మంచి చాన్స్ మిస్ చేసుకున్న పవన్ ?
నీటితో కలసి ఉండడం చేపకు ఎంత అవసరమో రాజకీయ నేతలకు జనంలో మమేకం కావడం అంత అవసరం.
నీటితో కలసి ఉండడం చేపకు ఎంత అవసరమో రాజకీయ నేతలకు జనంలో మమేకం కావడం అంత అవసరం. జనాలకు ఎంత మేలు చేసినా వారి దగ్గరకు వెళ్లని నాయకులకు ఏ విధనమైన చేదు ఫలితాలు వస్తాయో వైసీపీ అయిదేళ్ల పాలన తేటతెల్లం చేసింది. ముఖ్యమంత్రి జగన్ నాడు ఎంతటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా సీఎం ఆఫీసు నుంచే రివ్యూ చేసేవారు బాధితులకు అన్నీ అందేలా చూసుకున్నామని భావించారు తప్ప ఆపన్న హస్తం ధైర్యం చెప్పే మాటలు బాధితులతో నేరుగా వెళ్ళి మాట్లాడి వారికి స్వాంతన ఇవ్వడం వంటివి చేయలేకపోయారు.
ఇపుడు వైసీపీ ఓడాక జగన్ మోకాళ్ళ లోతు నీళ్లలో నిలబడి మరీ బాధితులను పరామర్శించారు. ఇదే పని ఆయన సీఎం గా చేసి ఉంటే ఎలా ఉండేదో కదా అని అంతా చర్చించుకోవడం జరిగింది. ఆనాడు జగన్ చెప్పినది ఏంటి అంటే సహాయ చర్యలకు విఘాతం కలుగకూడదనే తాను వెళ్లడం లేదు అని. సేం డైలాగ్ ఇపుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ కూడా చెబుతున్నారు.
తాను వెళ్తే సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు చెప్పడంతో తన క్షేత్రస్థాయి పర్యటన మానుకున్నాను అని. నిజంగా అది కొంత వాస్తవం అయినా కూడా ఇపుడు కాకపోతే మరెప్పుడు పవన్ జనాల దగ్గరకు వెళ్తారు అన్న ప్రశ్న వెను వెంటనే ఉత్పన్నం అవుతోంది.
బాధల్లో ఉన్నారు జనాలు. వారికి కావాల్సింది బాసట. ఓదార్చే మాటలు, కళ్ళు తుడిచే చేతులు. ఈ సమయంలో పవన్ జనంలోకి వెళ్తే ఏదో జరుగుతోంది అని అధికారులు చెప్పడమూ తప్పే. పవన్ ఇపుడు సినిమా హీరోగా జనంలోకి రావడం లేదు. ఆయన బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఆయనకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురం జనాలూ జోరు వనాలకు ఇబ్బందులు పడ్డారు.
మరి ప్రజా క్షేత్రంలో ఉన్నపుడు ఎంతటి వారు అయినా జనంలోకి వచ్చారు. వారిని పరామర్శించారు. ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి. 1986లో అంటే నాలుగు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలో భయంకరమైన తుఫాన్లు వచ్చి రోడ్లకు రోడ్లు కొట్టుకుని పోయాయి. ఆనాటి పరిస్థితికి అది చాలా దారుణమైన బీభత్సం. ఎక్కడ చూసినా జనాలు బిక్కుబిక్కుమంటున్నారు. అప్పట్లో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అలా లంక గ్రామాలతో పాటు అనేక ప్రాంతాల ప్రజలు నరకం చూసారు.
ఆ సమయంలో అంటే 1986 ఆగస్టు 16న భద్రాచలం వద్ద తూర్పు గోదావరి జిల్లాలోని గోపాలపురం వద్ద గోదావరికి ఉపనది అయిన వశిష్ట నది 75.6 అడుగుల ఆల్ టైమ్ హై రికార్డును తాకింది. దాంతో కరకట్టకు ముంపు వచ్చింది. అలా 1986 ఆగస్టు 18వ తేదీ రాత్రి కాటన్ గెస్ట్ హౌస్ వద్ద ధవలేశ్వరం ఆనకట్ట తెగిపోయి డజను గ్రామాలను ముంచెత్తింది.
అలాంటి ప్రళయ భీకరమైన పరిస్థితుల్లో నాటి సీఎం నందమూరి తారక రామారావు క్షేత్ర స్థాయిలో పర్యటించి జనాలకు ఓదార్పు ఇచ్చారు. ఆయన కూడా సినీ గ్లామర్ నిండుగా ఉన్నవారే. మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కూడా పర్యటించి వస్తే జనాలకు కొండంత భరోసా దక్కేది అని అంటున్నారు. అంతే కాదు ప్రజా నాయకుడిగా పవన్ కి మరింత పేరు గుర్తింపు వచ్చేది అని అంటున్నారు.
కానీ అధికారులు ఎవరో పవన్ కి తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేశారు అని అంటున్నారు. ఆర్తితో అల్లాడుతున్న ప్రజలకు బాసటగా నిలిస్తే పవన్ కి ఇంకా మంచి పేరు వచ్చేదని ఆయన వెంబడి అధికారులు కూడా ఇంకా చురుకుగా పనిచేసేవారు అని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ క్షేత్ర స్థాయిలో ఎప్పటికైనా రావాల్సిందే. మరి ఆయన మాస్ అంతా వస్తారు అలజడి రేగుతుంది అని ఆలోచిస్తే మాత్రం ఎప్పటికీ బయటకు రాలేరు అని అంటున్నారు.