షర్మిల పార్టీ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు...!
రాజకీయాల్లో బలమైన నేపధ్యం కలిగిన షర్మిల వల్ల కాని పని తెలంగాణాలో జనసేన చేసి చూపించింది అని పవన్ చెప్పుకొచ్చారు
షర్మిల వైఎస్సార్టీపీ అంటూ తెలంగాణాలో మూడున్నరేళ్ళ క్రితం పార్టీ పెట్టారు. ఆమె ఏకంగా మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల దాకా పాదయాత్ర చేశారు. అయినా ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. దాంతో ఇదే విషయం మీద పరోక్షంగా పవన్ కళ్యాణ్ మంగళగిరిలో జరిగిన జనసేన పార్టీ క్యాడర్ సమావేశంలో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి కుమార్తె ప్రస్తుత సీఎం సోదరి స్వయంగా పార్టీ పెట్టారు కానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు అంటూ దెప్పి పొడిచారు.
రాజకీయాల్లో బలమైన నేపధ్యం కలిగిన షర్మిల వల్ల కాని పని తెలంగాణాలో జనసేన చేసి చూపించింది అని పవన్ చెప్పుకొచ్చారు. తనకు పొలిటికల్ గా ఏ నేపధ్యం లేకపోయినా పోటీ చేశాను అని ఆయన చెప్పడం విశేషం. షర్మిల పార్టీ తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేయకపొవడాన్ని పవన్ పరోక్షంగా కామెంట్స్ చేయడం చర్చగా మారింది.
పవన్ కూడా 2014లో కొత్తగా పార్టీ పెట్టినపుడు ఎక్కడా పోటీ చేయలేదు. ఇక 2018 నాటికి కూడా ఆయన తెలంగాణా ఎన్నికల్లో పోటీకి దిగలేదు. పార్టీ పెట్టి పదేళ్ల తరువాతనే కదా పోటీ చేసారు అన్న కామెంట్స్ వస్తున్నాయి. అది కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని దిగారని అంటున్నారు. ఇక పవన్ పార్టీ పోటీ మాత్రమే చేసిందని గెలుపు అన్నది ఫలితాల తరువాత చూస్తే తెలుస్తుంది అని అంటున్నారు.
అదే విధంగా షర్మిల పోటీ చేయకపోవడం వెనక వ్యూహం ఉందని అని అంటున్నారు. ఆమె కూడా కోరితే బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చునని అపుడు జనసేన కంటే ఎక్కువ సీట్లలోనే పోటీ చేయవచ్చు అని కూడా అంటున్న వారూ ఉన్నారు.
ఇప్పటిదాకా జనసేన తెలంగాణా మీద గట్టిగా ఫోకస్ చేయలేదని పట్టుమని నాలుగైదు మీటింగులు కూడా పెట్టలేదని కానీ ఎన్నికల్లో పోటీ చేయడం అంటే మామూలు విషయం కాదని పవన్ అన్నారు. జనసేన భావజాలం బలమైనది అని ఆయన చెప్పుకొచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే మొత్తానికి చూస్తే పవన్ సంబరం అంతా పోటీ చేయడం వరకేనా లేక గెలిచి ఏమైనా చూపిస్తారా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.
యువత జనసేనకు ఎక్కువ అని ఆయన అన్నారు. ఏకంగా ఆరున్నర లక్షల మంది యువత జనసేన అసలైన బలం అని ఆయన అంటున్నారు. జనసేనకు కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాదు ఇతర రాష్ట్రాలలోనూ యువత పెద్ద ఎత్తున అభిమానంగా ఉన్నారని అన్నారు.
దేశం కోసం ఆలోచించే పార్టీ జనసేన అని ఆయన అన్నారు. జనసేన దృష్టి కోణం వేరు అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రోజున యువత బలంగా ఉండడం వల్లనే జనసేన వైపు జాతీయ పార్టీలు చూస్తున్నాయని ఆయన అన్నారు. జనసేనకు ఉన్న యువత బలం చూసి బీజేపీ కేంద్ర నాయకత్వం ఆశ్చర్యపోయింది అని ఆయన అన్నారు.
బీజేపీ పెద్దలు కూడా అడిగి మరీ జనసేన కండువా కప్పుకున్నారు అంటే అది జనసేన క్యాడర్ నిబద్ధతకు నిదర్శనం అని ఆయన అన్నారు. జనసేన కోసం యువత నిలబడిందని అన్నారు. తాను తెలంగాణాలో అనేక సభలలో మాట్లాడానని అక్కడ యువత అంతా తన సభలకు విశేషంగా వచ్చారు అని ఆయన అన్నారు. జనసేన పోరాటం అంతా రేపటి తరం కోసమే అని ఆయన వివరించారు. మన సిద్ధాంత బలమే రేపటి భవిష్యత్త్తుని నిర్ణయిస్తుంది అని ఆయన అన్నారు.