పవన్ కి బాబు... బాబుకు మోడీ !

మోడీ నాయకత్వంలో గుజరాత్ లో బీజేపీ ఆరు సార్లు అధికారంలోకి వచ్చిందని అలాగే హర్యానాలో మూడు సార్లు వరసగా గెలిచిందని అదంతా మోడీ హార్డ్ వర్క్ తోనే సాధ్యపడిందని పార్టీ నేతలకు గుర్తు చేశారు.

Update: 2024-10-19 03:15 GMT

అవును ఎవరు ఎవరిని చూసి స్పూర్తి పొందుతారో తెలియదు. ఎవరి నుంచి అయినా స్ఫూర్తి పొందవచ్చు. ఆ విధంగా చూస్తే కనుక ఇటీవలే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రిష్ణా జిల్లాలో జరిగిన పల్లె పండుగ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ తనకు ఏపీ సీఎం చంద్రబాబు స్పూర్తి అని అన్నారు.

బాబు ఎంతో కష్టపడి పనిచేస్తారు అని అన్నారు. ఆయన అధికారులకు చేసే దిశా నిర్దేశం కానీ ఏ అంశం మీద అయినా ఆయనకు ఉన్న పట్టు కానీ గొప్పవి అన్నారు. బాబు కష్టించి పనిచేసే విధానం కూడా గ్రేట్ అన్నారు. అలా తనకు చంద్రబాబు స్పూర్తి అని పవన్ స్పష్టం చేశారు. అంతే కాదు బాబు అనుభవం కూడా ఏపీకి చాలా ముఖ్యమని తాను భావించే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాను అని అది ఇపుడు నిజం అవుతోందని కూడా పవన్ అన్నారు. అలా బాబుని పవన్ తెగ పొగిడారు.

ఇక హర్యానా వెళ్ళి వచ్చిన తరువాత బాబుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీలో గొప్ప నాయకుడు మరింత స్పష్టంగా కనిపించారు. మోడీ కష్టించి పనిచేసే తత్వం బాబుని ఆకట్టుకుంది. అదే విషయాన్ని ఆయన టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో చెప్పుకొచ్చారు.

మోడీని చూసి ఎంతో నేర్చుకోవచ్చు అని అన్నారు. మరీ ముఖ్యంగా ఆయన హార్డ్ వర్క్ గ్రేట్ అని బాబు పొగిడేశారు. మోడీ వరసగా మూడు సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణం చేయడం పార్టీని నెగ్గించడం వంటివి బాబులో స్పూర్తిని నింపాయని అంటున్నారు. అంతే కాదు గెలిచి నాలుగు నెలలు కాలేదు అపుడే మరో ఎన్నికల కోసం మోడీ వ్యూహరచన చేస్తున్నారు అంటూ అది ఇంకా గొప్పదని బాబు చెబుతున్నారు.

మోడీ ఎంతో కష్టపడతారు అని ఆయన పార్టీ నేతలకు చెబుతూ ఏకంగా హర్యానాలో జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో మోడీ అయిదు గంటల పాటు కూర్చుని మొత్తం మీటింగ్ నిర్వహించడం నిజంగా గొప్పదని అన్నారు

మోడీ వరస విజయాల వెనక ఆయన కష్టించే మనస్తత్వం క్రమశిక్షణ అన్నవి రెండూ ఆయుధాలుగా ఉన్నాయని బాబు అంటున్నారు. పార్టీలో ఎవరూ ఏ తప్పూ చేయకుండా మోడీ చూస్తారని నిరంతరం ఆయన ఆలోచనలు అన్నీ ప్రజల కోసమే సాగుతాయని కూడా అన్నారు.

మోడీ నాయకత్వంలో గుజరాత్ లో బీజేపీ ఆరు సార్లు అధికారంలోకి వచ్చిందని అలాగే హర్యానాలో మూడు సార్లు వరసగా గెలిచిందని అదంతా మోడీ హార్డ్ వర్క్ తోనే సాధ్యపడిందని పార్టీ నేతలకు గుర్తు చేశారు. మొత్తం మీద చూస్తే మోడీ విజయాలు ఆయన హార్డ్ వర్క్ ఆయన క్రమశిక్షణ ఇవన్నీ చూసి నేర్చుకోవాల్సినవే అని బాబు అంటున్నారు. అలా మోడీ బాబుని ఆకట్టుకున్నారు అని కూడా విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News