తిరుమల కొండ ఎక్కేందుకు పవన్ కు ఎంత టైం పట్టింది?
ఇంతకూ పవన్ కల్యాణ్ కు తిరుమల కొండ ఎక్కేందుకు ఎంత టైం పట్టింది? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
పవర్ స్టార్ గా సుపరిచితులు.. జనసేనానికి జనాలకు మరింత దగ్గర కావటమే కాదు.. రాజకీయాల్లో మార్పు కోసం.. కొత్త తరహా రాజకీయాల కోసం ప్రయత్నించిన పవన్ కల్యాణ్ ఆరంభంలో ఎలాంటి ఎదురు దెబ్బలు తిన్న ఆయన.. ఓర్పుతో.. సహనంతో తాను అనుకున్నది సాధించటం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వందశాతం స్ట్రైకింగ్ రేటుతో దూసుకెళ్లిన పవన్.. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా తిరుమల కొండకు నడిచి వెళ్లటం తెలిసిందే. ఇంతకూ పవన్ కల్యాణ్ కు తిరుమల కొండ ఎక్కేందుకు ఎంత టైం పట్టింది? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ అంశం నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదకొండు రోజుల పాటు దీక్ష చేపట్టటం తెలిసిందే. తన దీక్షను ఉపసంహరించుకోవటానికి ఆయన తిరుమలకు వెళ్లటం తెలిసిందే. అయితే.. తిరుపతి అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్లాలన్న నిర్ణయాన్ని తీసుకోవటంతో.. ఆయన నడక వేళ అలిపిరి నుంచి తిరుమల వరకు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి రేణిగుంట విమానాశ్రాయినికి మధ్యాహ్నం మూడున్నర గంటలకు చేరుకున్న పవన్.. అలిపిరి పాదాల మండపం వద్దకు సాయంత్రం 4.50 గంటలకు చేరుకున్నారు.
నిజానికి పవన్ ను మెట్ల మార్గంలో కాకుండా రోడ్డు మార్గంలో వెళ్లాలని అధికారులు సూచన చేశారు. అయితే.. అప్పటికే మెట్ల మార్గంలోనే తిరుమలకు నడిచి వస్తానని ప్రకటించిన నేపథ్యంలో అధికారుల మాటను సున్నితంగా నో చెప్పిన పవన్.. మెట్లు ఎక్కివెళ్లేందుకే డిసైడ్ అయ్యారు. రెండు మోకీళ్లకు నీ క్యాప్ పెట్టుకున్న పవన్ నడక ప్రారంభించారు. ఆరంభంలో వేగంగా నడుచుకుంటూ వెళ్లారు పవన్ కల్యాణ్. మెట్లు ఎక్కే క్రమంలో మాత్రం పవన్ లో అలసట కనిపించింది. మధ్యమధ్యలో ఎక్కువ విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది.
మోకాళ్ల పర్వతం వరకు వేగంగానే వచ్చిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత మాత్రం ఆయన నడకలో వేగం తగ్గింది. కాళ్ల నొప్పి తీవ్రం కావటంతో ఫిజియోథెరపీ తీసుకోవాల్సి వచ్చింది. ఒకదశలో మోకాళ్ల పర్వతం ఎక్కకుండా రోడ్డు మార్గంలో వెళ్లే ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయినప్పటికీ.. తాను నడుస్తానని తేల్చిన పవన్.. కష్టంగా అయినా మెట్లు ఎక్కేందుకు ఆసక్తి చూపించారు.
ఏడో మైలు నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లిన పవన్ తిరుమలకు చేరుకునే సరికి రాత్రి 9.20 గంటలైంది. నడక పూర్తి అయిన చోటే వాహనాలు సిద్ధంగా ఉంచినప్పటికీ.. ఆర్టీసీ బస్టాండ్ వరకు నడిచారు. ఆయన కోసం అభిమానులు అప్పటికే పెద్ద ఎత్తున వేచి చూస్తున్నారు. వారికి అభివాదం తెలిపిన పవన్ అక్కడి నుంచి వాహనంలో గాయత్రి సదన్ కు చేరుకున్నారు. మొత్తంగా చూస్తే.. సాయంత్రం 4.50 గంటలకు నడక ప్రారంభించిన పవన్ తిరుమలకు చేరుకునే సరికి 9.20 గంటలైంది. అంటే.. మొత్తంగా తిరుమల కొండ ఎక్కేందుకు పవన్ కల్యాణ్ కు నాలుగున్నర గంటల సమయం పట్టింది.