ప్రజలు అందుకే మమ్మల్ని గెలిపించారు: పవన్ కల్యాణ్
బలమైన రాజ్యాంగాన్ని గత పాలకులు అన్ని విధాలుగా నిర్వీర్యం చేశారని పవన్ వ్యాఖ్యానించారు.
పరిపాలన పరంగా రాష్ట్రంలో సమూల మార్పు రావాలన్న ప్రధాన ఉద్దేశంతోనే ప్రజలు పూర్తి మెజారీతో తమ కూటమికి అధికారాన్ని అప్పగించారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తాజాగా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న పవన్ కల్యాణ్.. ప్రజల ఆశలు, అభిరుచులకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్లు సహకరించాలని పిలుపు నిచ్చారు. గత ప్రభుత్వ పూర్తి స్థాయిలో వ్యవస్థలను ధ్వంసం చేసిందని, ఇప్పుడు వాటిని బతికించేందుకు, బలోపేతం చేసేందుకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నామని చెప్పారు.
బలమైన రాజ్యాంగాన్ని గత పాలకులు అన్ని విధాలుగా నిర్వీర్యం చేశారని పవన్ వ్యాఖ్యానించారు. ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థను పూర్తి స్థాయిలో చిధ్రం చేశారని ఆరోపించారు. ఎవరినీ పనిచేయకుండా చేశారని, ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో అనుభవజ్ఞడైన సీఎం చంద్రబాబు అనుభవం, ఆయన చేసే దిశా నిర్థేశం, సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని తెలిపారు. వారి అపార అనుభవాన్ని, పరిపాలనా విధానాన్ని, దక్షతను నేర్చుకునేందుకు తనతో పాటు మంత్రి వర్గం అంతా సిద్దంగా ఉందన్నారు.
2047 నాటికి భారత దేశం సూపర్ పవర్ కావాలనే లక్ష్యంలో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ ను నిర్వచించు కున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్లతో పాటు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని పవన్ కోరా రు. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయితీల్లో ఉపాధి హామీ పథకం అమలుపై పలు తీర్మానాలు చేస్తూ గ్రామ పంచాయితీలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.
పిఠాపురం నియోజకవర్గంలో `గ్రే వాటర్` మేనేజ్మెంట్ విధానం ద్వారా లిక్విడ్ వేస్టు మేనేజ్మెంట్ విధానాన్ని అధునాత పద్దతిలో నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద ప్రతి గృహానికీ సురక్షిత తాగు నీటిని సరఫరా చేసేందుకు ఈ నెల 15 నుంచి పల్స్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది గ్రామ పంచాయితీల్లో 5 కోట్ల 40 లక్షల ట్యాప్ కనెక్షన్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని నిర్థేశించుకున్నట్టు చెప్పారు.