టాలీవుడ్ ఏపీకి తరలిరావాలి: డిప్యూటీ సీఎం పవన్
ఈ పర్యటనలో పవన్ ఓ కీలక ప్రకటన చేసారు. తెలుగు చిత్రపరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కి తరలి రావాలని ఈ సందర్భంగా కోరారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విస్త్రతంగా ప్రజల మధ్యకు వెళుతున్న సంగతి తెలిసిందే. ప్రజా సమస్యల్ని పరిష్కరించేందుకు ఆయన తీసుకుంటున్న చొరవకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ శనివారం నాడు పవన్ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన గ్రామాల్లో పర్యటించారు. అందమైన ప్రకృతి నడుమ పర్యటన ఆద్యంతం ఆహ్లాదంగా సాగింది.
ఈ పర్యటనలో పవన్ ఓ కీలక ప్రకటన చేసారు. తెలుగు చిత్రపరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కి తరలి రావాలని ఈ సందర్భంగా కోరారు. ఆంధ్రప్రదేశ్ లో సుందరమైన ప్రదేశాలు చాలా ఉన్నాయని, ఆహ్లాదకరమైన వాతావరణం సినీపరిశ్రమకు అనుకూలంగా ఉంటుందని పవన్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు గ్రామాల్ని సందర్శించిన పవన్ కల్యాణ్ పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. రోడ్లు, గిరిజన గ్రామాల్లో యువత ఉపాధి సహా పలు అంశాల గురించి అధికారులతో చర్చించారు.
పవన్ నోట్ టాలీవుడ్ తరలింపు గురించి మాట వినిపించింది. కానీ రాజకీయ నాయకుల మాటలన్నీ కేవలం నీటి మూటలుగానే మిగిలి పోకూడదని, నిజం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాజకీయ నాయకులు ప్రతిసారీ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. కానీ ప్రాక్టికల్ గా ఏదీ సాధ్యం కావడం లేదు. తెలుగు చిత్రసీమ విశాఖకు తరలి వస్తుందని చాలా కాలంగా ప్రచారం ఉంది.
కానీ అది సాధ్యపడలేదు. స్టూడియోల నిర్మాణానికి పలువురు పెద్దలు ముందకు వచ్చారని ప్రచారం సాగింది. కానీ ఏదీ నిజం కాలేదు. ఏది ఏమైనా ఏపీకి తెలుగు చిత్రసీమ తరలిరాకపోవడం పెద్ద నిరాశ. ఏపీ గ్లామర్ ఇండస్ట్రీ లేక వెలవెలబోతోంది. గ్లామర్ లేని చోటికి పరిశ్రమలు రావు.. ఐటీ ఇండస్ట్రీ రాదు.. పర్యాటకం పెరగదు.. అభివృద్ధి సాధ్యపడదని కూడా యూత్ ఆవేదనలో ఉన్నారు.