ఎవ‌రూ త‌గ్గ‌ట్లేదు.. ఈసీ కొర‌డా ఝ‌ళిపిస్తే.. మొత్తానికి షాక్‌!

ల‌క‌ల‌క‌ల‌క‌-ప‌శుప‌తి-గంగ‌-అమ్మోరు.. వంటి వ్యాఖ్య‌ల‌తో త‌మ నేత‌ను అవ‌మాన ప‌రిచార‌ని పేర్కొన్నారు.

Update: 2024-04-12 23:30 GMT

ఔను.. ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. అంద‌రూ అందరే.. ఎవ‌రూ త‌గ్గ‌ట్లేదు. ఒక‌రిని మించి మ‌రొక‌రు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. నువ్వు ఒక‌టంటే.. నే నాలుగంటా! అన్న‌ట్టుగా నాయ‌కులు రెచ్చిపోతున్నారు. దీంతో నేత‌ల తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించార‌ని ఆ పార్టీ నేత‌లు ఎన్నిక‌ల సంఘానికి పిర్యాదు చేశారు. ల‌క‌ల‌క‌ల‌క‌-ప‌శుప‌తి-గంగ‌-అమ్మోరు.. వంటి వ్యాఖ్య‌ల‌తో త‌మ నేత‌ను అవ‌మాన ప‌రిచార‌ని పేర్కొన్నారు.

పోనీ.. టీడీపీ ఏమైనా గౌర‌వ‌ప్ర‌దంగా ముందుకు సాగుతోందా? అంటే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నుంచి మ‌రికొంద‌రు ఫైర్ బ్రాండ్స్ వ‌ర‌కు.. సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సైకో.. ఉన్మాది.. దుర్మార్గుడు.. పాము, పురుగు, చీడ.. అంటూ.. వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై వైసీపీ నాయ‌కులు తాజాగా మ‌రోసారి కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా.. వైసీపీపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇవి కూడా.. వ్య‌క్తిగత విమ‌ర్శ‌లే కావ‌డంతో ఆయ‌న‌పై వైసీపీ నేత‌లు మ‌రోసారి తాజాగా ఫిర్యాదులు స‌మ‌ర్పించారు.

ఇక‌, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల‌.. త‌న సోద‌రుడే అయినా.. సీఎం జ‌గ‌న్‌పై విరుచుకుప‌డుతున్నారు. వ్య‌క్తి గ‌త విమ‌ర్శ‌ల‌తో వేడెక్కిస్తున్నారు. దుర్మార్గుడు, హ‌త్య చేయించాడు.. హ‌త్య‌ల‌ను ప్రోత్స‌హిస్తు న్నాడు.. అంటూ ఆమె దుమ్ముదులిపేస్తున్నారు. అయితే.. ఈమెపై ఇంకా ఎవ‌రూ ఫిర్యాదు చేయ‌లేదు. మ‌రోవైపు.. సోష‌ల్ మీడియాలోనూ టీడీపీ-వైసీపీ నాయ‌కులు ఇలాంటి ప్ర‌చార‌మే చేసుకుంటున్నారు. క‌ట్ చేస్తే.. ఇప్ప‌టికే ఒక‌సారి కేంద్ర ఎన్నిక‌ల సంఘం టీడీపీ, వైసీపీల‌ను హెచ్చ‌రించింది. రెండోసారి కూడా ఫిర్యాదులు అందాయి.

రెండో సారి ఫిర్యాదుల వ‌ర‌కు స‌రిపుచ్చినా.. మూడోసారి కూడా.. ఇలాంటి ఫిర్యాదులు అంది.. అవి నిజ‌మే న‌ని తేలితే.. మాత్రం నిబంధ‌నల‌మేర‌కు కొర‌డా ఝ‌ళిపించే అవ‌కాశం ఉంటుంది. గ‌తంలో యూపీ సీఎం యోగి కూడా ఇలానే వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఆయ‌న‌ను మూడు రోజుల పాటు ఎన్నిక‌ల ప్ర‌చారానికి పాల్గొన‌కుండా.. ఎన్నిక‌ల సంఘం వేటు వేసింది. ఇప్పుడు ఏపీలోనూ ఇలాంటి ప‌రిస్థితి త‌లెత్తే అవ‌కాశం ఉంటుంద‌నే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Tags:    

Similar News