పారిస్ సదస్సులో హాట్ ఇష్యూ... ఏఐ పై అమెరికా అలా ఈయూ ఇలా!

పారిస్‌ లో మంగళవారం జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్‌ సమ్మిట్‌ లో ఎవరి వాదన వారు వినిపించారు.

Update: 2025-02-12 11:30 GMT

ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో మంగళవారం జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ లో అమెరికా, ఐరోపా కూటమి (ఈయూ), చైనా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా... ఏఐ పై ఎవరి వాదనలు వారు వినిపించారు. ఫైనల్ గా 60 దేశాలు సంతకం చేసిన సంయుక్త ప్రకటనకు అగ్రరాజ్యం అమెరికా దూరంగా ఉండటం గమనార్హం.

అవును... పారిస్‌ లో మంగళవారం జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్‌ సమ్మిట్‌ లో ఎవరి వాదన వారు వినిపించారు. ఇందులో భాగంగా... ఆవిష్కరణల్లో ఛాంపియన్‌ గా నిలిచేందుకు అమెరికా ప్రయత్నించగా.. భద్రత, జవాబుదారీతనానికి హామీ ఇచ్చేలా నియంత్రణలు విధించాలని ఐరోపా కూటమి అంటోంది.

మరోపక్క.. ప్రభుత్వ సంస్థల సహాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వేగంగా విస్తరించి, ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలని చైనా భావిస్తోంది. ఫైనల్ గా... డిజిటల్‌ అంతరాలను తగ్గించేలా ఏఐ అందుబాటును ప్రోత్సహించాలని.. నైతికత, పారదర్శకత, భద్రత, రక్షణాత్మక, వ్యవస్థగా అందరికీ ఏఐ అందుబాటులో ఉండాలని సంయుక్త ప్రకటన పేర్కొంది.

ఈ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందిస్తూ... పొంచి ఉన్న ప్రమాదాల పేరు చెప్పి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ పై అధిక నియంత్రణలు విధించడం సరికాదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో... ఆర్థిక వ్యవస్థకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టర్నింగ్ పాయింట్ లాంటిదని.. దీనివల్ల కొత్త పారిశ్రామిక విప్లవం చూడబోతున్నామని తెలిపారు.

ఇదే సమయంలో... సైద్దాంతిక పక్షపాతానికి తావులేకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల అభివృద్ధికి అమెరికా హామీ ఇస్తుందని.. అదేవిధంగా.. అమెరికా ప్రజల వాక్ స్వాతంత్రయాన్ని ఎన్నడూ నియంత్రించబోమని వాన్స్ స్పష్టం చేశారు.

ఇదే సమయంలో స్పందించిన ఈయూ చీఫ్ ఉర్సులా వాండర్... ప్రజల్లో విశ్వాసం నింపేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా... భద్రతాపరంగానూ హామీ ఉండాలని సూచించారు. సులభంగా అభివృద్ధికి అవకాశమివ్వాలని పేర్కొన్నారు. ప్రధానంగా.. ఇన్వెస్ట్‌ ఏఐకి 200 బిలియన్‌ యూరోలు సమకూరిన విషయాన్ని గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో స్పందించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో అమెరికా, చైనాలపై ఆధారపడే ధోరణిని మార్చుకోవాలని ఐరోపా కూటమికి సూచించారు. ఇదే సమయంలో... చైనా తరుపున అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రతినిధిగా ఆ దేశ ఉప ప్రధాని జాంగ్ గ్వాకింగ్ పాల్గొన్నారు. ఏఐలో వేగంగా విస్తరిస్తామని తెలిపారు.

Tags:    

Similar News