వారాహి సభలో పవన్ ఏమి చెప్పబోతున్నారు ?

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమలలో రెండు రోజులు ఉండబోతున్నారు.

Update: 2024-10-01 11:46 GMT

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమలలో రెండు రోజులు ఉండబోతున్నారు. ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను ఈ నెల 2న తిరుమలలో విరమించనున్నారు. ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అక్టోబర్ 1న నుంచి 3 వరకూ అంటే రెండు రోజుల పాటు తిరుమలలో ఉండబోతున్నారు

ఇక పవన్ తాజా పర్యటన మేరకు చూస్తే ఆయన 3వ తేదీన తిరుపతిలో వారాహి నుంచి ప్రజలను ఉద్దేశించి సభను నిర్వహిస్తారు అని అంటున్నారు. ఇపుడు ఆ సభ మీద అందరి దృష్టి ఉంది. పవన్ ఏమి చెప్పబోతున్నారు అన్నదే అందరిలో కలిగే ఉత్కంఠ.

నిజానికి లడ్డూ ఇష్యూలో సుప్రీంకోర్టు కూడా అక్టోబర్ 3న తీర్పు వెలువరించబోతోంది. ఆ తీర్పు తరువాత పవన్ సభ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హిందూ ధర్మం గురించి అలాగే శ్రీవారి లడ్డూ ప్రసాదం గురించి ఇటీవల వాడిగా వేడిగా వ్యాఖ్యలు చేసిన పవన్ గత కొద్ది రోజులుగా మౌనంగా ఉన్నారు.

అదే సమయంలో సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. అయితే పవన్ షెడ్యూల్ చూస్తే వారాహి సభ తిరుపతిలో జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. నిజానికి సుప్రీం కోర్టు విచారణ కనుక ఈపాటికి జరగకపోయి ఉంటే పవన్ ప్రసంగం ఒక విధంగా ఉండే అవకాశం ఉంది. అయితే సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూడా అందులో ఉన్నాయి.

రాజకీయాల నుంచి దేవుడిని పక్కన పెట్టాలని కూడా కోర్టు సూచించింది. మరో వైపు చూస్తే జగన్ తిరుమల వస్తారని తెలియడంతో గత నెల 27న తిరుమలలో సెక్షన్ 30ని అమలు చేస్తున్నారు. ఇది సరిగ్గా అక్టోబర్ 24 వరకూ ఉండే చాన్స్ ఉంది. అంటే అప్పటి వరకూ సభలూ సమావేశాలు ఎవరూ నిర్వహించకూడదు అని అంటున్నారు.

మరి పవన్ సభకు అనుమతిస్తారా అన్న చర్చ ఉంది. ఇంకో వైపు చూస్తే తిరుపతి ఎంపీ వైసీపీ నేత గురుమూర్తి పవన్ వారాహి సభ మీద మాట్లాడుతూ సుప్రీంకోర్టులో లడ్డూ వివాదం మీద విచారణ జరుగుతున్నందువల్ల పవన్ సభను విరమించుకోవాలని సూచించారు

ఇవన్నీ పక్కన పెడితే గత అయిదేళ్లలో అంటే వైసీపీ పాలనలో హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులు అనేక చోట్ల ఉపచారాలలో జరిగిన అపచారాల మీద పవన్ వారాహి సభలో ప్రస్తావిస్తారు అని అంటున్నారు. దీని మీద పవన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చినట్లుగా ఆయన మీడియాతో మాట్లాడిన మాటలను బట్టి అర్ధం అవుతోంది.తాను చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష లడ్డూ ప్రసాదం గురించి మాత్రమే కాదని గతంలో ఏపీలో అపచారానికి గురి అయిన వందలాది దేవాలయాల గురించే అని ఆయన చెప్పారు.

అంటే ఈ ఇష్యూని పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ముందుకు తీసుకుని వెళ్ళేలాగానే ఉన్నారని అంటున్నారు. ఆయన హిందూ దేవాలయాల మీద వైసీపీ ప్రభుత్వంలో ఉన్నపుడు కలిగిన ఇబ్బందులు అన్నీ ప్రస్తావిస్తారు అని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో లడ్డూ ఇష్యూ నుంచి హిందూ దేవాలయాలు వాటి మీద జరిగిన అపచారాలు దాడులు వంటి వాటి మీదకు మళ్ళితే మరో కొత్త రాజకీయానికి బీజం పడుతుందని అంటున్నారు. చూడాలి మరి పవన్ ఏమి మాట్లాడుతారో.

Tags:    

Similar News