మరోసారి పవన్‌ కళ్యాణ్‌ కు అస్వస్థత?

జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.

Update: 2024-10-03 11:11 GMT

జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం తిరుమల పర్యటనలో ఉన్న ఆయన అలిపిరి నుంచి తిరుమలకు వెళ్తూ నడక దారిలోనే అస్వస్థతకు లోనయ్యారు. వెన్నునొప్పి, కాలి నొప్పితో బాధపడ్డారు. దీంతో సహాయకులు ఆయన కండువాలతో విసిరారు. అలాగే ఆయన స్నేహితుడు ఆనంద్‌ సాయి సైతం వెన్నుపైన రుద్దుతూ సపర్యలు చేశారు. తిరుమలకు చేరుకున్నాక అతిథి గృహంలో వైద్యులు ఆయనకు పరిచర్యలు చేశారు. జ్వరంతో బాధపడుతున్నప్పటికీ పవన్‌ వారాహి సభలో ప్రసంగిస్తారని చెబుతున్నారు.

అక్టోబర్‌ 1న అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్న పవన్‌ ఆ రాత్రి తిరుమలలోనే బస చేసి అక్టోబర్‌ 2న ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ఇద్దరు కుమార్తెలు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్, పవన్‌ చిరకాల మిత్రుడు, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి కూడా ఉన్నారు.

కాగా పవన్‌ చిన్న కుమార్తె అంజన పవనోవా క్రిస్టియన్‌ కావడంతో పవన్‌ కళ్యాణ్‌ డిక్లరేషన్‌ ఇచ్చారు. అంజన మైనర్‌ కావడంతో ఆమె తరఫున తండ్రిగా పవన్‌ కూడా డిక్లరేషన్‌ పైన సంతకం చేశారు. స్వామివారిని దర్శించుకున్నాక అక్టోబర్‌ 2న రాత్రి కూడా పవన్‌ తిరుమలలోనే బస చేశారు.

కాగా అక్టోబర్‌ 3న పవన్‌ కళ్యాణ్‌ తిరుమలలో వారాహి బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇందులో సనాతన ధర్మంపై పవన్‌ తన డిక్లరేషన్‌ ను ప్రకటించనున్నారు. ఈ మేరకు స్వామివారి దర్శన సమయంలో ఒక ఎర్ర బుక్కు కూడా పవన్‌ చేతిలోనే ఉంది. ఆ బుక్కుతోనే పవన్‌ అలిపిరి నుంచి తిరుమలకు చేరుకున్నారు.

వారాహి డిక్లరేషన్‌ బుక్‌ ను శ్రీవారి పాదాల దగ్గర ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆ పుస్తకాన్ని చేత పట్టుకొని ఆలయం బయట మీడియాకు ప్రత్యేకంగా చూపించారు.

వారాహి బుక్‌ కవర్‌ పేజీ పైభాగంలో ‘ధర్మో రక్షతి రక్షితః’ అని రాసి ఉంది. ఆ పుస్తకం మధ్యలో వారాహి అమ్మవారి చిత్రం.. ఆ తర్వాత వారాహి డిక్లరేషన్‌ అని రాసి ఉంది. అలాగే.. ‘‘వారాహి డిక్లరేషన్, తిరుపతి, 03–10–2024’’ అని ఆ పుస్తకంపై రాసి ఉంది.

ఈ నేపథ్యంలో ఈ ఎర్రటి రంగులో ఉన్న వారాహి డిక్లరేషన్‌ బుక్‌ సర్వత్రా ఆసక్తి రేపుతోంది. పవన్‌ కళ్యాణ్‌ తిరుమల పర్యటన ఆసాంతం ఈ పుస్తకం ఆయనతోపాటే ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలతో ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ 3న తిరుపతిలో జరిగే వారాహి సభలో ఈ బుక్‌ గురించి పవన్‌ వివరిస్తారని తెలుస్తోంది.

తిరుపతిలోని బాలాజీ నగర్‌ సర్కిల్, వైఎస్‌ వి మ్యూజిక్‌ కాలేజీ దగ్గర ఎస్వీయూ క్లాంపెక్స్‌ స్కూల్‌ లో వారాహి బహిరంగ సభ జరగనుంది. ఈ మేరకు జనసేన పార్టీ సోషల్‌ మీడియాలో ప్రకటించింది. అక్టోబర్‌ 3 సాయంత్రం 4 గంటలకు వారాహి సభ ప్రారంభం కానుంది.

Tags:    

Similar News