నాగబాబుకు కీలక పదవి... ముహూర్తంపై పవన్ కామెంట్స్ వైరల్!

అవును... మెగా బ్రదర్ కొణిదెల నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-30 10:33 GMT

ఎన్నికల సమయంలో నరసాపురం ఎంపీ అభ్యర్థి అని.. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి అని రకరకాల ప్రచారాలు జరిగినా.. ఆఖరికి కొణిదెల నాగబాబుకు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు! అనంతరం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ సభ్యుడిగా నాగబాబును పంపుతున్నట్లు కథనాలొచ్చాయి. అదీ జరగలేదు! ఈ నేపథ్యంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... మెగా బ్రదర్ కొణిదెల నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తదైన శైలిలో కామెంట్లు చేసిన పవన్ కల్యాణ్.. తాను కులం చూసి పదవులు ఇవ్వడం లేదని చెప్పారు. తనతో కలిసి పార్టీకి పని చేసినవారిని.. తన కోసం, తనతో పని చేసిన వాళ్లను గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఇందులో భాగంగా.. గతంలోనే నాగబాబుకు రాజ్యసభ ఇవ్వాలని భావించామని.. అయితే, కొన్ని ప్రాధాన్యతలు, రాజకీయ కారణాలతో రాజ్యసభ పదవిని త్యాగం చేయాల్సి వచ్చిందని పవన్ వివరించారు. ఈ నేపథ్యంలో... పవన్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాతే మంత్రి వర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు పవన్ చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో.. నాగబాబుకు పదవి ఇవ్వడం వారసత్వ రాజకీయాలు అని అనుకోవడం తప్పు అని చెప్పుకొచ్చిన పవన్ కల్యాణ్... పార్టీ కోసం నాగబాబు ఎంతో కాలంగా కష్టపడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే.. నాగబాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన తర్వాతే మంత్రిని చేసే విషయం ఆలోచిస్తామని పవన్ తేల్చి చెప్పారు.

పవన్ తాజా వ్యాఖ్యలతో... నాగబాబును కూటమి ప్రభుత్వంలోని కేబినెట్ లోకి తీసుకునే విషయంలో కాస్త సమయం పట్టే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేసినా.. వీటి ఆమోదంపై మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మరోపక్క వచ్చే ఏడాది మార్చికి మరో నలుగురు సభ్యుల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజీనామా చేసిన వారి స్థానంలో కాకుండా కొత్తగానే నాగబాబును ఎమ్మెల్సీ చేయాలనేది కూటమి నేతల ఆలోచనగా చెబుతున్నారు. దీంతో... వచ్చే ఏడాది మార్చి తర్వాత నాగబాబును కేబినేట్ లోకి తీసుకునే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News