తెలంగాణ ఎలక్షన్స్.. జనసేనానికి పొత్తుల చిక్కులు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాదంటే ఒకరికి కోపం.. ఔనంటే మరొకరి కోపం.. వెరసి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాదంటే ఒకరికి కోపం.. ఔనంటే మరొకరి కోపం.. వెరసి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్న సామెతగా మారిపోయింది.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం. తెలంగాణ ఎన్నికల నామినేషన్ల పర్వానికి మరో 20 రోజుల గడువు మాత్రమే ఉంది. నవంబరు 7వ తేదీ నుంచి ఈ ఘట్టం ప్రారంభం కానుంది. అయితే.. ఇప్పటి వరకు జనసేన ఎలాంటి స్టెప్ తీసుకోలేదు. తాను పోటీ చేయాలా? వద్దా..? అనే మీమాంసలోనే పార్టీ అధినేత ఉండిపోయారు.
మరోవైపు.. జనసేన ఒంటరిగానే పోటీ చేయాలని.. ప్రజల్లోకి తాము వెళ్లి కనీసం రెండు మూడు స్థానాల్లో అయినా.. పార్టీని గెలిపించుకుంటామని జనసేన నాయకులు నేరుగా పవన్‌ను కలిసి విన్నవించారు. అంతేకాదు.. పోటీకి దూరంగా ఉంటే.. ఇక, తాము జెండా మోయలేమని, ప్రజలకు ముఖం చూపించలేమని కూడా నిష్కర్షగా తేల్చేశారు. వారి ఆవేదనను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌లో పార్టీని ప్రకటించిన పవన్.. ఇప్పటికి రెండు ఎన్నికల్లో(2014, 2018) పోటీకి దూరంగా ఉన్నారు.
అయితే.. పార్టీ కార్యక్రమాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. తరచుగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లడం, అక్కడ పూజలు నిర్వహించడం తెలిసిందే. ఇక, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి కీలకమైన జిల్లాల్లో మెగా అభిమానులు కూడా ఉన్నారు. దీంతో జనసేన నాయకులు పోటీకి దూకుడుగా ఉన్నారు. అయితే.. దీనిపై పవన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇంతలోనే.. బీజేపీ నుంచి(కేంద్ర పెద్దల నుంచి అనే ప్రచారం ఉంది) ఆయనపై ఒత్తిడి పెరిగింది.
కలిసి పోటీ చేద్దామని.. లేదా మీరు పోటీకి దూరంగా ఉండాలని బీజేపీ నాయకులు తాజాగా పవన్‌ను కోరారు. ఏపీలో బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో తెలంగాణలోనూ కలిసి వెళ్లాలనేది వీరి ఆలోచన. ఈ క్రమంలోనే గతాన్ని పక్కన పెట్టి.. తమతో చేతులు కలపాలని వారు విన్నవించారు. ఇదిలావుంటే.. ఏపీలో వచ్చే 2024 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీకి సిద్ధమవుతున్నానని స్వయంగా పవన్ ప్రకటించారు. ఈ ప్రకటన దరిమిలా.. తెలంగాణ టీడీపీలోనూ ఆశలు చిగురించాయి.
తెలంగాణలోనూ జనసేనతో కలిసి వెళ్తే.. తమకు కనీసం 5 నుంచి 7 స్థానాల్లో విజయం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పొత్తు కోసం చూస్తున్న టీ.. టీడీపీ నేతలు.. జనసేనకు 25 సీట్లు ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. అంటే.. అటు బీజేపీ, ఇటు టీడీపీలు కూడా.. జనసేన పై ఒత్తిడి పెంచుతున్నాయన్నమాట. దీంతో ఎటు వైపు మొగ్గు చూపాలి? అనేది పవన్ కు ఇప్పుడు సంకటంగా మారింది.
పొత్తుల విషయాన్నిపక్కన పెట్టి ఒంటరిగా పోరు కు రెడీ అయ్యే పరిస్థితి ఉందా? అనేది కూడా ప్రశ్న. తరచుగా కేసీఆర్ సర్కారును ప్రశంసిస్తుండడం.. తెలంగాణ బాగుందని చెబుతున్న నేపథ్యంలో అప్రకటితంగా బీఆర్ ఎస్‌ను పవన్ సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.