర్షం కురిసింది.
వినడానికి, అనడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజమే. మనలో ఉన్న కొద్దిపాటి బద్ధకం..మరికొంత నిర్లక్ష్యం.. కలగ లిపి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ఖజానాకు రూ.1000 కోట్లపైచిలుకు పంట పండించింది. ఇది వాస్తవం. మరి ఈ కథేంటో తెలుసా? తెలిస్తే.. ఆశ్చర్య పోవడం ఖాయం.
విషయంలోకి వెళ్తే.. దాదాపు దేశంలో బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికీ పాన్ కార్డు ఉంది. ఇక, భారతీయ పౌరులుగా ఉన్న ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆదాయపన్ను చట్టం ప్రకారం..ఈ రెండు కార్డులను లింకు చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం, ఆదాయ పన్ను శాఖ వర్గాలు కూడా ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నాయి. అంతేకాదు.. అనేక సందర్భాల్లో గడువును కూడా పొడిగించాయి. అయితే.. భారతీయులు బద్ధకస్తులు అంటూ.. గతంలో నెహ్రూ చెప్పారని తాజాగా ప్రధాని మోడీ పార్లమెంటులోనే వ్యాఖ్యానించారు.
ఈ పాన్-ఆధార్ కార్డుల లింక్ విషయంలోనూ అచ్చం వారు అలానే చేశారు. ఫలితంగా కేంద్ర ఖజానాకు కోట్ల రూపాయల కనక వర్షం కురిసింది. నిర్ణీత గడువులోగా పాన్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోని వారికి కేంద్రం రూ.1,000 చొప్పున అపరాధ రుసుం వసూలు చేసింది. ఇలా.. గతేడాది జులై 1 నుంచి, 2024 జనవరి 31 వరకు కేంద్రానికి సమకూరిన సొమ్ములు 602 కోట్లుగా ఉంది. ఇదేదో గాలి కబురు కాదు. సాక్షాత్తూ.. కేంద్ర ఆర్థిక శాఖ లిఖిత పూర్వకంగా పార్లమెంటులో చెప్పిన మాట. అంటే.. మన బద్ధకం అనండి.. నిర్లక్ష్యం అనండి మొత్తానికి కేంద్రానికి ఉచితంగా అందించిన సొమ్ము 602 కోట్లు. ఇది కేవలం ఆ కొన్ని మాసాలకే పరిమితం. ఇక్కడ ఒంకో ట్విస్టుకూడా.. ఉంది. అదేంటంటే.. ఇప్పటికీ దేశవ్యాప్తంగా 11 కోట్ల 48 లక్షల మంది పాన్-ఆధార్ కార్డులను లింకు చేసుకోవాల్సి ఉంది. వీరి ద్వారా.. మరిన్ని వందల కోట్లు ఖజానాకు రానున్నాయి. మొత్తంగా వెయ్యి కోట్ల పైచిలుకు తమకు చేరుతుందని కేంద్రం అంచనా వేసింది.
ఎందుకిలా?
మనీలాండరింగ్ సహా.. పన్ను ఎగవేతలు, ఆదాయ వనరులు, కంపెనీల చట్టాలను పక్కాగా అమలు చేయాలన్న ఉద్దేశంతో 2017-18లో తీసుకువచ్చిన కొత్త నిబంధన ప్రకారం ఆధార్‌తో పాన్‌ను అనుసంధించాలని నిర్ణయించారు. తద్వారా.. దేశవ్యాప్తంగా ఎవరు ఏలావాదేవీ చేసినా.. లెక్క, పత్రం వంటి ఉంటాయని కేంద్రం లెక్క! అందుకే యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాన్ ఉన్న ప్రతి వ్యక్తీ.. ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం దానికి ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయాల్సిందే.