సజ్జలపై పవన్ దండయాత్ర అటవీ భూముల కబ్జాపై డిప్యూటీ సీఎం కన్నెర్ర
సంక్రాంతి తర్వాత ఉమ్మడి కడప జిల్లా పర్యటనకు వెళ్లనున్న పవన్ సీకే దిన్నె మండలంలోని సజ్జల కుటుంబ సభ్యుల ఆక్రమణల్లో ఉన్న భూములను పరిశీలిస్తారని అంటున్నారు.
వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ నెంబర్ టు సజ్జల రామక్రిష్ణారెడ్డిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దండయాత్ర ప్రకటించనున్నారు. సంక్రాంతి తర్వాత ఉమ్మడి కడప జిల్లా పర్యటనకు వెళ్లనున్న పవన్ సీకే దిన్నె మండలంలోని సజ్జల కుటుంబ సభ్యుల ఆక్రమణల్లో ఉన్న భూములను పరిశీలిస్తారని అంటున్నారు. ఇప్పటికే తన పర్యటనపై అధికారులకు మౌఖికంగా సమాచారం ఇచ్చారంటున్నారు. పండగ తర్వాత డిప్యూటీ సీఎం పర్యటన ఖరారు కానుందని చెబుతున్నారు.
వైసీపీ నేతల అక్రమాలు, ఆక్రమణలపై తొలి నుంచి మడమతిప్పని పోరాటం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన స్పీడ్ మరింత పెంచనున్నారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన సరస్వతీ సిమెంట్ భూముల్లో ఆక్రమణలపై నోటీసులు జారీ చేయించిన పవన్ ఇప్పుడు వైసీపీ నెంబర్ టు లీడర్ సజ్జలను టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. కడప జిల్లాలోని సీకే దిన్నె మండలంలో 42 ఎకరాల అటవీ భూములను సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నట్లు ఫిర్యాదులు రావడంతో పవన్ నేరుగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
సీకే దిన్నె మండలంలో సర్వే నెంబర్ 1629లో 11 వేల ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. వీటి పక్కనే సజ్జల కుటుంబ సభ్యులకు 184 ఎకరాల ఎస్టేట్ ఉంది. ఈ ఎస్టేట్ చుట్టూ కంచె వేసిన సజ్జల ఫ్యామిలీ 42 ఎకరాలను ఆక్రమించుకున్నారని స్థానికులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై సర్వే చేసి నివేదిక సమర్పించాల్సిందిగా రెవెన్యూ, అటవీ అధికారులను కలెక్టర్ సూచింస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సజ్జల ఎస్టేట్లో సంయుక్తంగా సర్వే చేసిన అధికారులు ఆ భూములు రెవెన్యూ శాఖవని అటవీ అధికారులు, కాదు అటవీ భూములే అని రెవెన్యూ అధికారులు వాదులాడుకుంటున్నారు. ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించినా అవి ఏ శాఖవని తేల్చకుండా కాలం గడిపేస్తున్నారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న డిప్యూటీ సీఎం తానే నేరుగా రంగంలోకి దిగనున్నారు.
సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్లనున్న పవన్ శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించాలని ముందుగా భావించారు. అయితే ప్రత్యర్థి పార్టీకి చెందిన కీలక నేత ఆక్రమణలపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండటం, సజ్జలను కాపాడే ప్రయత్నం జరుగుతుండటంతో ఉప ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూలును మార్చే అవకాశం ఉందంటున్నారు. కడప నుంచే క్షేత్రస్థాయి పర్యటలకు శ్రీకారం చుట్టి ముందుగా సజ్జలపై వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఇప్పటికే పట్టిన పట్టువీడని నేతగా పవన్ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అక్రమాలు వెలుగుచూసిన వెంటనే వాటిపై ఫోకస్ చేసి యాక్షన్ తీసుకునేలా చూస్తున్నారు. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగును అడ్డుకోడానికి పవన్ చాలా పోరాడారు. అదేవిధంగా సోషల్ మీడియాలో వికృత ప్రచారంపై ఉక్కుపాదం మోపారు. అదేవిధంగా తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఆయన ఏ సమస్యను టేకప్ చేసినా పరిష్కారమయ్యేంత వరకు పట్టువీడటం లేదు. దీంతో సజ్జల ఆక్రమణలపై పవన్ తీసుకోబోయే యాక్షన్ ఉత్కంఠకు గురిచేస్తోంది. ప్రతిపక్ష పార్టీలోని కీలక నేతతో నేరుగా తలపడేందుకు పవన్ బరిలోకి దిగుతుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.