ముఖ్యమంత్రి సీటు తీసుకునేందుకు రెడీ: పవన్
ముఖ్యమంత్రి అవ్వాలని ఉందని.. పదేళ్లుగా అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని ముందుకు సాగుతున్నానని అన్నారు.
ముఖ్యమంత్రి సీటును తీసుకునేందుకు తాను సంసిద్ధంగానే ఉన్నానని జనసేన అధినేత పవన్ తేల్చి చెప్పారు. అయితే.. ఇది ఎవరినో అడిగి తీసుకోవాలని నేను అనుకోవడం లేదని.. ఎన్నికల్లో వచ్చే సీట్లు, ఓట్లు ఆధారంగానే తీసుకుంటానని చెప్పారు. ముఖ్యమంత్రి అవ్వాలని ఉందని.. పదేళ్లుగా అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని ముందుకు సాగుతున్నానని అన్నారు. రెండు చోట్ల ఓడిపోయినా.. మానసికంగా ఎక్కడా కుంగిపోలేదన్నారు. ప్రజల కోసం ఎన్నో మాటలు పడుతున్నానని చెప్పారు. తాజాగా విశాఖ జిల్లా గాజువాక(గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన నియోజకవర్గం)లో వారాహి యాత్ర 3.0 చేశారు.
ఈ సందర్భంగా ఆదివారం రాత్రి పొద్దుపోయాక నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. ఏపీకి చెందిన ఎంపీలు అంటే.. కేంద్రానికి చులకన అని వ్యాఖ్యానించారు. అందుకే కేంద్రం ఇక్కడి ఎంపీలను, వారు చెప్పే విషయాలను కూడా ఖాతరు చేయడం లేదన్నారు. దీంతో రాష్ట్రంలోని యువత నష్టపోతోందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి కాపాడే ప్రయత్నం తాను చేసినట్టు వివరించారు. ప్రైవేటీకరణ వద్దని.. సొంత గనులు కేటాయించామని కోరానన్నారు. అయితే.. రాష్ట్ర ఎంపీలుగా ఉన్నవారు మౌనం వహిస్తే.. ప్రయోజనం ఏం ఉంటుందని విమర్శించారు.
"కనీసం ఒక్క ఎంపీని గెలిపించి జనసేనకు ఇచ్చి ఉన్నా.. నేను రాష్ట్రం కోసం ఫైట్ చేసేవాడిని. కానీ, మాకు ఎంపీని గెలిపించ లేదు. గెలిచిన వైసీపీ ఎంపీలు పార్లమెంటులో మాట్లాడడం లేదు" అని పవన్ వ్యాఖ్యానించారు. విశాఖ ఎంపీని పవన్ రౌడీషీటర్‌తో పోల్చారు. "ఇక్కడున్న ఒక రౌడీ షీటర్. చర్చి ఆస్తులు దోచేస్తున్నాడు. మీ కోసం దేనినైనా నేను వదులు కోగలను. కేసులు ఉన్న వాడికి, లూటీ చేసే వాడికి ధైర్యం రాదు" అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో డబ్బులకు ఆశపడకుండా.. నాయకుల తీరు తెన్నులను చూసి ఓట్లేయాలని పవన్ పిలుపునిచ్చారు.
అధికారంలోకి రాగానే..
"సిరిపురం జంక్షన్‌లో నాలుగు అంతస్తులకు అనుమతి తీసుకుని 24 అంతస్తులతో భవనాలు నిర్మిస్తున్నారు. ఎవరైనా కొనుగోలు చేస్తే నష్టపోతారు. ఆ భూములకు సంబంధించి ఇప్పటికే కోర్టుల్లో కేసులు ఉన్నాయి. జనసేన అధికారంలోకి రాగానే అక్రమ నిర్మాణాలను కూల్చేస్తాం. గాజువాక ప్రజల సాక్షిగా చెబుతున్నా పొరపాటున ఎవరైనా విశాఖ ఎంపీ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే నష్టపోతారు జాగ్రత్త. విశాఖ ప్రజలను దోచుకునేందుకా ఎంవీవీ సత్యనారాయణ ఎంపీ అయింది" అని పవన్ నిలదీశారు.