పవన్ కు ఏమైంది ?
ఇపుడీ విషయంపైనే అందరిలో చర్చ పెరిగిపోతోంది. వారాహియాత్రలో పవన్ కల్యాణ్ మాట్లాడుతు జనసేన ఎన్డీయేలోనే ఉన్నట్లు చెప్పారు.
ఇపుడీ విషయంపైనే అందరిలో చర్చ పెరిగిపోతోంది. వారాహియాత్రలో పవన్ కల్యాణ్ మాట్లాడుతు జనసేన ఎన్డీయేలోనే ఉన్నట్లు చెప్పారు. తమ పార్టీ ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసిందని ప్రచారం చేయాల్సిన అవసరం వైసీపీకి ఏమొచ్చిందని మండిపడ్డారు. తాను గనుక ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేట్లయితే ఆ విషయం అందరికీ చెప్పేచేస్తానన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే జనసేన ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నది పూర్తిగా ఆ పార్టీ అంతర్గత విషయమే.
అయితే పొత్తుల విషయంలో క్లారిటి లేకపోతే జనాలు అయోమయంలో పడిపోతారు. జనాలను అయోమయంలో పడేస్తే నష్టపోయేది పవనే కానీ జనాలు కాదు. పార్టీపెట్టి పదేళ్ళయినా జనాల ఆమోదం జనసేనకు దక్కని విషయం అందరికీ తెలిసిందే. జనసేనను జనాలు యాక్సెప్ట్ చేయలేదు అనడానికి పోయిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నిదర్శనం. ఇపుడిదంతా ఎందుకంటే ఇదే వారాహియాత్రలో పెడనలో మాట్లాడుతూ తాను ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసినట్లు ప్రకటించింది పవనే.
తెలుగుదేశం పార్టీ పార్టీతో చేతులు కలిపేందుకే తనకు కష్టంగా ఉన్నా ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేసినట్లు పవన్ ప్రకటించారు. ముందే చెప్పుకున్నట్లు ఎన్డీయేలో ఉండాలా లేకపోతే టీడీపీతో చేతులు కలపాలా అన్నది పవన్ ఇష్టమే. అయితే రెండు రోజుల్లో పూర్తి విరుద్ధమైన ప్రకటనలు ఎందుకు చేసినట్లు ? ముందురోజు ఎన్డీయేలో నుండి వచ్చేశానని చెప్పిన పవన్ మరుసటి రోజు తాను ఎన్డీయేలోనే ఉన్నట్లు చెప్పటంలో అర్ధమేంటి ?
పైగా జనసేన గురించి వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేశారంటు మండిపోవటమే విచిత్రంగా ఉంది. జనసేన ఎక్కడున్నా వైసీపీకి అనవసరం. ఎందుకంటే జనసేనను ఒక రాజకీయపార్టీగానే జగన్మోహన్ రెడ్డి అనుకోవటం లేదు. నిలకడలేని విధానాలతో జనాల్లో తాను పలుచనైపోతున్నట్లు పవన్ గుర్తించటంలేదు. ఒకసారేమో తాను ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు అనర్హుడనంటారు. మరోసారి ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతారు. ఒకసారి చంద్రబాబు పల్లకి మోయటానికి తాను సిద్ధంగా లేనంటారు. మరుసటిరోజే టీడీపీతో పొత్తుకు సిద్ధమంటారు. తాను ఏం మాట్లాడుతున్నారో కూడా పవన్ కు అర్ధమవుతున్నట్లు లేదు. ఇందకనే జనాలు జనసేనను పట్టించుకోవటంలేదా ?