వైసీపీని టార్గెట్ చేయడమే పవన్ వ్యూహం !
2024 సాధారణ ఎన్నికల్లో జనసేనకు 21 సీట్లు దక్కాయి. అలాగే ఆరేడు శాతం ఓటు బ్యాంక్ సొంతం అయింది.;
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలలో పండిపోయారు అనే చెప్పాలి. ఆయన పదేళ్ళ రాజకీయ ప్రస్థానం చూస్తే అదే అర్ధం అవుతుంది. ఆయన తాను అనుకున్న పదవులు అందుకోవడానికి ఏమి చేయాలో బాగా తెలుసు అని అంటారు. ఇక ఏపీలో రాజకీయంగా టీడీపీకి ధీటుగా నిలబడాలి అంటే ఏమి చేయాలో అన్నది పవన్ ఇపుడు ఆలోచిస్తున్నారు.
2024 సాధారణ ఎన్నికల్లో జనసేనకు 21 సీట్లు దక్కాయి. అలాగే ఆరేడు శాతం ఓటు బ్యాంక్ సొంతం అయింది. కానీ ఏపీలో నలభై శాతం ఓటు బ్యాంక్ పొందడమే పవన్ మార్క్ టార్గెట్ అని అంటున్నారు. అది జరగాలీ ఏపీలో బలంగా ఉన్న టీడీపీ వైసీపీలో ఒక పార్టీ పొలిటికల్ గా ఎలిమినేట్ కావాలి.
టీడీపీ గ్రాస్ రూట్ లెవెల్ దాకా బలంగా ఉంది. పైగా నారా లోకేష్ ఆ పార్టీకి భవిష్యత్తు నాయకుడిగా బలంగా ఉన్నారు. దాంతో టీడీపీని దెబ్బ తీయడం అసాధ్యం. అదే సమయంలో వైసీపీ తీరు చూస్తే ఒంటి స్తంభం మేడలా ఉంది. ఆ పార్టీకి సర్వం సహా జగనే. ఆయన చుట్టూనే అల్లుకున్న పార్టీ.
ఇక వైసీపీకి జగన్ ఎంత బలమో అంత బలహీనం కూడా అని గడచిన కాలంలో రుజువు అయింది. దాంతో పాటు వైసీపీ 2024లో ఘోరంగా ఓటమి పాలు అయింది. దాంతో వైసీపీని దెబ్బతీయడానికి ఇదే తరుణం అని పవన్ భావిస్తున్నారు అని అంటున్నారు. వైసీపీలో ఉన్న వారికి టీడీపీలో నేరుగా వెళ్ళి చేరడానికి ఇబ్బంది. అలాంటి వారికి జనసేన ఒక బలమైన ఆల్టర్నేషన్ గా కనిపిస్తుంది అని అంటున్నారు.
వైసీపీ చుట్టూ ఉన్న బలమైన సామాజిక వర్గాన్ని ఆకట్టుకుంటే కనుక ఏపీ రాజకీయాల్లో జనసేన తిరుగులేని పార్టీగా ఎదుగుతుదని భావిస్తున్నారు. అందుకే ఆయన రాయలసీమలోనే ఎక్కువగా పర్యటిస్తునారు. ఒక కీలక సామాజిక వర్గం నాయకులను కొనియాడుతున్నారు. వారికి జనసేన అండగా ఉంటుందని చెబుతున్నారు.
దీంతో పాటు ఆయన మరో వ్యూహాన్ని కూడా రచిస్తున్నారు. ఏపీలో 2029 ఎన్నికల్లో జనసేన టీడీపీ విడిగా పోటీ చేస్తే వైసీపీకి చాన్స్ ఉంటుందని ఎవరైనా భావిస్తే అది పొరపాటు అని ఒకటికి పదిసార్లు చెబుతున్నారు. మరో పదిహేనేళ్ళ పాటు కూటమి ఏపీలో కొనసాగుతుంది అని పవన్ చెప్పడం వెనక ఆంతర్యం ఇదే అంటున్నారు. జనసేన టీడీపీ కలసే ఉంటాయన్న సందేశాన్ని అలా ఆయన ఇస్తున్నారు.
ఈ రెండు పార్టీలు కలసి ఉన్నంతకాలం ఏపీలో వైసీపీకి అధికారం దక్కదని కూడా స్పష్టంగా చెబుతున్నారు. అంటే ఒక వైపు టీడీపీతో జనసేన కలసి ఉంటుందని చంద్రబాబే సీఎం గా ఉండాలని చెబుతూ టీడీపీని మెప్పిస్తున్న పవన్ అదే సమయంలో వైసీపీని ఎన్నటికీ అధికారంలోకి రానీయమని చెప్పడం ద్వారా ఫ్యాన్ పార్టీ నేతలకు ఉక్కబోత కలిగేలా చేస్తున్నారు.
ఏపీలో ఉన్న సామాజిక రాజకీయ సమీకరణలను పరిగణనలోకి తీసుకున్న వారు ఎవరైనా కూటమి అధికారంలో ఉంటే ఓట్లు చీలకుండా ఉంటే వైసీపీకి కష్టమే అని భావిస్తారు. అలా వైసీపీ నేతలలో కూడా చర్చ రావాలని ఆ విధంగా వారు జనసేన వైపుగా అడుగులు వేయాలన్నదే పవన్ మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు.
మరి పవన్ మార్క్ వ్యూహానికి వైసీపీ నేతలు పడతారా అన్నదే చర్చగా ఉంది. రాజకీయాల్లో రెండు రెళ్ళు నాలుగు అన్ని వేళలలో కావు అని అంటారు. వైసీపీలో ఉన్న వారు అంతా అనుభవం ఉన్న వారే. పైగా పొత్తుల ఎత్తులు అన్ని ఎన్నికల్లోనూ పారతాయా అంటే అది కూడా డౌటే అని చెబుతారు.
దాంతో కూటమి ఎప్పటికీ కలిసే ఉంటుంది ఓట్లు చీలనివ్వమని పవన్ చెబుతున్నది విపక్షంలో అయితే ఒకలా ఉంటుంది కానీ అధికారంలో ఉన్నపుడు చెబితే వేరేగా మారుతుందని లెక్క వేసే వారు ఉన్నారు. దాంతో వైసీపీ నుంచి జనసేనలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయా లేక ఫ్యాన్ పార్టీదే భవిష్యత్తు అని నేతలలో ధీమా కొనసాగుతుందా అన్నదే చూడాల్సి ఉంది. మొత్తానికి అయితే పవన్ ఒక వైపే చూస్తున్నారు. వైసీపీనే గురి పెడుతున్నారు. దాని ఫలితాలు ఏమిటి అన్నది కాలమే చెప్పాలని అంటున్నారు.