జగన్‌ తిరుమల టూర్‌.. పవన్‌ కీలక సూచనలు!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలనే కాకుండా దేశంలోనే తిరుమల లడ్డూ వ్యవహారం హాట్‌ టాపిక్‌ గా మారింది.

Update: 2024-09-27 06:05 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలనే కాకుండా దేశంలోనే తిరుమల లడ్డూ వ్యవహారం హాట్‌ టాపిక్‌ గా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు, జంతు నూనెలు వాడారని సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ను నియమించింది. మరోవైపు వైసీపీ నేతలు తమపై వచ్చిన ఆరోపణలను తిప్పికొడుతున్నారు. చంద్రబాబు హయాంలోనే స్వామివారికి అపచారం జరిగిందని మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తిరుమల టూరుకు బయలుదేరుతున్నారు. సెప్టెంబర్‌ 27 రాత్రికి ఆయన తిరుమల చేరుకుని నిద్ర చేస్తారు. 28వ తేదీ శనివారం ఉదయాన స్వామివారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో ఆయన దర్శనానికి ముందు డిక్లరేషన్‌ ఇవ్వాలని కూటమి నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే అన్య మతస్తులు ఎవరైనా తమకు స్వామివారి పట్ల నమ్మకం ఉందని డిక్లరేషన్‌ ఇవ్వాలనే నిబంధన టీటీడీలో ఉందని గుర్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూటమి నేతలకు కీలక సూచనలు చేశారు. జగన్‌ పర్యటన విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కులాలను, మతాలను రెచ్చగొట్టి చలికాచుకోవడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అని గుర్తు చేశారు. గతంలో కాపు రిజర్వేషన్ల సందర్భంగా తుని రైలు దహనం, జిల్లాల ఏర్పాటు సందర్భంగా కోనసీమ అల్లర్లు లేపారని పవన్‌ కళ్యాణ్‌ గుర్తు చేశారు.

తిరుమల దర్శనానికి వెళ్తున్న జగన్‌ నుంచి డిక్లరేషన్‌ తీసుకోవడం అనేది టీటీడీ అధికారుల బాధ్యత అని పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. అధికారులు తమ బాధ్యత గుర్తెరగాలన్నారు. ఈ విషయంపై కూటమి పార్టీలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు.

డిక్లరేషన్‌ ఇస్తారా లేదా.. ఆలయ సంప్రదాయాలు, మర్యాదలు, నిబంధనలు పాటిస్తారా లేదా అనేది వెళ్ళే వ్యక్తి (జగన్‌) విచక్షణకు వదిలేయాలని పవన్‌ సూచించారు. ఈ విషయంలో వైసీపీ గొడవలనే కోరుకుంటుదని చెప్పారు. ఎందుకంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా తుని ఘటన, అధికారంలోకి వచ్చాక కోనసీమ అల్లర్లను సృష్టించిందని పవన్‌ కళ్యాణ్‌ గుర్తు చేశారు. కులాల మధ్య చిచ్చు రేపి ప్రయోజనం పొందాలని చూసిందన్నారు. ఇప్పుడు మతాల మంట రేపాలని చూస్తోందన్నారు.

తిరుమల లడ్డూ తయారీలో జంతు అవశేషాలు కలిపిన నెయ్యి వినియోగించి అపవిత్రం చేసినవారు, అలాంటి నెయ్యి సరఫరాకు అనుమతులు మంజూరు చేసిన టీటీడీ బోర్డు సభ్యులు బాధ్యత వహించాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. నాటి టీటీడీ బోర్డు సభ్యులను నియమించినవారూ బాధ్యులేనన్నారు. హిందువులు పరమ పవిత్రంగా భావించే లడ్డూలో కల్తీపై వారే సమాధానం చెప్పాలని పవన్‌ డిమాండ్‌ చేశారు.

తిరుమల దర్శనానికి వెళ్లాలని నిర్ణయించుకున్న జగన్‌ విషయంలో ఆయన మతాన్ని, ఆయన పర్యటనను లక్ష్యంగా చేసుకొని మాట్లాడాల్సిన సమయం కాదని పవన్‌ చెప్పారు. వ్యక్తులను, అన్య మతాలను లక్ష్యంగా చేసుకోవద్దని కూటమి శ్రేణులకు సూచించారు.

తుని, కోనసీమ ఘటనల్లో ప్రజలు ఎంతో సంయమనంతో వ్యవహరించారని పవన్‌ గుర్తు చేశారు. ప్రస్తుత తరుణంలోనూ వైసీపీ కుటిల పన్నాగాల విషయంలోనూ అంతే అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. వైసీపీ కోరుకుంటున్న గొడవలకు ఆస్కారం ఇవ్వవద్దన్నారు. ఇప్పుడు మతాల మధ్య గొడవలు సృష్టించాలని చూస్తున్న వైసీపీ పట్ల పోలీసులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

కాగా ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఎక్స్‌ వేదికగా చేస్తున్న వ్యాఖ్యలపైనా పవన్‌ స్పందించారు. ఆయన తనకు మంచి మిత్రుడని తెలిపారు. రాజకీయంగా తమ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం ఉందన్నారు. నటుడిగా ఆయనను ఎంతో అభిమానిస్తానని వెల్లడించారు. ఆయనతో కలిసి పనిచేయడం తనకెంతో ఇష్టమన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దోషులకు శిక్షపడాలనే ఉద్దేశంతోనే తాను సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టానని తెలిపారు.

ప్రకాశ్‌ రాజ్‌ పోస్టును తాను తప్పుగా అర్థం చేసుకోలేదన్నారు. ఆయన ఉద్దేశం తనకు అర్థమైందని చెప్పారు. ప్రకాశ్‌ రాజ్‌ తన పోస్టులో ‘ఢిల్లీలో మీ స్నేహితులు’ అంటూ వ్యాఖ్యానించారని పవన్‌ గుర్తు చేశారు. ఆయన అలా కామెంట్‌ చేయాల్సిన అవసరం లేదన్నారు.

Tags:    

Similar News