పవన్ దూకుడుతో కూటమికి ప్లస్సేనా ?
జనసేన అధినేత హోదాలో పవన్ ఎన్ని అయినా మాట్లాడవచ్చు. ఎంతైనా విమర్శలు చేయవచ్చు.
జనసేన అధినేత హోదాలో పవన్ ఎన్ని అయినా మాట్లాడవచ్చు. ఎంతైనా విమర్శలు చేయవచ్చు. ఆయన విపక్షంలో అనాడు ఉన్నారు కాబట్టి జనాల కోసం ఆవేశపూరితంగా ఎంత మాట్లాడినా చెల్లిపోతుంది. కానీ ఇపుడు ఆరు నెలలుగా పవన్ ప్రభుత్వంలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఉన్నారు.
కూటమి ప్రభుత్వంలో మంత్రి అంటే అది సమిష్టిగా తీసుకున్న నిర్ణయంగానే చూడాలి. ప్రభుత్వం అంటే అందరూ కలిస్తేనే అన్నది రాజ్యాంగం చెప్పే మాట. ఫలనా మంత్రిది తప్పు అని ఉండదు, అందరూ దానికి సమిష్టిగా బాధ్యత వహించాలి. ఇక చూస్తే పవన్ తిరుపతి లడ్డూల విషయంలో మొదలెట్టారు. సనాతన ధర్మం అంటూ ఆయన వారాహి డిక్లరేషన్ ప్రకటించారు.
దాని వల్ల కూటమికి కొంత ఇబ్బంది ఎదురైనా సర్దుకున్నారు. ఆ తరువాత లా అండ్ ఆర్డర్ ఏపీలో సరిగ్గా లేదని అంటూ ఇలా సాగితే తానే హోం మంత్రిత్వ శాఖను తీసుకుంటాను అని పవన్ పిఠాపురం సభలో చెప్పుకొచ్చారు. ఏపీలో అది కొన్నళ్ళ పాటు చర్చగా సాగింది. ఒక విధంగా కూటమి ప్రభుత్వం కూడా ఇబ్బందిలో పడింది.
ఇక లేటెస్ట్ గా చూస్తే ఆయన కాకినాడకు వెళ్ళి సముద్రం మధ్యలో ఉన్న షిప్ ని పరిశీలించారు. సీజ్ ద షిప్ అంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. అంతవరకూ బాగానే ఉన్నా మీడియా ముందుకు వచ్చి ఆయన అధికారుల తీరు మీద విమర్శలు చేశారు. అయితే అధికారులు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే. వారిని విమర్శిస్తే అది ప్రభుత్వం మీదకే వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
మొత్తనికి కాకినాడ షిప్ నుంచి అక్రమంగా తరలిపోతున్న బియ్యం విషయంలో కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది. దాని మీద ఇపుడు సిట్ ని ఏర్పాటు చేసి సమగ్రమైన విచారణకు ఆదేశించారు. దీని కంటే ముందు లా అండ్ ఆర్డర్ విషయంలోనూ కూటమి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద కూడా చర్యలు తీసుకున్నారు.
ఇలా పవన్ విమర్శలు చేసిన ప్రతీసారీ కూటమి ప్రభుత్వం స్పందిస్తొంది. తగిన చర్యలు తీసుకుంటోంది. ఇక్కడ పవన్ వ్యక్తం చేస్తున్న విషయాలను ఎవరూ తప్పు పట్టడం లేదు. ప్రభుత్వంలో తప్పులు జరిగితే ఆయన బాహాటంగా వచ్చి మీడియా ముందు జనం ముందు మాట్లాడటం వల్లనే ఇబ్బందులు అని అంటున్నారు.
నాలుగు గోడల మధ్యన కేబినెట్ మీటింగులలో ఈ విషయాలను లేవనెత్తి వాటికి అక్కడే అర్ధవంతమైన పరిష్కారాలను కనుగొంటే మరింత ఎఫెక్టివ్ గా ప్రభుత్వం పనిచేయడానికి వీలు అవుతుంది. అలా కాకుండా బయట అసంతృప్తి వ్యక్తం చేస్తే హోం శాఖ పౌర సరఫరాల శాఖ దేవాదాయ శాఖ ఇలా కీలక మంత్రిత్వ శాఖలలో తప్పులు పొరపాట్లు జరుగుతున్నాయని జనాలు అనుకుంటారు. చివరికి ప్రతిపక్షానికి అదే ఆయుధంగా మారుతుందని అంటున్నారు.
ఇదిలా ఉంటే ప్రభుత్వం ఏర్పడేది పార్టీల నుంచి. పార్టీలకు రాజకీయాలు ఉంటాయి. అందులో తర తమ భేదాలు ఉంటాయి. ఎవరైనా పార్టీ పటిష్టంగా ఉండాలని చూస్తారు. పార్టీ బాగుంటేనే అధికారంలోకి రాగలమని భావిస్తారు. అందువల్ల ప్రభుత్వంలో ఉన్నాక కాస్తా చూసీ చూడనట్లుగా కొన్ని జరుగుతూ ఉంటాయి. అన్నీ నిక్కచ్చిగా జరగవు. అలాంటి ఆస్కారం కూడా ఉండదు.
తీగ మీద నడచినట్లుగా కచ్చితంగా నడవాలీ అంటే కుదిరే వ్యవహారం కాదు. అందువల్ల రాజకీయాల్లో ఉన్నపుడు కాస్తా అన్నీ చూసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ రోజున అవినీతి సర్వాంతర్యామి అయిపోయింది. ముందు ఓటరు నుంచే అది మొదలవుతోంది. మరి ఓటరుని ఎవరూ ఏమీ అనలేరుగా. అలాగే అక్రమ బియ్యం విషయానికి వస్తే తన కోటా బియ్యాన్ని అమ్ముకున్న లబ్దిదారే మొదటి ముద్దాయి అవుతారు.
ఇలా చూస్తే కనుక వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. వాటి మీద మరీ పట్టింపుగా ఉంటే ప్రభుత్వం కానీ పార్టీ కానీ ముందుకు పోలేదనే అంటారు. అయితే చంద్రబాబు విశేషమైన అనుభవం ఉన్న వారు కాబట్టి పవన్ లేవనెత్తిన ప్రతీ అంశం మీద లాజికల్ ఎండ్ కి తీసుకుని వచ్చి ఆయనతో పాటు అందరికీ సంతృప్తి పరచేలా డెసిషన్స్ తీసుకుంటున్నారు.
కానీ ఒక్కోసారి అది సాధ్యపడనపుడే ఇబ్బందులు వస్తాయి. మరి ఆరు నెలల కూటమి పాలనలో ప్రస్తుతానికైతే ఏ ఇబ్బందీ లేదు. కానీ రానున్న రోజులలో పవన్ ఇదే రకమైన దూకుడు చేస్తే మాత్రం కూటమిలో ఏమైనా జరగవచ్చు అన్నది రాజకీయ విశ్లేషకుల మాటగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఈ ప్రచారాలలో నిజమెంత ఉందో.