మోడీని మెచ్చుకోవడం వరకేనా పవనూ ?
అది నిజం కూడా పవన్ అంటే తుఫాను అని ఏకంగా ఎన్డీయే సమావేశంలో ప్రధాని మోడీ ఆకాశానికి ఎత్తేశారు.
బీజేపీకి మోడీకి నిజమైన నేస్తం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని అంతా అంటారు. అది నిజం కూడా పవన్ అంటే తుఫాను అని ఏకంగా ఎన్డీయే సమావేశంలో ప్రధాని మోడీ ఆకాశానికి ఎత్తేశారు. ఆయనను వేదిక మీద కీలక స్థానంలో కూర్చోబెట్టుకున్నారు. మూడవసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రమాణ స్వీకారానికి పిలిచారు.
ఇలా కేంద్ర పెద్దలు పవన్ కి రాచ మర్యాదలే చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రం ఢిల్లీకి వెళ్ళింది లేదు. ప్రధాని మోడీని కానీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కానీ కలిసింది లేదు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అనేక సార్లు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర పెద్దలను కలసి ఏపీ గురించి వివరించారు.
ఆదుకోమని ఆయన కోరుతూ వస్తున్నారు. సరే ముఖ్యమంత్రిగా బాబుకు అది బాధ్యత అనుకున్నా ఆయన తరువాత ప్లేస్ లో ఉన్న పవన్ కూడా తన పలుకుబడి ఉపయోగించి ఏపీని ఆదుకోమని కేంద్ర పెద్దలకు చెప్పవచ్చు కదా అన్న చర్చ అయితే ఉంది.
ఏపీకి లక్షల్లో అప్పులు ఉన్నాయి. పైగా రాజధాని నిర్మాణం కావాలి, పోలవరం పూర్తి కావాలి. విభజన హామీలు కూడా నెరవేరాలి. దానికి తోడు ఇపుడు వచ్చిన వరదలతో వేలాది కోట్ల నష్టం వాటిల్లింది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ కూడా ఉంది.
దాంతో చంద్రబాబుతో పాటు పవన్ కూడా కేంద్రాన్ని డిమాండ్ చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నేతలు కోరుతున్నారు. చంద్రబాబు పవన్ తలచుకుంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోతుందని వారు అంటున్నారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇదే విషయం మీద ప్రధాని మోడీతో మాట్లాడితే చాలు ప్రైవేటీకరణ అన్న ఊసే ఉండదని బలంగా నమ్ముతున్న వారూ ఉన్నారు.
చంద్రబాబు పవన్ ఇద్దరూ స్టీల్ ప్లాంట్ విషయంలో నోరు విప్పాలని వైసీపీ కూడా డిమాండ్ చేస్తోంది. చంద్రబాబు మరి ఈ విషయం మీద కేంద్ర పెద్దలతో ఏమి మాట్లాడుతారో తెలియదు కానీ పవన్ మాత్రం మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు శభాష్ అంటూ ట్వీట్లు వేస్తూ వస్తున్నారు అని అంటున్నారు. పోర్టు బ్లెయిర్ పేరుని విజయరామ పురంగా కేంద్రం మార్చడం పట్ల పవన్ తాజాగా హర్షం వ్యక్తం చేశారు.
దాని కంటే ముందు డెబ్భై ఏళ్ళు దాటిన వారికి కూడా ఆయుష్మాన్ భారత్ ని అమలు చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుందన్న వార్త మీద ఆయన హర్షం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వాన్ని ఆ విధంగా ఆయన ప్రశంసిస్తూ వస్తున్నారు.
ఇందులో తప్పు పట్టాల్సినది లేదు. ఒక మిత్రుడిగా ఆయన బీజేపీ నిర్ణయాలను సమర్ధిస్తున్నారు. ప్రజలకు మేలు చేసేవి ఉంటే తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ అదే సమయంలో ఇన్ని మంచి పనులు చేస్తున్న కేంద్రం ఏపీ విషయంలో మరిన్ని మంచి పనులు చేయాలని సూచించవచ్చు కదా అనే అంతా అంటున్నారు.
పవన్ చెబితే అది సునామీ అవుతుంది. దాంతో కేంద్రం కూడా ఓకే చెబుతుంది కదా అని చాలా మంది ఆశ పడుతున్నారు. బాబుతో కలసి పవన్ ఢిల్లీ వెళ్ళవచ్చు, లేదా ప్రత్యేకంగా అయినా వెళ్ళవచ్చు. ఆయన ఏపీకి సంబంధించిన సమస్యల మీద కేంద్రంతో చర్చించి సానుకూలం చేసుకుని వస్తే ఆయనకే జన నీరాజనం అందుతుంది కదా అని అంటున్నారు.